Share News

వేతన పెంపు కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:43 AM

సమస్యల పరిష్కారం కోసం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

వేతన పెంపు కోసం ఎదురుచూపులు

నాలుగేళ్లుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరీక్షణ ప్రజా ప్రతినిధులకు వినతులు

అయినా పరిష్కారం కాని సమస్యలు

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):

సమస్యల పరిష్కారం కోసం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభు త్వాలు మారుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉద్యోగులు ఎన్‌హెచ్‌ఎంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్నారు. వీరిలో స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు, ఎంఎల్‌హెచ్‌పీల ఉన్నారు. వీరిలో చాలామంది 20 ఏళ్లుగా పనిచేస్తున్నా చాలీచాలని జీతాలతోనే నెట్టుకు వస్తున్నారు. వీరంతా విధుల్లో చేరినప్పుడే ఏటా 5 శాతం వేతనాలు పెంచాలని నిబం ధనల్లో ఉంది. అయితే, ప్రభుత్వాలు వాటిని అమలుచేయడం లేదు. ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రామ్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో నిధులను వెచ్చిస్తూ అమలుచేస్తున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు వినియోగిస్తూ తమకు సకాలంలో జీతాలు పెంచడం లేదని వాపోతున్నారు. 2018లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు 50 శాతం వేతనాలు పెంచారని, 2022లో పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం తమ జీతాలను మాత్రం 21 శాతమే పెంచిందం టున్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ప్రయోజనం దక్కడం లేదని వాపోతున్నారు.

ఇవీ ప్రధానమైన డిమాండ్లు

నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వార్షిక ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలి. అందరికీ ఎంటీఎస్‌ అమలుచేయాలి. హెచ్‌ఆర్‌ సెల్‌ ఏర్పాటుచేసి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పారదర్శకమైన హెచ్‌ఆర్‌ పాలసీని అమలుచేయాలి. యూపీహెచ్‌సీల్లో పనిచేసే స్టాఫ్‌ నర్సుల సెలవులు పునరుద్ధరించాలి. ఖాళీగా ఉన్న పోస్టులను చూపించాలి. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలి. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలి. రేషనలైజేషన్‌ పేరుతో ఉద్యోగులకు నష్టం కలిగించే నిర్ణయాలు మానుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. వివిధ విభాగాల్లో ఒకే క్యాడర్‌లో ఉన్న వేతన వ్యత్యాసాలను సవరించాలి. ఒకే క్యాడర్‌, ఒకే వేతనం విధానాన్ని అమలుచేయాలి. ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులకు సర్వీస్‌ వెయిటేజీ కల్పించాలి.


వెలగని వీధి దీపాలు

అంధకారంలో అనేక ప్రాంతాలు

నగరంలో నిర్వహణ శూన్యం

పట్టించుకోని జీవీఎంసీ అధికారులు

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో వీధిదీపాల నిర్వహణ అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధిదీపాల నిర్వహణ బాధ్యతలు నిర్వరిస్తున్న కాంట్రాక్టర్‌ తగినంతమంది సిబ్బందిని నియమించుకోకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. జీవీఎంసీ పరిధిలోని 1.18 లక్షల వీధిదీపాల నిర్వహణకు వార్డుల వారీగా పెట్రోలింగ్‌ సిబ్బంది, టెక్నికల్‌టీమ్‌లను నియమించాల్సి ఉన్నప్పటికీ మొక్కుబడిగా కొంతమందితోనే కాంట్రాక్టర్‌ నెట్టుకొస్తున్నారు. ఎక్కడైనా వీధిదీపాల పరికరాలు మరమ్మతులకు గురైతే తక్షణం కొత్త వాటిని వేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్‌ స్టోర్‌రూమ్‌లో అరకొర మెటీరియల్‌ ఉండడంతో తీవ్రజాప్యం జరుగుతోంది. దీనివల్ల నగరంలో నిత్యం వీధిదీపాలు సక్రమంగా వెలగక అంధకారం అలముకుంటోంది. తాజాగా ఎనిమిదోవార్డు పరిధి ఎండాడలో వారం రోజులుగా వీధిదీపాలు వెలగకపోవడంతో ఆప్రాంత వాసులు రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధిదీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు కాంట్రాక్టర్‌ పట్ల అమిత ప్రేమను చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Jun 01 , 2026 | 12:43 AM