సొంతింటికి నిరీక్షణ
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:49 AM
జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల ఎంపిక, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు మంజూరు కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో మంజూరై, పూర్తికాని ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం అదనంగాని నిధులు ఇచ్చినప్పటికీ పనులు పూర్తికాని పరిస్థితి నెలకొంది.
గత డిసెంబరునాటికి జిల్లాలో 42 వేల మంది దరఖాస్తు
ప్రభుత్వానికి చేరిన అర్హుల జాబితాలు
ఇంతవరకు లభించని ఆమోదం
గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లల్లో 60 శాతం మాత్రమే పూర్తి
మిగిలిన ఇళ్లకు ప్రభుత్వం అదనపు సాయం
అయినాసరే మందకొడిగానే నిర్మాణ పనులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల ఎంపిక, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు మంజూరు కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో మంజూరై, పూర్తికాని ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం అదనంగాని నిధులు ఇచ్చినప్పటికీ పనులు పూర్తికాని పరిస్థితి నెలకొంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) 2.0 కింద అర్హులైన పేదలకు సొంత ఇళ్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. వితంతువులు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎస్సీ, ఎస్టీలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. కానీ ఇళ్ల మంజూరులో తీవ్ర జాప్యం జరగుతున్నది. పీఎంఏవై 2.0 కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని గత ఏడాది డిసెంబరు నాటికి సుమారు 42 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాలను ప్రభుత్వానికి పంపారు. మరోవైపు ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుండడంతో దరఖాస్తులు అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి పంపిన జాబితాకు ఇంతవరకు ఆమోదం లభించలేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అంతగా లేవని, వేసవి కావడంతో ఇళ్ల నిర్మాణానికి వాతావరణం అనుకూలంగా వుంటుందని, అందువల్ల సత్వరమే ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు మండలాల్లో గృహ నిర్మాణ శాఖ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అమోదం లభించలేదని అధికారులు చెబుతుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
ఇక గత వైసీపీ హయాంలో జగనన్న కాలనీల పేరుతో లేఅవుట్లు వేసి స్థలాలు, ఇళ్లు మంజూరు చేశారు. అయితే చాలాచోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రదేశాలు గ్రామానికి చాలా దూరంలో వుండడం, కొండవాలు ప్రదేశాలు కావడం, లోతట్టు ప్రాంతం కావడం, రహదారులు, నీటిసదుపాయం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. మరికొంతమంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలకపోవడం, బిల్లులు మంజూరు కాకపోవడం, సిమెంటు, ఇసుక, ఇనుమును అధికారులు సరఫరా చేయకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 52 వేల మందికి ఇళ్లు మంజూరుకాగా, ఇంతవరకు 33 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా వున్న ఇళ్లను పూర్తి చేసేందుకు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ నిధులు చాలవన్న ఉద్దేశంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు లబ్ధిదారులు ముందుకు రానిపరిస్థితి నెలకొంది. గత ఏడాది ఐదు వేలమందికి అదనపు ప్రోత్సాహంగా నగదు అందించి, ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, వీరిలో 3,115 మంది మాత్రమే ముందుకొచ్చారు. వీరిలో అనకాపల్లి నియోజకవర్గం లబ్ధిదారులు 293 మంది, చోడవరంలో 384 మంది, మాడుగులలో 426 మంది, నర్సీపట్నంలో 575 మంది, పాయకరావుపేటలో 733 మంది, పెందుర్తి(పరవాడ, సబ్బవరం మండలాలు)లో 277 మంది, ఎలమంచిలిలో 427 మంది వున్నారు. వీరిలో కూడా దాదాపు సగం మంది ఇంకా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయలేదు.