Share News

వీఎంఆర్‌డీఏ టెండర్లలో మాయాజాలం

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:19 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) భవనాలు, పార్కుల నిర్వహణకు మరోమారు టెండర్లు పిలిచింది. సిరిపురంలో ఉద్యోగ భవన్‌, ది డెక్‌, చిల్డ్రర్‌ ఎరీనా, గురజాడ కళాక్షేత్రం, బీచ్‌రోడ్డులో మ్యూజియాలు, నగరంలో వివిధ పార్కులు, వాణిజ్య సముదాయాలతో పాటు కైలాసగిరి నిర్వహణ పనులకు రెండు నెలల క్రితం రూ.4.5 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. వాటిలో నిబంధనలు కొందరికే అనుకూలంగా ఉన్నాయని విమర్శలు రావడంతో ఇటీవల రద్దు చేశారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచారు.

వీఎంఆర్‌డీఏ   టెండర్లలో  మాయాజాలం

భవనాలు, మ్యూజియాలు, పార్కుల

నిర్వహణకు గతంలో ఒకసారి ప్రకటన విడుదల

ఆరోపణలు రావడంతో రద్దు

మార్పులు, చేర్పులతో

తాజాగా మరోమారు ఆహ్వానం

ఈసారి ఏడు నెలలకే...

మొత్తాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు

పార్కుల నిర్వహణ పనులపై పెదవి విరుపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) భవనాలు, పార్కుల నిర్వహణకు మరోమారు టెండర్లు పిలిచింది. సిరిపురంలో ఉద్యోగ భవన్‌, ది డెక్‌, చిల్డ్రర్‌ ఎరీనా, గురజాడ కళాక్షేత్రం, బీచ్‌రోడ్డులో మ్యూజియాలు, నగరంలో వివిధ పార్కులు, వాణిజ్య సముదాయాలతో పాటు కైలాసగిరి నిర్వహణ పనులకు రెండు నెలల క్రితం రూ.4.5 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. వాటిలో నిబంధనలు కొందరికే అనుకూలంగా ఉన్నాయని విమర్శలు రావడంతో ఇటీవల రద్దు చేశారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచారు.

భవనాలు, పార్కుల నిర్వహణ కాంట్రాక్టు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు అప్పగించడంలో జాప్యం జరిగింది. దాంతో ఫైల్‌ తయారుచేసే నాటికి 11 నెలల కోసం 2027 మార్చి 31తో ముగిసే కాలానికి అని కమిషనర్‌ నుంచి ఆమోదం తీసుకున్నారు. అయితే అప్పటికే జాప్యం జరగడం, ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేశారు. ఇప్పుడు కేవలం ఏడు నెలల కాలానికే టెండర్లు పిలిచారు. అంటే ఈ సెప్టెంబరులో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగిస్తారు. పాత టెండర్లలో నిర్వహణ పనుల్లో అనుభవం, రూ.5 కోట్ల టర్నోవర్‌ ఉన్నవారే టెండర్‌ వేయాలని నిబంధన పెట్టారు. ఇప్పుడు నిర్వహణ సంస్థలతో పాటు సివిల్‌ కాంట్రాక్టులు చేసేవారు సైతం పాల్గొనవచ్చునని నిబంధన మార్చారు. వాస్తవానికి ఈ నిబంధన గతంలో ఉన్నదే ఇటీవల తప్పించారు. మళ్లీ ఇప్పుడు చేర్చారు.

ఒక్క సిరిపురంలో ఉద్యోగ భవన్‌, పాండురంగాపురంలోని కమిషనర్‌ బంగ్లా నిర్వహణ పనులకు ఏడు నెలలకు రూ.29 లక్షలు టెండర్‌ పిలిచారు. అంటే నెలకు రూ.4 లక్షలు. అదేవిధంగా డెక్‌ భవనం నిర్వహణకు రూ.67.93 లక్షలకు టెండర్‌ పిలిచారు. అంటే సగటున నెలకు రూ.10 లక్షలు. బీచ్‌రోడ్డులో కురుసుర సబ్‌మెరైన్‌, సీ హ్యారియర్‌, టీయూ-142, యుహెచ్‌3హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియాల నిర్వహణ కోసం రూ.48.61 లక్షలు, సెంట్రల్‌ పార్కు, వీఎంఆర్‌డీఏ పార్కుల కోసం రూ.46 లక్షలు, కైలాసగిరి, హెల్త్‌ ఎరీనా, తెన్నేటి పార్కుల నిర్వహణకు రూ.46 లక్షలతో టెండర్లు పిలిచారు. వాస్తవ ఖర్చు కంటే చాలా ఎక్కువకు టెండర్లు పిలుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిటీ సెంట్రల్‌ పార్కు, కైలాసగిరి, తెన్నేటి పార్కుల నిర్వహణ అంటే ఏయే పనులు చేస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. పార్కుల్లో మొక్కలకు నీళ్లు పోయడం, చెత్త తీయడం వంటి పనులన్నీ వీఎంఆర్‌డీఏకి చెందిన అర్బన్‌ ఫారెస్ట్‌ విభాగం చేపడుతోంది. అందుకోసం సంఘాలు ఏర్పాటుచేసి (ఒక్కో సంఘంలో పది నుంచి 20 మంది ఉంటారు) నెలనెలా జీతాలు ఇస్తోంది. ఇప్పుడు ఆ పార్కులో సందర్శకులు ఉపయోగించే బాత్‌రూమ్‌ల క్లీనింగ్‌కు లక్షల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నారు. కైలాసగిరి కూడా అంతే. అక్కడ ఇప్పటికే సుమారు 50 మంది గ్రీనరీ పనులు చేస్తున్నారు. మరో ఐదుగురు పారిశుధ్య పనివారిని పెట్టుకుంటే సరిపోతుంది. వాటికి కేవలం ఏడు నెలల కోసం లక్షలాది రూపాయలతో టెండర్లు పిలుస్తున్నారు. కూటమికి చెందిన పలువురు నాయకులు ఈ నిర్వహణ పనులు చేస్తున్నారు. వారికి లబ్ధి కలిగే విధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎక్కువ మొత్తాలకు టెండర్లు పిలిపించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమిలో ఒక పార్టీకి చెందిన నాయకురాలు డెక్‌, చిల్డ్రన్‌ ఎరీనా నిర్వహణ పనులు చేస్తున్నారు. మళ్లీ అవన్నీ దక్కేలా అధికారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే టెండర్లపై ఆరోపణలు చేసి రచ్చరచ్చ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నిర్వహణ పనులు ఎలా జరుగుతున్నాయనే దానిపై మాత్రం ఏనాడూ సమీక్షించిన దాఖలాలు లేవు. ఇన్‌చార్జి కమిషనర్‌ వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అందని జీతాలు

వీఎంఆర్‌డీఏలో ఉద్యోగులు అందరికీ ఒకటో తేదీ నాటికి జీతాలు ఖాతాల్లో పడిపోతాయి. అయితే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. శాశ్వత ఉద్యోగులు, ఆప్కోస్‌ ద్వారా నియిమతులైన వారికి ఇచ్చేశారు. మిగిలిన 200 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇంకా బిల్లులు చేయలేదు. కొన్నాళ్లుగా కమిషనర్‌ లేకపోవడవం, ఇన్‌చార్జి కమిషనర్‌కు ఫైల్‌ పెట్టడంలో జాప్యం జరగడంతో వారికి జీతాలు పడలేదు. సోమవారం నాటికి క్లియర్‌ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Sep 06 , 2026 | 01:19 AM