మందకొడిగా సర్
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:28 AM
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో భారీగా ఓట్లు పోయే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
జిల్లాలో ఇప్పటివరకూ 33.57 శాతం మాత్రమే డిజిటలైజేషన్
ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేసి బీఎల్‌ఓకు అందజేసేందుకు ముందుకురాని ఓటర్లు
14లోగా ఇవ్వకుంటే ఓటు గల్లంతే
నేడు, రేపు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో భారీగా ఓట్లు పోయే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా నగర పరిధిలో ఎక్కువ పోతాయని అంటున్నారు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అఽధికారులు (బీఎల్‌వో) ఇళ్లకు వచ్చి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. వాటిని తిరిగి అందజేసేందుకు అనేకమంది ఆసక్తి చూపడం లేదు. ఎన్యుమరేషన్ ఫారాన్ని ఓటరు ఈనెల 14వ తేదీలోగా ఆయా ప్రాంతాల్లోని బీఎల్‌వోలకు ఇవ్వాలి. ఆరోజుకు అందిన ఎన్యుమరేషన్ ఫారాల మేరకు ఈనెల 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని సెప్టెంబరు 18వ తేదీలోగా పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబరు 22న ప్రకటించనున్నారు. అందువల్ల ప్రతి ఓటరు తీసుకున్న ఎన్యుమరేషన్ ఫారాన్ని ఈనెల 14వ తేదీలోగా తిరిగి అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో శుక్రవారం వరకు 20,23,009 మంది ఓటర్లకుగాను 19,76,532 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. ఆ ఫారాల్లో వివరాలు పూరించి 6,79,097 మంది (33.57 శాతం) మాత్రమే బీఎల్‌వోలకు అందజేశారు. జిల్లాలో ముఖ్యంగా నగర పరిధిలో ఫారాలు తీసుకున్నవారు వెనక్కి ఇచ్చేందుకు చొరవ చూపడం లేదనే బీఎల్‌వోలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఎన్యుమరేషన్ ఫారం తిరిగి ఇవ్వరో...వారి ఓటు పోతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు చెబుతున్నారు. కాగా 2002 ఓటరు జాబితాలో ఓటు లేనివారు ఫారంతో పాటు పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి అందజేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్ని సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది.
ఆరుగురు బీఎల్‌వోలు సస్పెన్షన్
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో నిర్లక్ష్యంగా వహించిన ఆరుగురు బూత్ లెవెల్ ఆఫీసర్ల (బీఎల్‌వోలు)ను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సస్పెండ్ చేశారు. భీమిలి పట్టణానికి బీఎల్‌వో సువర్ణ (పోలింగ్ స్టేషన్- 177), వి.వెంకటసాయి శరణ్ (359), ‘సౌత్’లో ఎండీ షాహిద్ (పోలింగ్ స్టేషన్ 66), బి.లక్ష్మినిహారిక (220), తూర్పు పరిధిలో చిట్టిబోయిన గంగాజలం (పోలింగ్ స్టేషన్ 272), చేపల రామాంజనేయులు (114, 123)పై చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
బియ్యం కుంభకోణం..
42 రైస్ మిల్లులకు నోటీసులు
రికార్డులు సమర్పించాల్సిందిగా అధికారుల ఆదేశం
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తిలోని పౌర సరఫరాల శాఖ గోదాముకు కల్తీ బియ్యం సరఫరా ఉదంతంలో నాలుగు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి) జిల్లాల్లోని 42 రైస్‌మిల్లుల యజమానులకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు నోటీసులు జారీచేశారు. అన్ని రికార్డులు సమర్పించాలని ఆదేశించారు. అసలు ఏం జరిగిందంటే...పౌర సరఫరాల సంస్థ సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు ఇస్తుంది. ఆ ధాన్యాన్ని మరపట్టి బియ్యాన్ని తిరిగి పౌర సరఫరాల సంస్థకు మిల్లర్లు సరఫరా చేయాలి. వాటిని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా పిలుస్తారు. అయితే ఆ బియ్యం (సీఎంఆర్)లో చిరు వ్యాపారులు, దళారులు, డీలర్ల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని కలిపి పెందుర్తిలోని గోదాముకు సరఫరా చేశారనేది ప్రధాన అభియోగం. మిల్లర్లతో స్థానిక అధికారులు, సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి రెండు బృందాలు వచ్చి గోదాములో తనిఖీలు నిర్వహించాయి. బియ్యం నమూనాలు తీసుకువెళ్లాయి. మరోవైపు మిల్లు నుంచి గోదాముకు బియ్యం రవాణా చేసిన లారీలకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్లలో తేడాలు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్ల నుంచి వివరణ తీసుకోవాలని అధికారులు నిర్ణయించి నోటీసులు జారీచేశారు. నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
నాలుగు మిల్లులకు నోటీసులు
విశాఖ జిల్లాలో నాలుగు మిల్లులకు అధికారులు నోటీసులు జారీచేశారు. పద్మనాభం మండలం పాండ్రంకిలోని గణేష్ రైస్‌మిల్లు, బాకూరుపాలెంలో శ్రీలక్ష్మిసాయి రైస్‌మిల్లు, శొంఠ్యాంలో తిరుమల నాగేంద్ర, నేరేళ్లవలసలోని సాయి శ్రీనివాస్ రైస్‌మిల్లులకు నోటీసులు ఇచ్చారు. ఈ నాలుగు మిల్లులు పౌర సరఫరాల సంస్థ గోదాముకు బియ్యం సరఫరా చేశాయి. లారీలకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్లలో తేడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించడంతో నాలుగు మిల్లులకు నోటీసులు జారీచేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి తెలిపారు.
జల్లులు
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలో జల్లులు ప్రారంభమయ్యాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచి తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం నగరంలో కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. శనివారం నగరంలో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.