Share News

పర్యాటక ప్రాజెక్టులకు వీఎంఆర్‌డీఏ భూములు

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:32 AM

జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమకూర్చడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ముందుకువచ్చింది.

పర్యాటక ప్రాజెక్టులకు వీఎంఆర్‌డీఏ భూములు

సీఐఐ సదస్సులో 42 ఒప్పందాలు

అందులో 34 ప్రాజెక్టులకు

155 ఎకరాలు అవసరమని గుర్తింపు

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థకు

చెందిన స్థలాలు కోరిన 16 సంస్థలు

30కి పైగా స్థలాలు ఎంపిక చేసిన అధికారులు

రేపు ఎంఓయూ చేసిన వారితో పరిశీలన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సమకూర్చడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ముందుకువచ్చింది. గత నవంబరులో ఇక్కడ జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో విశాఖలో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తామంటూ 42 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాటికి అవసరమైన భూమిని సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల రెండో వారంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై పలు సూచనలు చేశారు. అవసరమైతే రెవెన్యూ, దేవదాయ, జల వనరులు, రోడ్లు, భవనాల శాఖలకు చెందిన భూములను ఉపయోగించుకోవాలని సూచించారు. దీనికి వీఎంఆర్‌డీఏ కూడా సహకరించాలని ఆదేశించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఇంకా 34 ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ కావలసి ఉందని, వాటిలో మూడు సంస్థలకు సొంత భూములు ఉన్నాయని, మిగిలిన 31 ప్రాజెక్టులకు భూములు ఇవ్వాలని చెప్పారు. వాటికి సుమారు 155 ఎకరాలు అవసరమని పర్యాటక శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. సీఎం సమావేశం తరువాత కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ పర్యాటక శాఖాధికారులతో చర్చించారు. ఎంఓయూలు చేసుకున్న వారితో మాట్లాడి, ఎవరికి ఎక్కడ భూములు అవసరమో తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు పర్యాటక శాఖాధికారులు అందరితో మాట్లాడగా, 16 మంది వీఎంఆర్‌డీఏకు చెందిన భూములు కావాలని కోరారు. ఈ విషయాన్ని వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు అందుబాటులో ఉన్న స్థలాలను చూపిస్తామని, ఎవరికి నచ్చింది వారు ఎంపిక చేసుకుంటే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి, ధరల వివరాలు ఆ తరువాత తెలియజేస్తామని పేర్కొన్నారు. దీనికోసం సోమవారం ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటుచేశారు. అంతా వస్తే అందులో భూములన్నీ చూపిస్తామన్నారు. సొంత వాహనాల్లోనైనా రావచ్చునని సూచించారు.

శివార్లలో ఎక్కువ భూములు

వీఎంఆర్‌డీఏకు నగరంలో కాకుండా శివార్లలో ఎక్కువ భూములు ఉన్నాయి. వాటిలో ఏవి పర్యాటక శాఖకు ఉపయోగపడతాయో తమకు తెలియదని, అందుకే వారికి చూపిస్తే, వారే నిర్ణయించుకుంటారని ఈ కార్యక్రమం ఏర్పాటుచేసినట్టు వీఎంఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. తమకూ భూముల విక్రయం వల్ల ఆదాయం వస్తుందన్నారు. ఇప్పటివరకూ వేలం నిర్వహించి, ఎవరు ఎక్కువకు పాడితే వారికే ఇస్తున్నామని, ఈ విషయంలో అలా చేయలేమని, ప్రభుత్వానికి తెలియజేసి, అక్కడి నుంచి వచ్చే సూచనల ప్రకారం కేటాయిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 01:32 AM