పర్యాటకుల కోసం ‘విస్టా’
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:24 AM
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఉపయోగపడేలా వీఎంఆర్‌డీఏ కొత్తగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన వీఎంఆర్‌డీఏ
పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఆన్‌లైన్‌లో టికెట్ పొందే అవకాశం
సంస్థకు చెందిన కల్యాణ మండపాలు, వేదికల రిజర్వేషన్‌కు కూడా...
విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఉపయోగపడేలా వీఎంఆర్‌డీఏ కొత్తగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని పేరు విశాఖ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టికెటింగ్ యాప్ (విస్టా). వీఎంఆర్‌డీఏకు చెందిన మ్యూజియాలు (కురుసుర, టీయూ-142, యుహెచ్-3 హెచ్, సీ హ్యారియర్, తెలుగు మ్యూజియం), కైలాసగిరి, బీచ్ రోడ్డులో వుడా పార్కు, సిటీ సెంట్రల్ పార్క్, తెన్నేటి పార్క్, తొట్లకొండ...ఇలా అన్నింటికి ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ఆయా మ్యూజియాలకు వెళ్లి, క్యూలో నిల్చొని టికెట్ తీసుకోవలసిన అవసరం లేకుండా యాప్‌లోనే ఏ రోజు ఏ సమయానికి ప్రవేశం కావాలనుకుంటే ఆ టైమ్ స్లాట్‌లో ఎక్కడి నుంచైనా టికెట్ తీసుకోవచ్చు. ఇది పర్యాటకులతో పాటు సంస్థకూ ఉపయుక్తంగా ఉండనుంది. టికెట్ల విక్రయాలు, ఆదాయంలో పారదర్శకతను పెంచుతుంది. ఈ యాప్ ఉగాది సందర్భంగా వీఎంఆర్‌డీఏ కార్యాయంలో చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్‌భరత్, ఇతర అధికారులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ మొబైల్‌లోనే ఈ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చునన్నారు. అంతే కుండా వీఎంఆర్‌డీఏకు నగరంలో ఉన్న కల్యాణ మండపాలు, వేదికలను కూడా ఇదే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చునన్నారు. త్వరలో దీనిని విదేశీ పర్యాటకులకు కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తపాల్స్ కోసం ఎస్‌టీఎంఎస్ యాప్
వీఎంఆర్‌డీఏకు పనులపై వచ్చేవారు చాలామంది లేఖలు తపాల్స్‌లో సమర్పిస్తారు. ఒక్కోసారి అవి కనిపించకుండా పోతున్నాయని ఫిర్యాదులు రావడంతో తపాల్స్ అన్నీ ఆన్‌లైన్ చేసి, ట్రాకింగ్‌కు అనుకూలంగా ఉండేలా ‘స్మార్ట్ తపాల్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ పేరుతో మరొక యాప్‌ను రూపొందించారు. దానిని కూడా ఇదే కార్యక్రమంలో ప్రారంభించారు. దీని వల్ల సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుందని చైర్మన్, కమిషనర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యాప్‌ను రూపొందించిన అమరావతి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రతినిధులు, వీఎంఆర్‌డీఏ సెక్రటరీ మురళి, సీఈ వినయకుమార్ తదితరులు పాల్గొన్నారు.