తలసరి ఆదాయంలో విశాఖ టాప్
ABN , Publish Date - May 08 , 2026 | 01:33 AM
తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఆదాయంలో మరోసారి విశాఖపట్నం రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.
రూ.6,58,964తో రాష్ట్రంలోనే అగ్రస్థానం
స్థూల జిల్లా ఆదాయంలోనూ ప్రథమం
గత ఏడాదితో పోల్చితే 11.64 శాతం వృద్ధితో రూ.1,61,009 కోట్లు రాక
సేవా రంగం, పరిశ్రమల వాటాయే అధికం
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఆదాయంలో మరోసారి విశాఖపట్నం రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. స్థూల ఆదాయంలో పరిశ్రమలు, సేవా రంగం వాటా ఎక్కువగా ఉంది. కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం విశాఖ జిల్లా ప్రగతి, ఆర్థిక వృద్ధి, తదితర అంశాలపై కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ నివేదిక సమర్పించారు. దీని ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.6,58,964 తలసరి ఆదాయం (గడచిన ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.46 శాతం వృద్ధి)తో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 16.25 శాతం వృద్ధితో రూ.7,66,029కు పెంచాలని లక్ష్యంగా ఇచ్చారు. ఇక స్థూల ఆదాయంలో 2024-25 సంవత్సరంతో పోల్చితే 2025-26లో రూ.1,61,009 కోట్ల (11.64 శాతం వృద్ధి)తో విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను 16.53 శాతం వృద్ధితో రూ.1,87,626 కోట్ల ఆదాయం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. స్థూల ఆదాయంలో మూడు ప్రధాన అంశాలను ప్రధానంగా తీసుకుంటారు. విశాఖ జిల్లాలో సేవా రంగం నుంచి రూ.1,03,743 కోట్లు ఆదాయం వచ్చింది.
- గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే సేవల్లో జిల్లా 21వ స్థానంలో నిలిచింది. పాలు, గుడ్డు, టీహెచ్‌ఆర్ కిట్లు ఇస్తున్నారా?, నాణ్యత ఎలా ఉంది?, వంటి అంశాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
- బీసీ కులాల వెనుకబాటును గుర్తించేందుకు నియమించిన డెడికేటెడ్ కమిటీకి సమాచారాన్ని అందించడంలో జిల్లా వెనుకబడింది.
- మౌలిక సదుపాయాల కల్పన విషయంలో జిల్లా ముందంజలో ఉంది. ఆర్వో ప్లాంట్స్, టాయిలెట్స్ ఏర్పాటులో మెరుగ్గా ఉంది.
- అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలను మెరుగుపరచేందుకు అనుగుణంగా ఇచ్చిన కీ ఇండికేటర్స్ అమలులో జిల్లా వెనుకబడింది. ఈ జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. సప్లిమెంటరీ న్యూట్రీషియన్ ప్రోగ్రామ్ అమలులో జిల్లా పూర్తిగా వెనుకబడింది.
- ప్రీ స్కూల్ అటెండెన్స్ అధికంగా ఉన్న జిల్లాల జాబితాలో విశాఖ టాప్-3లో నిలిచింది. 29,175 మందితో 82.11 శాతంతో టాప్‌లో ఉంది. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలను కల్పన విషయంలో జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. 168 కేంద్రాలకుగాను 114 కేంద్రాల్లో టాయిటెట్లు ఏర్పాటుచేశారు. అలాగే, 225 కేంద్రాలకుగాను 171 చోట్ల తాగునీటి సదుపాయం కల్పించారు. ఇందుకు ఒక్కో కేంద్రానికి రూ.36 వేలు, రూ.17 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
పీజీఆర్‌ఎస్‌పై 90 శాతం సంతృప్తి
వ్యక్తిగత అంశాలపై 5,413 వినతులు రాగా 3,688 పరిష్కారం
హౌసింగ్‌లో 92,193 ఇళ్లు నిర్మాణం పూర్తి
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వ్యక్తిగత అర్జీల పరిష్కారంపై 90 శాతం, సామాజిక సమస్యల పరిష్కారంపై 86 శాతం సంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత అంశాలపై 5,413 వినతులు రాగా 3,688 వినతులు పరిష్కరించగా, 1,725 పెండింగ్‌లో ఉన్నాయి. సామాజిక అంశాలకు సంబంధించి 4,410 వినతులు రాగా 3025 పరిష్కరించగా, 1,385 పెండింగ్‌లో ఉన్నాయి. శాఖల వారీగా పురోగతి పరిశీలించినపుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0లో 1,26,698 ఇళ్లు మంజూరుకాగా ఇంతవరకు 92,193 (73 శాతం) పూర్తిచేయగా, 34,505 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాలో అందుబాటులో ఉన్న రూ.226 కోట్లలో రూ.205 కోట్లు (92 శాతం) ఖర్చుచేశారు. నిషేధిత భూముల జాబితా 22-ఎ నుంచి మినహాయింపు కోసం 396 వినతులు రాగా 49 పరిష్కరించారు. 101 వినతులు తిరస్కరించారు. మిగిలిన 150 వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలపై 76.6 శాతం సానుకూలం
రాష్ట్ర స్థాయిలో రెండు స్థానంలో జిల్లా
గతం కంటే 3.9 శాతం వృద్ధి
17 అంశాల్లో పురోగమనం, ఎనిమిదింటిలో తిరోగమనం
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై జిల్లాలో 76.6 శాతం మంది సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పరెప్షన్)తో ఉన్నారు. ఈ కేటగిరీలో విశాఖ జిల్లా రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 72.7 శాతం స్కోరు సాధించగా, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 76.6 శాతానికి (3.9 శాతం వృద్ధి) చేరింది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తుంటారు. గృహ నిర్మాణ సంస్థ సేవలపై డిసెంబరు-ఫిబ్రవరి మధ్య 38.6 శాతం ఉన్న సానుకూల అభిప్రాయం ఇప్పుడు (మార్చి, ఏప్రిల్ నెలల్లో) 64.7 శాతానికి పెరిగింది. ఆ తరువాత ఏపీఎస్‌ఆర్టీసీ పట్ల సానుకూలత 65.1 శాతం నుంచి 84.8 శాతానికి (19.7 శాతం వృద్ధి) పెరిగింది. అలాగే శాప్ విభాగానికి సంబంధించి 42.6 శాతంగా ఉన్న సానుకూల అభిప్రాయం 62 శాతానికి వృద్ధి చెందింది. వృద్ధి తిరోగమనానికి వెళ్లిన విభాగాల్లో ఆర్‌వోఆర్ 60 శాతం నుంచి ఇప్పుడు 45.1 శాతానికి పడిపోయింది. గతంతో పోల్చితే సానుకూలత తగ్గిన విభాగాల్లో విద్యా శాఖ, బాలింతలైన తల్లులకు సేవలు, శానిటేషన్, వీధి దీపాలు, ఆస్పత్రి సర్వీస్‌లు, పోలీస్ శాఖ ఉన్నాయి.