Share News

రయ్‌..రయ్‌...రయ్‌...రేసింగ్‌!!

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:20 AM

రయ్‌...రయ్‌..రయ్‌మంటూ దూసుకుపోయిన మోటార్‌ బైకులను అంతా కళ్లు అప్పగించి చూస్తుండిపోయారు.

రయ్‌..రయ్‌...రయ్‌...రేసింగ్‌!!

అబ్బురపరచిన సాహస విన్యాసాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

రయ్‌...రయ్‌..రయ్‌మంటూ దూసుకుపోయిన మోటార్‌ బైకులను అంతా కళ్లు అప్పగించి చూస్తుండిపోయారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం సాయంత్రం ఫ్లడ్‌ లైట్ల వెలుగులో ఎంఆర్‌ఎఫ్‌ సంస్థ నిర్వహించిన బైక్‌ రేస్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రారంభోత్సవంలో ఫైర్‌ వర్క్స్‌ కాల్చగా, ఆ వెలుగులను అందుకునేందుకు రేసర్లు బైకులతో గాల్లోకి చేసిన జంపింగ్స్‌ ఆహా...అనిపించాయి. సర్కస్‌ ఫీట్లు చేసినట్టు గాల్లోకి బైకులు లేపి, చేతులు వదిలేసి పల్టీలు కొడుతూ, సురక్షితంగా ర్యాంప్‌పై ల్యాండ్‌ అయిన తీరు వారి నైపుణ్యాన్ని చాటి చెప్పింది. ఒకరిద్దరు పట్టు తప్పి కింద పడినా వెంటనే లేచి మళ్లీ పోటీపడిన తీరు క్రీడా స్ఫూర్తిని చాటింది. రాత్రి 11 గంటలకు పోటీలు ముగియగా,విజేతలకు రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ బహుమతులు అందజేశారు.

రెస్క్యూ సెంటర్‌లో ఉన్నది ఒక్క పెద్దపులే

గతంలో సర్కస్‌ కంపెనీల్లో ఉండే జంతువులకు పునరావాసం

వయసు రీత్యా ఒక్కొక్కటి మృత్యువాత

ఆరిలోవ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

రాజమండ్రి సమీపంలో శుక్రవారం పట్టుకున్న పెద్దపులిని శనివారం ఉదయం విశాఖపట్నంలోని జంతు పునరావాస కేంద్రానికి (యానిమల్‌ రెస్క్యూ సెంటర్‌) తీసుకువచ్చారు. ఈ సెంటర్‌లో శనివారం ఉదయం వరకూ ఒక్క జంతువు కూడా లేదు. ప్రస్తుతం పెద్దపులి ఒక్కటే ఉందని జూ అధికారులు తెలిపారు. సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం సర్కస్‌ కంపెనీల్లో జంతువులు ఉండరాదని కేంద్రం వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చింది. దీనికి అనుగుణంగా సర్కస్‌ కంపెనీల్లో ఉన్న జంతువుల సంరక్షణ కోసం దేశంలో పలుచోట్ల యానిమల్‌ రెస్క్యూ కేంద్రాలు నెలకొల్పారు. ఆ విధంగా విశాఖలో ఏర్పాటుచేసిన కేంద్రానికి పలు ప్రాంతాల్లో సర్కస్‌ కంపెనీల నుంచి సింహాలు, పులులు, ఇతర జంతువులను తరలించారు. జూ క్యూరేటర్‌ ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ క్యూరేటర్‌ ఈ రెస్క్యూ కేంద్రాన్ని పర్యవేక్షించేవారు. మరికొందరు సహాయకులు ఉంటారు. అయితే వయస్సు పెరిగిన కారణంగా జంతువులు ఒక్కొక్కటి చనిపోతూ వచ్చాయి. ఇటీవల ఒక సింహాం చనిపోయింది. దీంతో సెంటర్‌ ఖాళీ అయింది. కొన్నిరకాల తాబేళ్లు, గెద్దలు, ఇతర పక్షులు మాత్రమే ఉన్నాయి.


రేపటి నుంచి ‘డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీ’

ప్రతి సోమవారం నిర్వహణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సంబంధిత సమస్యలను మరింత త్వరితంగా పరిష్కరించేందుకు ‘డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎండీ పృథ్వీతేజ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి సోమవారం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. సమస్యలు చెప్పాలనుకునేవారు 8688400499 నంబరుకు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు కాల్‌ చేయవచ్చునన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల్లో జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి వంటి సమ్యలపై ఫిర్యాదు చేయవచ్చునన్నారు.


ఇదేం చోద్యం!?

బహిరంగ మార్కెట్‌ కంటే

ఎక్కువ ధరకు రైతుబజార్‌లో టమాటా విక్రయం

రైతులు తెచ్చిన టమాను పక్కనపెట్టి తాము ఇచ్చిన సరుకు అమ్మాలని అధికారుల ఆదేశం

అక్కయ్యపాలెం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేనప్పుడు సహజంగా కూరగాయల ధరలు పెరుగుతాయి. అటువంటి సమయంలో వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం రంగంలోకి దిగి సబ్సిడీ ధరకు విక్రయిస్తుంటుంది. కానీ ప్రస్తుతం రైతుబజార్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. టమాటా ధర బహిరంగ మార్కెట్‌ కంటే రైతుబజార్‌లో ఎక్కువగా ఉంది. శనివారం బహిరంగ మార్కెట్‌లో రూ.15 ఉంటే, నరసింహనగర్‌ రైతుబజారులో రూ.17కు విక్రయించారు. వీధుల్లో ఏడు కిలోల టమాటా రూ.100 వంతున విక్రయిస్తున్నారు. దీని ప్రకారం కిలో ధర రూ.14 అవుతుంది. కానీ రైతుబజారులో మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. టోకు మార్కెట్‌లో 25 కిలోల క్రేట్‌ రూ.250 వంతున విక్రయించారు. దీనిని బట్టి చూస్తే రైతుబజార్‌లో టమాటా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు ఇట్టే అర్థమవుతుంది. ఇదిలావుండగా...తాము ఎంతో శ్రమించి టమాటా పండించి రైతుబజార్‌కు తీసుకొస్తే వాటిని కాకుండా తాము సరఫరా చేస్తున్న సరుకునే విక్రయించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీనివల్ల తాము తీసుకొచ్చిన టమాటాను పారబోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దృష్టి సారించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:20 AM