వైజాగ్ 2.0
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:17 AM
విశాఖపట్నం జిల్లాను శరవేగంతో అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కైలాసగిరి నుంచి భీమిలి వరకూ ‘వైజాగ్ బే సిటీ’
తీర ప్రాంతంలో స్టార్ హోటళ్లు, బీచ్ రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఏర్పాటుకు అనుమతులు
సాగర్‌నగర్, తొట్లకొండ, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్‌లు పూర్తిస్థాయిలో అభివృద్ధి
2032 నాటికి విశాఖను వాటర్ ఫ్రంట్ జిల్లాగా మార్చాలని ప్లాన్
కన్సల్టెంట్ నియామకం కోసం ప్రకటన జారీచేసిన వీఎంఆర్‌డీఏ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం జిల్లాను శరవేగంతో అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్(వీఈఆర్)లో మొత్తం 49 ప్రాజెక్టులు ఉండగా వాటిలో అత్యంత ప్రధానమైనది ‘వైజాగ్ బే సిటీ’. స్వర్ణాంధ్ర-2027లో భాగంగా 2032 నాటికి విశాఖను వాటర్ ఫ్రంట్ జిల్లాగా మార్చాలని నిర్ణయించారు. దీనికి ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్ తయారుచేయడానికి కన్సల్టెంట్ నియామకం కోసం వీఎంఆర్‌డీఏ మంగళవారం ప్రకటన జారీచేసింది. వీఈఆర్‌లో ఫ్లాగ్‌షిప్/యాంకర్ ప్రాజెక్టుగా ‘వైజాగ్ 2.0’ను ప్రకటించారు. అందులో భాగమే వైజాగ్ బే సిటీని మియామీ సిటీలా, విశాఖను బీచ్ ఫ్రంట్ సిటీగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఐదు బీచ్‌లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. అందులో సాగర్‌నగర్, తొట్లకొండ, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్‌లు ఉన్నాయి.
మొత్తం 40 చ.కి.మీ. విస్తీర్ణంలో వైజాగ్ బే సిటీని అభివృద్ధి చేస్తారు. అందులో కైలాసగిరి నుంచి భీమిలి వరకు 25 కి.మీ. విస్తీర్ణంలో ఎక్కువ ప్రాజెక్టులు వచ్చేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో 2,500 గదులతో కూడిన స్టార్ హోటళ్లు నిర్మిస్తారు. ఇవన్నీ పర్యావరణహితంగా ఉంటాయి. ఆర్థికంగా లాభదాయకం కావడానికి పర్యాటకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఉన్న రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌కు తోడుగా మరో రెండు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకువస్తారు. అందుకు అనుగుణంగా ఆయా బీచ్‌లను పరిశుభ్రంగా పర్యాటకులకు భద్రంగా ఉండేలా తయారుచేస్తారు. కైలాసగిరి-భీమిలి మధ్య ఎక్కడికక్కడ బీచ్ రెస్టారెంట్లు, తాటి/కొబ్బరి ఆకులతో నిర్మించిన కుటీరాలు, రిసార్ట్స్‌కు అనుమతులు ఇస్తారు.
విశాఖను స్మార్ట్ డిస్ట్రిక్ట్‌గా అభివృద్ధి చేస్తారు. ఫ్యూచర్ రెడీ, టెక్నాలజీ హబ్, ప్రపంచ తీర ప్రాంత నగరంగా మారుస్తారు. విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తే కనీసం మూడు నుంచి ఐదు రోజులు ఉండి రూ.8 వేలు నుంచి రూ.12వేలు పర్యాటకం కోసం ఖర్చు చేసేలా వసతులు ఏర్పాటు చేస్తారు.
భూముల వినియోగం కోసం కన్సల్టెంట్
తేజ్‌భరత్, కమిషనర్, వీఎంఆర్‌డీఏ
వైజాగ్ బే సిటీని 40 కి.మీ. పరిధిలో అభివృద్ధి చేయనున్నందున ఏ ప్రాంతంలో ఎటువంటి ప్రాజెక్టు ఏర్పాటుచేస్తే బాగుంటుంది?, ఆయా భూములను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు?, ఆర్థికంగా వెసులుబాటు...తదితర అంశాలన్నీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు కన్సల్టెంట్ కోసం ఆర్‌ఎఫ్‌పీ జారీచేశాం. 2032 నాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.