వీఎంఆర్‌డీఏ అకౌంట్స్‌లో తనిఖీలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 01:24 AM
చెందిన రూ.75 కోట్లను కోటక్ మహీంద్రా బ్యాంకు రాజమహేంద్రవరంలోని బ్రాంచీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయడం కలకలం రేపుతోంది.
సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు
అధికారుల నిర్ణయం
రాజమహేంద్రవరంలో
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడంపై కలకలం
విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు చెందిన రూ.75 కోట్లను కోటక్ మహీంద్రా బ్యాంకు రాజమహేంద్రవరంలోని బ్రాంచీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయడం కలకలం రేపుతోంది. అది ప్రైవేటు బ్యాంకు అయినప్పటికీ ఏడు శాతం వడ్డీ ఇస్తామని ముందుకు రావడంతో ఉన్నతాధికారి సిఫారసు మేరకు అకౌంట్స్ విభాగం నుంచి చెక్ జారీ చేశారు. దానిని తీసుకువెళ్లిన బ్యాంకు ప్రతినిధులు విశాఖపట్నంలో కాకుండా రాజమహేంద్రవరం బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. ఈ విషయం వీఎంఆర్‌డీఏలో ఏ అధికారికీ తెలియదు. విశాఖలో బ్యాంకులే లేనట్టు రాజమహేంద్రవరంలోని బ్యాంకులో ఎఫ్‌డీ చేయడాన్ని తప్పుబడుతూ ఓ మాజీ కార్పొరేటర్ విలేకరుల సమావేశం నిర్వహించి ఆరోపణలు చేశారు. విషయం తెలిసి అధికారులు గతుక్కుమన్నారు. కోటక్ బ్యాంకులో డిపాజిట్ చేసిన మాట వాస్తవమే కానీ అది విశాఖలో కాకుండా రాజమహేంద్రవరానికి ఎలా వెళ్లిందనేది అర్థం కాలేదు. అకౌంట్స్ విభాగం అధికారి సెలవులో ఉండడంతో ఆయన వచ్చాక ఆరా తీయాలని అనుకున్నారు. ఇదిలావుండగా ఏం అనుమానం వచ్చిందో ఏమో...వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్, అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, సెక్రటరీ మురళీ, అదనపు సెక్రటరీ రిషిబాబులు బుధవారం ఆకస్మికంగా అకౌంట్స్ విభాగంలో తనిఖీలు చేపట్టారు. సిబ్బంది సీట్ల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరి లాగిన్‌లను తనిఖీ చేసి, పెండింగ్ బిల్లులు ఏమైనా ఉన్నాయేమో అని పరిశీలించారు. మాజీ కార్పొరేటర్‌కు ఇక్కడి నుంచే సమాచారం లీక్ అయిందని భావిస్తూ, ఆ విభాగంలో తక్షణమే సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ తనిఖీలు జరిగినప్పుడు కూడా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కార్యాలయంలో లేనట్టు తెలిసింది. వాస్తవానికి వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవన్‌లోనే సంస్థకు సేవలు అందించడానికి ప్రత్యేకంగా ఒక బ్యాంకు కొన్ని దశాబ్దాలుగా ఉంది. దానిని కాదని ఇతర బ్యాంకుల్లో ఎందుకు ఎఫ్‌డీ చేయాల్సి వచ్చిందని మాజీ కార్పొరేటర్ ప్రశ్నించారు. దీంతో పాటు అనేక ఆరోపణలు చేయడంతో వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఆయనకు లీగల్ నోటీస్ పంపించారు.