Share News

ఫొటోతో కూడిన ఓటర్‌ స్లిప్పులు అందజేయాలి

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:57 AM

జీవీఎంసీ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లందరికీ ఫొటోతో కూడిన ఓటర్‌స్లిప్పులను నిర్ణీత గడువులోగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు.

ఫొటోతో కూడిన ఓటర్‌ స్లిప్పులు అందజేయాలి

జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లందరికీ ఫొటోతో కూడిన ఓటర్‌స్లిప్పులను నిర్ణీత గడువులోగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జీవీఎంసీ పాతకౌన్సిల్‌హాల్‌లో శుక్రవారం ఆయన జీవీఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థుల తుదిజాబితా ప్రచురించిన వెంటనే బ్యాలెట్‌పేపర్ల ముద్రణ, ఇతర ఎన్నికల ప్రక్రియలను వేగంగా చేపట్టాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఈనెల 26, 27 తేదీల్లో రెండోవిడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు సూచించారు. మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయడం, సీటింగ్‌ ఏర్పాట్లపై మ్యాప్‌, స్కెచ్‌ను ముందుగానే సిద్ధం చేసి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియపై సంబంధిత అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్‌ సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లందరికీ ఫారం-22 అందజేయాలని, ఈనెల 26, 27 తేదీల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో నిబంధనల మేరకు పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఈ సమావేశంలో జవీఎంసీ అధికారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:57 AM