వీఎంఆర్‌డీఏ హౌసింగ్
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:37 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చాలాకాలం తరువాత మళ్లీ మధ్య తరగతి ప్రజల కోసం అఫర్డబుల్ (సరసమైన) హౌసింగ్ నిర్మాణానికి ముందుకు వచ్చింది.
మధ్య తరగతి కోసం మధురవాడ, వేపగుంటల్లో నిర్మాణం
మూడేళ్లలో పూర్తికి హైదరాబాద్‌కు చెందిన కంపెనీతో ఎంఓయూ
మార్కెట్ ధర కంటే తక్కువకు ఇస్తామంటున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చాలాకాలం తరువాత మళ్లీ మధ్య తరగతి ప్రజల కోసం అఫర్డబుల్ (సరసమైన) హౌసింగ్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. జాయింట్ వెంచర్ కింద ఒప్పందం చేసుకుంది. రెండు ప్రాంతాల్లో రెండు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని నిశ్చయించింది.
వీఎంఆర్‌డీఏ వుడాగా ఉన్నప్పుడు మారికవలస సమీపాన పదిహేనేళ్ల క్రితం మధ్య తరగతి ప్రజల కోసం ‘హరిత’ ప్రాజెక్టు నిర్మించింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో 700 ఫ్లాట్ల వరకు నిర్మించింది. దీని తరువాత మళ్లీ హౌసింగ్ జోలికి పోలేదు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో ఐటీ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేలా అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని వీఎంఆర్‌డీఏ అధికార వర్గాలకు సూచించారు. ఈ మేరకు ఏడాది క్రితం డిమాండ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి సర్వే నిర్వహించారు. చాలా మంది ఆసక్తి చూపడంతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ప్రాజెక్టు చేపట్టడానికి పలుమార్లు టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన గుప్తా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ కనస్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో ఎంఓయూ చేసుకున్నారు.
రెండు ప్రాంతాల్లో...
అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులను రెండు ప్రాంతాల్లో చేపట్టనున్నారు. మిథిలాపురి వుడా కాలనీలోని సర్వే నంబరు 147లో 2.78 ఎకరాల (3.56 లక్షల చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఒక ప్రాజెక్టు ఖరారు చేశారు. అలాగే వేపగుంటలో సర్వే నంబరు 164/పిలో 63 సెంట్ల స్థలం (62వేల చదరపు అడుగులు)లో మరో ప్రాజెక్టు ఖరారు చేశారు. పీపీపీలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు రూ.124 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. భూమిని వీఎంఆర్‌డీఏ సమకూరిస్తే నిర్మాణాలు గుప్తా ఇన్‌ఫ్రా చేపడుతుంది. మిథిలాపురి వుడా కాలనీలో 264 ఫ్లాట్లు అమ్మకానికి వస్తాయి. ఇందులో 3 బెడ్‌రూమ్ ఫ్లాట్లు 96, 2.5 బెడ్‌రూమ్ ఫ్లాట్లు 88, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 80 ఉంటాయి. వీటి విస్తీర్ణం 800 చ.అ. నుంచి 1,600 చ.అ. వరకు ఉంటుంది. ప్రాథమికంగా తొమ్మిది అంతస్థుల్లో నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. డిమాండ్‌ను బట్టి అంతస్థులు, ఫ్లాట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇవి పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ మోడల్‌లో ఉంటాయి. వేపగుంటలో 45 ఫ్లాట్లు వరకు వస్తాయి.
సరసమైన ధరల్లోనే ఇస్తాం
ప్రణవ్‌గోపాల్, చైర్మన్, వీఎంఆర్‌డీఏ
సీఎం చంద్రబాబునాయుడు విజన్‌కు అనుగుణంగా సరసమైన ధరల్లో మధ్య తరగతి ప్రజలకు హౌసింగ్ ఇవ్వాలని ఈ ప్రాజెక్టులు చేపట్టాం. బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు, అన్ని రకాల వసతులతో అందిస్తాం. క్లబ్ హౌస్, ఇండోర్ జిమ్ వంటి అన్ని వసతులు ఉంటాయి. రోజూ 50 నుంచి 60 ఎంక్వయిరీలు వస్తున్నాయి. ప్రాజెక్టు చేపట్టి మూడేళ్లలో పూర్తిచేస్తాం.
వీఎంఆర్‌డీఏ వాటా 30 శాతం
తేజ్ భరత్, కమిషనర్, వీఎంఆర్‌డీఏ
ఈ ప్రాజక్టును జాయింట్ వెంచర్ కింద పీపీపీలో చేస్తున్నాం. మొత్తం ఫ్లాట్లలో 70 శాతం వారు తీసుకొని, 30 శాతం వీఎంఆర్‌డీఏకి ఇస్తారు. ఇవి అందుబాటు ధరల్లోనే ఉంటాయి. ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ పనికి అనుగుణంగా ఫ్లాట్లలో కొంత స్థలం ఆఫీసు స్పేస్‌లా చేయాలనే ఆలోచన ఉంది. ఇవి త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లలో వస్తాయి.