Share News

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతుల కోసం నిరీక్షణ

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:19 PM

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి అటవీశాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని, అవి వచ్చిన అనంతరం కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ రాగానే అధికారికంగా పనులు ప్రారంభిస్తామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు.

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతుల కోసం నిరీక్షణ
మాట్లాడుతున్న ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు

స్టేజ్‌-2 అనుమతులు రాగానే పూర్తిస్థాయిలో పనులు మొదలు

పవర్‌ కెనాల్‌ పనులు పూర్తి

పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో రెండు రోజుల్లో విద్యుదుత్పత్తి ప్రారంభం

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు

సీలేరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి అటవీశాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని, అవి వచ్చిన అనంతరం కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ రాగానే అధికారికంగా పనులు ప్రారంభిస్తామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. బుధవారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతానికి స్టేజ్‌- 1 అనుమతులు మంజూరు కావడంతో కొన్ని పనులను మాత్రమే ప్రారంభించామన్నారు. అటవీశాఖ అనుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి, అటవీశాఖ నుంచి కూడా క్లియరెన్సు రావాల్సి ఉందని, సాధ్యమైనంత త్వరగా అనుమతులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిపై కలెక్టర్‌ కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పన అనేది తాము నిర్ణయిస్తామని, అలాగే ప్రాజెక్టు వలన భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి చెల్లించాల్సిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని జాయింట్‌ కలెక్టర్‌ నిర్ణయిస్తారని చెప్పారు. స్టేజ్‌- 2 అనుమతులు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందని, అవి వచ్చిన వెంటనే అధికారికంగా పూర్తిస్థాయిలో అన్ని ప్రదేశాల్లో పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు

సీలేరులో నెలకొల్పే 150 మెగావాట్ల సామర్థ్యం చొప్పున 9 యూనిట్ల 1,350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌లో ఆరు యూనిట్లు 150 మెగావాట్ల సామర్థ్యం చొప్పున 900 మెగావాట్ల ప్రాజెక్టు ఆసియాలోనే రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు పూర్తయితే ఆసియాలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తికి నిర్దేశించిన కాలం ఆరు సంవత్సరాలు అయినప్పటికీ మెగా కంపెనీ వారు ముందుగానే పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

డొంకరాయి పవర్‌ కెనాల్‌ మరమ్మతు పనులు పూర్తి

డొంకరాయి పవర్‌ కెనాల్‌ మరమ్మతు పనులు పూర్తయ్యాయని, అయితే కెనాల్‌లోకి గురువారం నీరు విడుదల చేయాలని భావించినా కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి నీటిని విడుదల చేసే నాలుగు గేట్లకు లీకేజీలు లేకుండా సీళ్లు అమర్చడంతో పాటు యూనిట్‌కు సంబంధించి డ్యాప్‌ట్యూబ్‌ పనులు కొంచెం కష్టతరమైందన్నారు. గేటులో కొన్ని మార్పులు చేయడానికి అవసరమైన సామగ్రి రానున్నదని, వచ్చిన వెంటనే పనులను పూర్తి చేసిన అనంతరం ఎటువంటి లీకేజీలు లేకపోతే నీరు విడుదల చేస్తామన్నారు. రెండు రోజుల్లో యూనిట్లు సిద్ధం చేసుకుని ఒక్కొక్కటిగా వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గత 20 సంవత్సరాల్లో ఈ స్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి సమయం కుదరలేదని, పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో రెండవ దశ 5.6 యూనిట్ల పెన్‌స్టాక్‌ గేట్లు అమర్చడం కోసం ఎక్కవ సమయం కుదిరిందన్నారు. డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రంలో యూనిట్‌ క్యాపిట్‌ ఓవర్‌ హాలింగ్‌ పనులకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో జూలైలో ఒక యూనిట్‌ అందుబాటులోకి వచ్చేలా పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో రెండవ దశలో నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. సీలేరు కాంప్లెక్సులోని అన్ని జలవిద్యుత్‌ కేంద్రాల్లో యూనిట్ల సామర్థ్యం ఎంత ఉంటే అంత సామర్థ్యం గల విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. మిగతా పవర్‌ స్టేషన్లలో 80 శాతం నుంచి 90 శాతం వరకు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. సీలేరు కాంప్లెక్సు జలవిద్యుత్‌ కేంద్రాల్లో 365 రోజులూ విద్యుదుత్పత్తి జరుగుతుందని ఆయన తెలిపారు.

గోదావరి డెల్టాకు నీటి విడుదల కొనసాగింపు

సీలేరు కాంప్లెక్సు నుంచి ప్రస్తుతం నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది 40 టీఎంసీల వరకు ఇరిగేషన్‌ అధికారులు కోరారన్నారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలో, బలిమెలలో 70 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ జాకీర్‌ హుస్సేన్‌, ఇన్‌చార్జి ఈఈ జైపాల్‌, ఏఈ సురేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:19 PM