Share News

పోటెత్తిన ఓటరు

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:57 AM

జిల్లాలో ఎనిమిది మండలాల్లోని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు గురువారం నిర్వహించిన తొలి దశ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. ఏకగ్రీవాలు పోను మిగిలిన 186 పంచాయతీలు, 1,682 వార్డులకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 81.48 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

పోటెత్తిన ఓటరు
సబ్బవరం మండలం అసకపల్లిల్లో క్యూలో నిల్చున్న ఓటర్లు

తొలి దశ పంచాయతీల్లో 81.47 శాతం పోలింగ్‌

అత్యధికంగా రోలుగుంట మండలంలో 88.34 శాతం

అత్యల్పంగా చోడవరంలో 76.82 శాతం

మొత్తం ఓటర్లు: 3,92,343

పోలైన ఓట్లు: 3,19,654

పురుషులు: 1,53,081, మహిళలు 1,66,569, ఇతరులు 4

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

అనకాపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎనిమిది మండలాల్లోని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు గురువారం నిర్వహించిన తొలి దశ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. ఏకగ్రీవాలు పోను మిగిలిన 186 పంచాయతీలు, 1,682 వార్డులకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 81.48 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

జిల్లాలో తొలి దశలో అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేట, చోడవరం, రావికమతం, రోలుగుంట, పరవాడ, సబ్బవరం మండలాల్లోని పంచాయతీల్లో గురువారం పోలింగ్‌ నిర్వహించారు. గ్రామీణులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల బాట పట్టారు. ఉదయం తొమ్మిది గంటల సమయానికి దాదాపు అన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి కనిపించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎంతో ఓపికతో క్యూ లైన్లలో నిల్చుని ఓట్లు వేశారు. మంచాలకే పరిమితమైన వయోవృద్ధులతోపాటు దివ్యాంగులను వారి కుటుంబ సభ్యులు పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయించారు. వీరిలో కొంతమందిని వీల్‌చైర్లలో తీసుకురాగా, ఎక్కువ మందిని వారి కుటుంబ సభ్యులు మోసుకుంటూ తీసుకువచ్చారు. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత విద్య, ఇతర వ్యాపకాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో వుంటున్న ఓటర్లు.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి బుధవారంనాడే తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ కారణంగానే భారీ స్థాయిలో పోలింగ్‌ నమోదైందని భావిస్తున్నారు.

జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఏకగ్రీవమైన సర్పంచ్‌, వార్డు పదవులు మినహా మిగిలిన సర్పంచ్‌ పదవులు, వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం 1,860 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు 33.7 శాతం, 11 గంటలకు 64.73 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 76.72 శాతం, ఒంటి గంటకు 81.47 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ నిర్వహించిన పంచాయతీల్లో మొత్తం 3,92,343 మంది ఓటర్లకుగాను 3,19,654 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,53,081 మంది, మహిళలు 1,66,569 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు.

రోలుగుంటలో అత్యధిక పోలింగ్‌

రోలుగుంట మండలంలో అత్యధికంగా 88.34 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం 35,349 మంది ఓటర్లకుగాను 31,243 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన బుచ్చెయ్యపేట మండలంలో 85.25 శాతం, సబ్బవరంలో 84.35 శాతం, రావికమతంలో 83.86 శాతం, పరవాడలో 81.08 శాతం, కశింకోటలో 79.48 శాతం, అనకాపల్లిలో 78.03 శాతం, చోడవరం మండలంలో 76.82 శాతం పోలింగ్‌ నమోదైంది.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా నేతృత్వంలో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటుచేసుకోలేదు. ప్రధానంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అసాధారణ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రూట్‌ మొబైల్స్‌, స్ర్టై్ట్రకింగ్‌ ఫోర్స్‌, సీసీ కెమెరాలు, బాడీ వోర్న్‌ కెమెరాలు, వీడియోగ్రఫీ, డ్రోన్‌లను ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, పాత నేరస్థులను ముందుగానే బైండోవర్‌ చేశారు. దీంతో మొదటి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

ఓటు వేసిన ప్రముఖులు

మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దంపతులు తమ స్వగ్రామమైన పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు కొత్తూరు పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. సబ్బవరం మండలం మొగలిపురంలో ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ గండి బాబ్జీ దంపతులు తమ ఓటు హక్కును వినియోగంచుకున్నారు.

పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సబ్బవరం మండలం అసకాపల్లి, సబ్బవరం పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. సబ్బవరంలో తాగునీటి వసతి సరిగా కల్పించలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరవాడ మండలం వాడచీపురుపల్లి, ముత్యాలమ్మపాలెంలో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా అనకాపల్లి మండలం మార్టూరు, చోడవరంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. కశింకోట మండలం జట్టపురెడ్డి తుని, తాళ్లపాలెంలో ఓట్లను లెక్కింపును రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రోణంకి గోపాలకృష్ణ పరిశీలించారు.

మొదటి దశ ఎన్నికలు జరిగిన మండలాల్లో పోలింగ్‌ వివరాలు

మండలం పోలింగ్‌ మొత్తం పోలైన ఓట్లు శాతం

బూత్‌లు ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

అనకాపల్లి 261 61,437 22,979 24,961 0 47,940 78.03

కశింకోట 248 46,474 17,384 19,552 0 36.936 79.48

చోడవరం 317 70,539 25,936 28,253 0 54,189 76.82

బుచ్చెయ్యపేట 273 47,367 19,506 20,872 1 40,379 85.25

రావికమతం 194 40,226 16,159 17,575 0 33,734 83.86

రోలుగుంట 204 35,349 14,900 16,326 2 31,228 88.34

పరవాడ 164 44,926 17,533 18,893 1 36,427 81.08

సబ్బవరం 199 46,025 18,684 20,137 0 38,821 84.35

మొత్తం 1,860 3,92,343 1,53,081 1,66,569 4 3,19,654 81.47

Updated Date - Nov 27 , 2026 | 01:57 AM