Share News

పాఠశాల నుంచే వృత్తి విద్య

ABN , Publish Date - Jan 25 , 2026 | 01:20 AM

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి విద్యలో మెలకువలు నేర్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

పాఠశాల నుంచే వృత్తి విద్య

31 ఉన్నత పాఠశాలల్లో 2,300 మందికి బోధన

కంప్యూటర్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, అపెరల్‌, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, రిటైల్‌, ఆహార ఉత్పత్తుల తయారీలో శిక్షణ

48 మంది వృత్తివిద్యా శిక్షకులు నియామకం

ట్రేడ్‌ల వారీగా కిట్లు సరఫరా

రాష్ట్రస్థాయిలో అవార్డులు దక్కించుకున్న గోపాలపట్నం, పెందుర్తి విద్యార్థులు

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి విద్యలో మెలకువలు నేర్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. తమ కాళ్లపై తాము నిలబడడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2016లోనే వృత్తివిద్యాకోర్సులు ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కోర్సులను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం జిల్లాలోని 31 ఉన్నత పాఠశాలల్లో 10 ట్రేడ్‌లలో 2,300 మంది విద్యార్థులకు వృత్తి విద్యా బోధన, శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం 48 మంది శిక్షకులను నియమించారు. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, కంప్యూటర్‌ కోర్సులు, వస్త్ర పరిశ్రమ, ఆటోమొబైల్‌, వ్యవసాయం, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఆరోగ్య రక్షణ, ఆహార తయారీ, రిటైల్‌, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌ రంగాల్లో వృత్తి విద్యాకోర్సులు అందిస్తున్నారు. ఆయా రంగాలకు సంబంధించి విద్యార్థులకు వారానికి మూడు రోజులు థియరీ, మూడు రోజులు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. సెలవు దినాల్లో ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రియల్‌ టూర్లకు తీసుకువెళ్లి నిపుణులతో సందేహాలు నివృత్తి చేయిస్తున్నారు.

నాలుగు దశలలో శిక్షణ:

జిల్లాలో 31 ఉన్నత పాఠశాలలు, ప్లస్‌టూ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు వృత్తివిద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక విషయాలు బోధిస్తున్నారు. తొమ్మిది నుంచి ప్లస్‌టూ విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్స్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. తొమ్మిదో తరగతి లెవెల్‌-1, పదో తరగతికి లెవెల్‌-2, ఇంటర్‌లో ప్రథమ ఏడాదికి లెవెల్‌-3, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు లెవెల్‌-4 కింద శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 60 శాతం పాఠశాలల్లో ఒక ట్రేడ్‌, 30 శాతం పాఠశాలల్లో రెండు ట్రేడ్‌లు, పది శాతం స్కూళ్లలో మూడు ట్రేడ్‌లు ఉన్నాయి. శిక్షణ కోసం ప్రతి ట్రేడ్‌కు ఒక కిట్‌ అందజేస్తున్నారు. అయితే ఎక్కువమంది విద్యార్థులు కంప్యూటర్‌ శిక్షణ వైపు మొగ్గుచూపుతున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు, బహుమతులు గెల్చుకున్న విద్యార్థులు

జిల్లాలో పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక ఉన్నత పాఠశాలల విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా ఆయా ట్రేడ్‌లలో తయారుచేసిన వస్తువులను మండల, జిల్లా స్థాయిలో ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అపెరల్‌ ట్రేడ్‌లో టైలరింగ్‌ ద్వారా పలు వస్తువులు తయారుచేసిన గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సంపాదించి రూ.25 వేల నగదు బహుమతి గెల్చుకుకున్నారు. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ట్రేడ్‌లో ఫేసియల్‌, వాయిస్‌ ద్వారా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రాకు సంబంధించి పెందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన మోడల్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం లభించింది. ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌నుంచి తప్పించుకునేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుందని పెందుర్తి ఉన్నత పాఠశాలలో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో శిక్షణ ఇచ్చే సతీష్‌కుమార్‌ తెలిపారు. ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులు పాఠశాల అవసరాలకు స్మార్ట్‌ ఎలక్ట్రికల్‌ ఫుడ్‌ వెహికల్‌ రూపొందించారు. వర్షాకాలంలో పిల్లలకు తరగతి వద్దకే మధ్యాహ్న భోజనం అందించేందుకు ఈ వాహనం రూపొందించామని శిక్షకులు పి.మహేష్‌ తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు, భవిష్యత్తులో తాము ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి అండగా ఉండేందుకు వృత్తివిద్యాకోర్సులు దోహదపడతాయని జిల్లా కో-ఆర్డినేటర్‌ సుధాకర్‌ తెలిపారు.

ఉన్నత విద్యాకోర్సులకు ఉపయోగం

డాక్టర్‌ చంద్రశేఖర్‌, అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌, సమగ్రశిక్ష

ఉన్నత విద్యలో ప్రవేశించే సమయంలో పాఠశాలలో నేర్చుకునే వృత్తి విద్యాకోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మంచి ఆవిష్కరణలు చేయడానికి దోహదపడతాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం. గత నెలలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులకు బహమతులు వచ్చాయి. మరిన్ని వినూత్న ప్రాజెక్టులు తయారుచేసి జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేస్తాం.

Updated Date - Jan 25 , 2026 | 01:20 AM