Share News

నిధుల కోసం ఎదురుచూపులు!

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:32 AM

స్థానిక సంస్థల నుంచి సెస్‌ బకాయిలు రాబట్టడంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

నిధుల కోసం  ఎదురుచూపులు!

జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.250 కోట్ల సెస్‌ బకాయిలు

జీవీఎంసీ చెల్లించాల్సిందే రూ.200 కోట్లు

మునిసిపాలిటీలు, పంచాయతీలు, ఏపీఐఐసీ మరో రూ.50 కోట్లు

నిర్వహణ, సిబ్బంది జీతాలకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు

ఈ ఏడాది రూ.29.69 కోట్లు వసూలు

విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల నుంచి సెస్‌ బకాయిలు రాబట్టడంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల నుంచి సుమారు రూ.250 కోట్లకుపైగా సెస్‌ బకాయిలు రావాల్సి ఉంది. జీవీఎంసీ రూ.200 కోట్లు, మునిసిపాలిటీలు, పంచాయతీలు, ఏపీఐఐసీ నుంచి రూ.50 కోట్ల బకాయిలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సెస్‌ బకాయిలపై ఎప్పటికప్పుడు సంబంధిత స్థానిక సంస్థల అధికారులను కలిసి విజ్ఞపి ్తచేయడం, కలెక్టర్‌ ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోరూ.29.69 కోట్లు వసూలైంది. ఇందులో జీవీఎంసీ నుంచి రూ.24.58 కోట్లు, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల నుంచి రూ.34.01 లక్షలు, ఏపీఐఐసీ నుంచి రూ.4.19 కోట్లు, గ్రామ పంచాయతీల నుంచి రూ.58.33 లక్షలు వచ్చాయి.

ఉమ్మడి జిల్లాలో శాఖా గ్రంథాలయాలు, విశాఖ నగరంలో ప్రధాన గ్రంథాలయం ఉన్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థకు కొత్త భవనం నిర్మాణ పనులు కార్యరూపం దాల్చలేదు. దీంతో పాలనా కార్యాలయం, లైబ్రరీ వేర్వేరు చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం 64 గ్రంథాలయాల్లో 40 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జీతభత్యాలు, నిర్వహణకు ప్రతి నెలా సగటున రూ.రెండు కోట్ల వరకు అవసరం. మూడు నెలలకు ఒకసారి నిర్వహణ, జీతాల కింద ప్రభుత్వం సుమారు రూ.50 లక్షల వరకు విడుదల చేస్తోంది. మిగిలిన మొత్తం సెస్‌ ద్వారా వచ్చే నిధుల నుంచి కేటాయిస్తున్నారు.

పోస్టుల ఖాళీతో ఇబ్బంది

గ్రంథాలయాల్లో సిబ్బంది పదవీ విరమణలు కొనసాగుతుండగా, కొత్తగా నియామకాలు చేపట్టలేదు. సిబ్బంది కొరతతో ఒక లైబ్రేరియన్‌ రెండు అంతకంటే ఎక్కువ గ్రంథాలయాలను పర్యవేక్షిస్తున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక సిబ్బంది పనిచేస్తున్నారు. నిధుల సమస్యతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పూర్తిగా పుస్తకాలు కూడా అందించలేకపోతున్నారు. గ్రంథాలయ సంస్థను బలోపేతం చేయాలంటే మొదట సొంత భవనం నిర్మించాల్సి ఉంది. అయితే స్థలం ఉన్నప్పటికీ బాలారిష్టాలు వీడడం లేదు. సెస్‌ బకాయిలు వసూలైతే భవన నిర్మాణం పూర్తిచేయగలమని అధికారులు చెబుతున్నారు. కాగా బకాయిలపై సరైన రికార్డులు లేకపోవడం గమనార్హం.

Updated Date - Mar 31 , 2026 | 01:32 AM