ఉత్సాహంగా ఓటింగ్
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:30 AM
ఉత్సాహంగా ఓటింగ్
రెండో దశ పంచాయతీల్లో 83.54 శాతం పోలింగ్
అత్యధికంగా అచ్యుతాపురం మండలంలో 87.01 శాతం
అత్యల్పంగా పాయకరావుపేటలో 75.84 శాతం
మొత్తం ఓటర్లు: 3,57,981
పోలైన ఓట్లు: 2,99,074
పురుషులు: 1,45,772, మహిళలు 1,53,300, ఇతరులు 2
చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఐసీ, ఎస్పీ
అనకాపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎనిమిది మండలాల్లోని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు ఆదివారం నిర్వహించిన రెండో దశ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. ఏకగ్రీవాలు పోను మిగిలిన పంచాయతీల్లో 184 సర్పంచ్ పదవులకు, 1,569 వార్డులకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 83.54 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రితోపాటు ఆమె కుమారుడు కూడా ఓటు వేశారు. ఒకటి, రెండుచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
జిల్లాలో రెండో దశలో పాయకరావుపేట, కోటవురట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లోని పంచాయతీల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు. గ్రామీణులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరున్నర గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. ఉదయం తొమ్మిది గంటల సమయానికి పెద్ద పంచాయతీల్లోని పోలింగ్ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి కనిపించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు క్యూ లైన్లలో నిల్చుని ఓట్లు వేశారు. నడవలేని స్థితిలో వున్న వయోవృద్ధులతోపాటు దివ్యాంగులను వారి కుటుంబ సభ్యులు పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయించారు. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత విద్య, ఇతర వ్యాపకాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో వుంటున్న ఓటర్లు.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి శనివారంనాడే తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ కారణంగానే భారీ స్థాయిలో పోలింగ్ నమోదైందని భావిస్తున్నారు.
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు పదవులు మినహా మిగిలిన సర్పంచ్ పదవులు, వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం 1,759 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 2,77,098 (77.41 శాతం) మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, పోటింగ్ ముగిసే సమయానికి (ఒంటి గంటకు) 83.54 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ నిర్వహించిన పంచాయతీల్లో మొత్తం 3,57,981 మంది ఓటర్లకుగాను 2,99,074 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,45,772 మంది, మహిళలు 1,53,300 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
అచ్యుతాపురంలో అత్యధిక పోలింగ్
అచ్యుతాపురం మండలంలో అత్యధికంగా 87.01 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 73,567 మంది ఓటర్లకుగాను 55,794 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 27,698 మంది, మహిళలు 28,096 మంది వున్నారు. మిగిలిన ఎలమంచిలి మండలంలో 86.85 శాతం, నక్కపల్లిలో 86.15 శాతం, రాంబిల్లిలో 85.75 శాతం, కోటవురట్లలో 85.54 శాతం, మునగపాకలో 84.76 శాతం, ఎస్.రాయవరంలో 83.02 శాతం, పాయకరావుపేటలో అత్యల్పంగా 75.84 శాతం పోలింగ్ జరిగింది.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా నేతృత్వంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఒకటి, రెండుచోట్ల మినహా మరెక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. కాగా కోటవురట్ల మండలం కైలాసపట్నం పోలింగ్ కేంద్రం వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. అచ్యుతాపురం మండలం పూడిమడక పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ విజయ కృష్ణన్ సందర్శించారు. రేంజ్ ఐజీ గోపీనాఽథ్ జట్టి ఎలమంచిలి మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామాలైన జంపపాలెం, షేకిళ్లపాలెంల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో, ఫలితాలు వెల్లడించిన తరువాత చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ తుహీన్ సిన్హా మునగపాక మండలం నాగులాపల్లి, అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.