వీఆర్వోల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:18 AM
విజయవాడలో ఫిబ్రవరి ఐదో తేదీన జరిగే ఏపీజేఏసీ అమరావతి మహాజన సభలో వీఆర్వోల పలు ముఖ్యమైన సమస్యలపై చర్చించి, వాటి సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయకుమార్ చెప్పారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయకుమార్ డిమాండ్
ఫిబ్రవరి 5న ఏపీజేఏసీ అమరావతి మహాజన సభ
అనకాపల్లి టౌన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఫిబ్రవరి ఐదో తేదీన జరిగే ఏపీజేఏసీ అమరావతి మహాజన సభలో వీఆర్వోల పలు ముఖ్యమైన సమస్యలపై చర్చించి, వాటి సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయకుమార్ చెప్పారు. ఆదివారం స్థానిక ఎస్‌ఆర్ శంకరన్ భవనంలో వీఆర్వోల సంఘం వ్యవస్థాపకులు ఈర్లె శ్రీరామ్మూర్తి అధ్యక్షతన జరిగిన వీఆర్వోల సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బకాయి పడిన నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని, కొత్త పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, వీఆర్వోలకు రావాల్సిన రూ.40 వేల కోట్లను తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయాల్లోని వీఆర్వోలు తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా పనిచేయాల్సి రావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈర్లె శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, వీఆర్వోలపై పనిభారం పెరిగిందని, దీనిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.అనుపమ మాట్లాడుతూ, సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు లేక వీఆర్వోలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం జిల్లా గౌరవాధ్యక్షునిగా ఈర్లె శ్రీరామ్మూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, శంకరరావు, సాంబశివరావు, జిల్లా అధ్యక్షుడు అమిరపు శశిధర్, చిన్నంనాయుడు, ఆషా తదితరులు పాల్గొన్నారు.