సమస్యలపై గళం
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:14 AM
జిల్లాలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, ఆరోగ్యం వంటి సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు గళమెత్తారు. వేసవి సీజన్‌లో గ్రామాల్లో తాగునీటి సరఫరా చేయాలని, శివారు ప్రాంతాలు, గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న రోడ్లు మరమ్మతులు చేయాలని, ప్రధానంగా చోడవరం నుంచి రావికమతం వరకు రోడ్డు మరమ్మతులు చేయకపోతే వాహన రాకపోకలు నిలిచిపోతాయని సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.
- ఇంటింటికి కొళాయిల కోసం రోడ్లు తవ్వేశారు
- వేసవిలో తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలి
- గిరిజన గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్య
- చోడవరం- రావికమతం రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలి
- అనకాపల్లి ఆస్పత్రిలో అంబులెన్సుల కొరత
- జడ్పీ సమావేశంలో సభ్యుల ఏకరువు
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, ఆరోగ్యం వంటి సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు గళమెత్తారు. వేసవి సీజన్‌లో గ్రామాల్లో తాగునీటి సరఫరా చేయాలని, శివారు ప్రాంతాలు, గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న రోడ్లు మరమ్మతులు చేయాలని, ప్రధానంగా చోడవరం నుంచి రావికమతం వరకు రోడ్డు మరమ్మతులు చేయకపోతే వాహన రాకపోకలు నిలిచిపోతాయని సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. కశింకోట ఆర్‌ఈసీఎస్‌ను ఈపీడీసీఎల్‌లో విలీనం తరువాత మొత్తం ఆస్తుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో పడకల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలు విస్తరణ, అంబులెన్సులు పెంచాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి అజెండా అంశాలను వివరిస్తూ గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సభ ముందు ఉంచారు. అనంతరం తాగునీటి సమస్యపై విశాఖ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ ఎఎస్‌ఈ రామస్వామి మాట్లాడుతూ తాగునీటి పఽథకాల నిర్వహణకు నిధులకోసం ప్రతిపాదించగా, కొన్ని పథకాలకు నిధులు విడుదలయ్యాయన్నారు. పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు మాట్లాడుతూ తాణం గ్రామంలో బోర్లు నుంచి కలుషిత నీరు వస్తోందని ఆందోళన వ్యక్తంచేయగా, శ్యాంపిల్స్ తీసుకుని కారణాలు తెలుసుకుంటామని ఎస్‌ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అనకాపల్లి, గొలుగొండ ఎంపీపీల గొర్లె సూరిబాబు, జి.మణికుమారి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కొళాయిల కోసం రోడ్లు తవ్వేసిన తరువాత పూడ్చలేదని ఆరోపించారు. దీని వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొనగా అనకాపల్లి ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ అనిల్‌కుమార్ స్పందించి తవ్వేసిన రోడ్లు పూడ్చుతామని, ఇందుకు నిధులు ఉన్నాయన్నారు. సబ్బవరంలో పలు చోట్ల నీటి కొరత ఉందని ఎంపీపీ బోకం సూర్యకుమారి ఫిర్యాదు చేశారు. కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ వేసవి కాలంలో పశువులకు నీటి కొరత లేకుండా తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. సభ్యుల ఆందోళనపై చైర్‌పర్సన్ స్పందించి, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు విస్తరించాలని సూచించారు.
గిరిజన గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య
మాడుగుల మండలంలోని గిరిజన గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య ఉందని ఎంపీపీ రాజారాం తెలిపారు. దీని వల్ల ఆయా గ్రామాల్లో రాత్రి విద్యుత్ సరఫరా ఉండడంలేదని, నీటి పథకాల మోటార్లు కాలిపోవడంతో ప్రజలకు నీరు అందించలేకపోతున్నారన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ గిరిజనులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని, అయితే రోలుగుంట మండలంలో గిరిజనులకు విద్యుత్ బిల్లులు రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మునగపాక జడ్పీటీసీ సభ్యుడు పీఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి, అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ లైన్ల నిర్వహణలో ఇబ్బందులున్నాయన్నారు. కఽశింకోట ఆర్‌ఈసీఎస్‌ను ఈపీడీసీఎల్‌లో విలీనం తరువాత ఆస్తులు మదింపుచేసి ప్రకటించాలన్నారు. నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు ఆర్.రమణమ్మ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలన్నారు. చోడవరం నుంచి మాడుగుల వైపుగా వెళ్లే రోడ్లు మరమ్మతులు చేస్తున్నారని, అయితే రావికమతం వైపు రోడ్డు నిర్మాణాలు ఎప్పుడు పూర్తిచేస్తారని మాడుగుల ఎంపీపీ రాజారాం ప్రస్తావించగా, వేచలం నుంచి చోడవరం రోడ్డు పూర్తిచేయాలని దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రిసత్యం కోరారు. సబ్బవరం మండలంలో గుళ్లేపల్లి వద్ద కల్వర్టు పూడ్చాలని ఎంపీపీ సూర్యకుమారి కోరారు. మాడుగుల ఎంపీపీ రాజారాం మాట్లాడుతూ పెద్దేరు రిజర్వాయర్‌లో రూ.80 కోట్లతో చేపడుతున్న సిమెంట్ లైనింగ్ కోసం 60 టన్నుల బరువు ఉండే వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రస్తావించగా, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ బదులిస్తూ రోడ్డు నిర్మాణాలు తరువాత పెద్దేరు పని వచ్చిందని, ఒకవేళ రోడ్లు దెబ్బతింటే మరమ్మతులు చేస్తామన్నారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని అదికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ ప్రక్రియ పక్కాగా పూర్తిచేయాలన్నారు. పలు సమస్యలపై సభ్యులు లేవనెత్తిన అంశాలను సీరియస్‌గా తీసుకుని వీలైనంత త్వరగా నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలన్నారు. గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు మరింతగా విస్తరించాలని, ఆదివారం వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అంబులెన్స్‌ల సంఖ్య పెంచాలన్నారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ మాట్లాడుతూ బాలికా సంరక్షణ పథకానికి రావల్సిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని విడుదల చేసి లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు.