Share News

రూ.900 కోట్లతో వీఎంఆర్‌డీఏ బడ్జెట్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:12 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.900 కోట్లతో బడ్జెట్‌ రూపొందించిందని, బోర్డు సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకోవలసి ఉందని కమిషనర్‌ తేజ్‌ భరత్‌ వెల్లడించారు.

రూ.900 కోట్లతో వీఎంఆర్‌డీఏ బడ్జెట్‌

మరో రూ.వేయి కోట్ల ఆదాయానికి కొత్త లేఅవుట్లు

కమిషనర్‌ తేజ్‌భరత్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.900 కోట్లతో బడ్జెట్‌ రూపొందించిందని, బోర్డు సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకోవలసి ఉందని కమిషనర్‌ తేజ్‌ భరత్‌ వెల్లడించారు. ఆయన గురువారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇది కాకుండా మరో వేయి కోట్ల రూపాయల ఆదాయం సాధించేందుకు కొత్త లేఅవుట్లను అభివృద్ధి చేస్తామని, ప్రస్తుతం ఉన్న లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించి ప్లాట్లను వేలానికి పెడతామన్నారు. మాస్టర్‌ ప్లాన్‌-2041పై స్వీకరించిన అభ్యంతరాలన్నీ క్రోడీకరించి, నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు. వాటిని వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపిస్తామని, అక్కడ టెక్నికల్‌ కమిటీ ఉన్నతాధికారులు పరిశీలించి సూచనలు చేస్తారని, దానిపై తుది నోటిఫికేషన్‌ ఇచ్చి అమలులోకి తీసుకువస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన టికెట్‌ విధానంపై అందరికీ అవగాహన కల్పించామని, విస్తృత ప్రచారం కూడా చేస్తున్నామన్నారు.


విశాఖ జోన్‌లోనే పలాస

ఫలించిన కేంద్ర మంత్రి ప్రయత్నం

రైల్వే జోన్‌ గెజిట్‌పై మాత్రం ఇంకా దోబూచులాట

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌కు గెజిట్‌ నోటిఫికేషన్‌పై రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా దోబూచులాడుతోంది. డివిజన్ల సరిహద్దులను ఆచితూచి నిర్ణయించాలని చెబుతోంది. అయితే కూటమి నేతలంతా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే విశాఖలో కొత్త జోన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గత నెలలో ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఎటువంటి ఆదేశాలు రాలేదు. గురువారం మాత్రం రైల్వే బోర్డు మరో ప్రకటన జారీచేసింది. ఎప్పటి నుంచో తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని ఖుర్దా రోడ్‌ డివిజన్‌లో ఉన్న ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఏడు రైల్వే స్టేషన్లను కొత్త జోన్‌ (దక్షిణ కోస్తా) పరిధిలోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా స్పందించారు. కొత్త రైల్వే జోన్‌ ప్రకటించినప్పటి నుంచి తాను ఆయా ప్రాంతాలను కొత్త జోన్‌లోకి మార్చాలని, ఆ విధంగా చేస్తే ఏపీ ప్రాంతం అంతా ఒక దగ్గరే ఉంటుందని, విశాఖకు రాకపోకలకు, పరిపాలన అనుమతులకు సౌలభ్యంగా ఉంటుందని రైల్వే మంత్రిని కోరానని, ఎట్టకేలకు స్పందించి వాటిని ఇటు మార్చారని హర్షం వ్యక్తంచేశారు. ఇకపై ఈ ప్రాంతాలు దక్షిణ కోస్తా జోన్‌లోని విశాఖపట్నం డివిజన్‌లో ఉంటాయన్నారు. ఇచ్ఛాపురం, జాడుపూడి, సోంపేట, బారువా, మందస రోడ్‌, సుమ్మాదేవి, పలాస స్టేషన్లు ఏపీతో అనుసంధానమై ఉంటాయన్నారు.


ముగిసిన సర్పంచుల పదవీకాలం

78 పంచాయతీలకు 17 మంది ప్రత్యేకాధికారులు

పలువురు బాధ్యతల స్వీకారం

విశాఖపట్నం/ఆనందపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

గ్రామ సర్పంచుల పదవీకాలం గురువారంతో ముగిసింది. 2021 మార్చిలో ఎన్నికలు జరగ్గా, ఏప్రిల్‌ మూడో తేదీన సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 79 గ్రామ పంచాయతీలు ఉండగా, భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీకి ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి. దానిని మినహాయించి మిగిలిన 78 గ్రామ పంచాయతీలకు ఆయా మండలాల్లో గెజిటెడ్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్‌ పాలనాధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆనందపురంలో 26 పంచాయతీలకు నలుగురు, భీమిలిలో 15 పంచాయతీలకు నలుగురు, పద్మనాభంలో 22 పంచాయతీలకు ఆరుగురు, పెందుర్తిలో 15 పంచాయతీలకు ముగ్గురిని నియమించారు. పలుచోట్ల ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన వారంతా శుక్రవారం బాధ్యతలు చేపడతారు.


భారీ పరిశ్రమల్లో పీసీబీ చైర్మన్‌ తనిఖీలు

కాలుష్యం లేకుండా చూడాలని ఆదేశం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య గురువారం జాయింట్‌ చీఫ్‌ పర్యావరణ ఇంజనీర్‌ శంకర్‌నాయక్‌తో కలిసి నగరంలో గల పలు భారీ పరిశ్రమలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింధియా రోడ్డులో ఫ్లైఓవర్‌ సమీపానున్న ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా, మల్కాపురంలోని కోరమండల్‌ ఇంటర్నేషనల్‌, అక్కడే ఉన్న హిందూస్థాన్‌ పెట్రోలియం, కూర్మన్నపాలెంలోని స్టీల్‌ ప్లాంటును సందర్శించారు. నిబంధనల ప్రకారం కాలుష్య సూచీలు ఎంత ఉండాలి?, ప్రస్తుతం ఎంత ఉన్నాయి?, వ్యర్థాలను ఏమి చేస్తున్నారు?...వంటి అంశాలను పరిశీలించారు. భారీ పరిశ్రమల కారణంగానే గత శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని, ఈసారి అలా జరగకూడదని, దాని కోసం ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణహితంగా ఉండాలని, సుస్థిర విధానంలో కొనసాగాలని వివరించారు. గాలిలో ధూళికణాలు పెరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Updated Date - Apr 03 , 2026 | 01:12 AM