Share News

ఏయూలో వీఎల్‌ఎస్‌ఐ కోర్సు

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:53 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు కొత్త కోర్సును ప్రారంభించారు. ఇంజనీరింగ్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు.

ఏయూలో వీఎల్‌ఎస్‌ఐ కోర్సు

ఈ ఏడాది నుంచి ప్రారంభం

ఏపీఈఏపీసెట్‌ ర్యాంకు ఆధారంగా 30 మందికి ప్రవేశాలు

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు కొత్త కోర్సును ప్రారంభించారు. ఇంజనీరింగ్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. గడిచిన ఏడాది క్వాంటం కంప్యూటింగ్‌ను ప్రారంభించిన అధికారులు...ఈ ఏడాది వీఎల్‌ఎస్‌ఐ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. తొలి ఏడాది 30 మందికి ప్రవేశాలు కల్పించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏపీఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు హార్డ్‌వేర్‌ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ తెలిపారు. ప్రధానంగా కంప్యూటర్‌ చిప్‌లు, ప్రాసెసర్లు, మెమోరీ చిప్‌లు వంటి ఎలక్ర్టానిక్‌ సర్క్యూట్లను డిజైన్‌ చేయడం, టెస్ట్‌ చేయడం, తయారీకి సిద్ధం చేయడం వంటి అంశాలను విద్యార్థులకు నేర్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు డిజైన్‌ ఇంజనీర్లుగా, ఆర్‌టీఎల్‌ డిజైన్‌ ఇంజనీర్లుగా, వెరిఫికేషన్‌, ఫిజికల్‌, అనలాగ్‌ లేఅవుట్‌ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కోర్సును వర్సిటీలో ప్రారంభించిన విషయాన్ని విద్యార్థులకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, రెండు రోజుల్లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన బ్రోచర్‌ విడుదల చేస్తామని వీసీ వెల్లడించారు.


మాతృశాఖకు టూరిజం అథారిటీ ఆర్‌డీ కళ్యాణి

డిప్యుటేషన్‌ రద్దు

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

రిజిస్ట్రేషన్ల శాఖలో డీఐజీగా పనిచేస్తూ వ్యక్తిగత కారణాలతో డిప్యుటేషన్‌పై పర్యాటక శాఖకు వెళ్లిన పీజీఎస్‌ కళ్యాణిని తిరిగి మాతృశాఖకు పంపిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె ఏడాది క్రితం విశాఖలో ఏపీ టూరిజం అథారిటీ రీజనల్‌ డైరెక్టర్‌, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇటీవల నెల రోజులు సెలవు పెట్టగా ఆ బాధ్యతలు ఏపీటీడీసీ డివిజన్‌ మేనేజర్‌ జగదీశ్‌కు అప్పగించారు. ఇదిలావుండగా విశాఖలో రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీగా పనిచేస్తున్న బాలకృష్ణ ఐఏఎస్‌కు ఎంపికై ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌ కె.మన్మథరావుకు డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కళ్యాణి విశాఖ డీఐజీగా వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


దూర విద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

చోడవరంలో సుమారు 50 మంది డిబార్‌

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను ప్రత్యేక స్క్వాడ్‌ పట్టుకుంది. దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ అప్పలనాయుడు నేతృత్వంలోని స్క్వాడ్‌ అనకాపల్లి జిల్లా చోడవరంలోని ఉషోదయ కాలేజీలో తనిఖీలు చేపట్టింది. దూరవిద్య కేంద్రం పరీక్షలు రాస్తున్న 39 మంది, రెగ్యులర్‌ డిగ్రీ పరీక్షలు రాస్తున్న మరో ఐదుగురు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్టు గుర్తించింది. అంతకుముందురోజు అదే కాలేజీలో ఆరుగురు విద్యార్థులు స్లిప్పులతో దొరికినట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం రెండు రోజుల వ్యవధిలో ఆ కాలేజీలో సుమారు 50 మంది మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఆయా విద్యార్థులను డిబార్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డైరెక్టర్‌ అప్పలనాయుడు వెల్లడించారు. అలాగే, విద్యార్థులకు సహకరిస్తున్న కాలేజీపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. విద్యార్థులు అనైతిక చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

Updated Date - Jul 28 , 2026 | 12:53 AM