Share News

నిధుల కోసం నిరీక్షణ

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:34 AM

వేసవి ఆరంభం నుంచే అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.

నిధుల కోసం నిరీక్షణ

అడవుల్లో వేసవి ముందస్తు పనులకు రూ.12 లక్షలు కేటాయింపు

సాంకేతిక సమస్యతో ట్రెజరీలో ఆగిన నిధులు

అడవుల్లో ఫైర్‌లైన్స్‌ పనులు పూర్తి

కూలీలకు నిలిచిపోయిన చెల్లింపులు

నర్సీపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):

వేసవి ఆరంభం నుంచే అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనివల్ల అటవీ సంపదకు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా వుండేందుకు ప్రభుత్వం ఏటా ముందస్తు చర్యలు చేపట్టడానికి నిధులు మంజూరు చేస్తుంది. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది రూ.12 లక్షలు కేటాయించగా నిధులు ఇంతవరకు అటవీ శాఖకు చేరలేదు. సాంకేతిక సమస్యతో ట్రెజరీలో ఆగిపోయాయని తెలిసింది.

జిల్లాలో 78 వేల హెక్టారుల్లో అటవీ ప్రాంతం ఉంది. ఇందులో అనకాపల్లి రేంజ్‌ పరిధిలో 12,543 హెక్టార్లు, నర్సీపట్నంలో 21,233, కృష్ణాదేవిపేట పరిధిలో 15,953, చోడవరం పరిధిలో 16,953, ఎలమంచిలి పరిధిలో 11,690 హెక్టారుల్లో అడవులు ఉన్నాయి. ఏటా వేసవి కాలంలో వివిధ కారణాల వల్ల అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి వృక్ష సంపద, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతున్నది. కట్టెల కోసం, అటవీ ఉత్పత్తుల సేకరణకు, ఇతర పనుల మీద అడవుల్లోకి వచ్చిన వారు బీడీ, సిగరెట్‌, చుట్ట వంటి వాటిని తాగి, నిప్పు ఆర్పకుండా విసిరేస్తారు. ఇవి ఎండిన ఆకులు, గడ్డిపై పడి, అగ్గి రాజుకొని అడవిని దహనం చేస్తున్నాయి. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగానే అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని డీఎఫ్‌వో శామ్యూల్‌ అన్నారు. వీటని నివారించడానికి అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది అడవుల్లో ఇప్పటికే 30పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవంగా గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు తగ్గాయి.

అటవీ ప్రాంతంలో 45 వేల కిలోమీటర్ల మేర మూడు మీటర్ల వెడల్పుతో ‘ఫైర్‌ లైన్స్‌’ (కందకాలు) ఏర్పాటు చేశారు. దీనివల్ల ఒకచోట అగ్గి రాజకుంటే అది కొంతవరకే పరిమితం అవుతుంది. ఈ ఏడాది పనులు చేయించినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో ఇంతవరకు కూలీలకు డబ్బులు చెల్లించలేదు. కాగా అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను అదుపు చేయడానికి గతంలో బొలేరో వాహనం, వాటర్‌ ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. అయితే నిర్వహణ కొరవడడంతో ఇవి నిరుపయోగంగా మారాయి.

ప్రజలు సహకరించాలి.

ఎం.శామ్యూల్‌, డీఎఫ్‌వో, నర్సీపట్నం

అడవుల్లో అగ్గి రాజుకోకుండా ఉండాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. అడవులకు వెళ్లి నప్పుడు బీడీ, చుట్ట, సిగరెట్‌ వంటి వాటిని తాగి, నిప్పు ఆర్పకుండా కింద పడేస్తున్నారు. దీనివల్ల ఎండిన ఆకులు రాజుకుని అగ్గి పుడుతుంది. అటవీ సంపదకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అడవుల్లో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వండి.

Updated Date - Mar 17 , 2026 | 01:34 AM