Share News

విశాఖ టు భోగాపురం 1.45 గంటలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:51 AM

విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఆనందపురం జంక్షన్‌కు చేరుకోవడానికి 63 నిమిషాలు పడుతోందని ‘సిడార్‌’ అధ్యయన సంస్థ పేర్కొంది.

విశాఖ టు భోగాపురం 1.45 గంటలు

  • ఆనందపురానికే 63 నిమిషాలు

  • ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రవాణా సమస్యలపై ‘సిడార్‌’ అధ్యయనం

  • సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి నివేదిక

  • జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను సమన్వయపరచాలి

  • ప్రధాన రహదారులను విస్తరించాలి

  • ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భోగాపురం సమీపాన తీరం వరకు సముద్ర మార్గంలో స్పీడ్‌ బోట్ల సేవలు అందుబాటులోకి తేవాలి

  • తీరం వెంబడి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలి

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఆనందపురం జంక్షన్‌కు చేరుకోవడానికి 63 నిమిషాలు పడుతోందని ‘సిడార్‌’ అధ్యయన సంస్థ పేర్కొంది. సామాజిక అంశాలపై పరిశోధనలు నిర్వహించే ఈ సంస్థ...భోగాపురం విమానాశ్రయానికి విశాఖ నుంచి రాకపోకలు సజావుగా/వేగంగా సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇటీవల అధ్యయనం నిర్వహించింది. ఆ వివరాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి, బుల్లయ్య కాలేజీ సెక్రటరీ మధుకుమార్‌, ఇతర సభ్యులు కాలేజీలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తున్న నేపథ్యంలో సమర్థవంతమైన రవాణా అనుసంధానంపైనే తాము సూచనలు చేశామని కేసీ రెడ్డి వివరించారు. దీనికి క్షేత్ర స్థాయి సర్వేలు, గూగుల్‌ మ్యాప్‌లో అందుబాటులో ఉన్న రియల్‌టైమ్‌ ప్రయాణ డేటాను ఉపయోగించుకున్నామన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...

విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయం మధ్య దూరం 50 కి.మీ. విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అక్కడకు చేరుకోవడానికి ప్రస్తుతం గంటా 45 నిమిషాల సమయం పడుతోంది. విచిత్రం ఏమిటంటే విశాఖ నుంచి ఆనందపురం వెళ్లడానికే 63 నిమిషాలు పడుతోంది. అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకోవడానికి కేవలం 20 నుంచి 25 నిమిషాలు పడుతోంది.

- హనుమంతవాక జంక్షన్‌ నుంచి బోయపాలెం వరకు జాతీయ రహదారి-16పై ఉన్న తొమ్మిది ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్లను సమన్వయం చేయాలి. ముఖ్యంగా ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోంది. సిగ్నళ్ల సమన్వయం వల్ల 25 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది.

- ఆనందపురం జంక్షన్‌లో మార్కెట్‌ ఉండడం వల్ల వ్యాపారులు రోడ్లపైనే ఉంటున్నారు. అక్కడే బస్సులు, కార్లు, ఆటోలు ఆపడం వల్ల ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ప్రస్తుతం అక్కడి ఫ్లైఓవర్‌ మూసేశారు. దాంతో వాహనాలు మార్కెట్‌ నుంచే వెళుతున్నాయి. ఈ సమస్య నివారణకు ట్రాఫిక్‌ పోలీసులు, జాతీయ రహదారి సంస్థ, జీవీఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.

- జాతీయ రహదారి ఒక్కటే కాకుండా ప్రత్యామ్నాయంగా అప్పుఘర్‌ నుంచి ఉప్పాడ వరకు బీచ్‌ రోడ్డు అభివృద్ధి చేయాలి. ఈ మార్గంలో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్‌ సిగ్నళ్లను తప్పించుకొని బోయపాలెం వద్ద జాతీయ రహదారిని చేరుకోవచ్చు. ప్రస్తుతం బీచ్‌రోడ్డులో ఎక్కువ సంఖ్యలో స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నాయి. ఇవి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్నందున తొలగించాల్సి ఉంది.

- హైదరాబాద్‌, బెంగళూరుల్లో మాదిరిగా నగరంలో వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి తరచూ షటిల్‌ బస్సులు నడపాలి.

- భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారులను విస్తరించాలి. ప్రస్తుతం ఆనందపురం వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. కొన్ని చోట్ల డివైడర్లు కూడా లేవు. ప్రధాన జంక్షన్లలో అండర్‌పాస్‌లు నిర్మించాలి. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని జంక్షన్లను పునర్నిర్మాణం చేయాలి.

- విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భోగాపురం సమీపాన తీరం వరకు సముద్ర మార్గంలో స్పీడ్‌ బోట్ల సేవలు అందుబాటులోకి తేవాలి. తీర ప్రాంత దూరం 46 కి.మీ. ఉండగా ప్రయాణం 28 నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుంది.

దీర్ఘకాలిక ప్రణాళిక కోసం...

- భీమిలి మార్గంలో తీరం వెంబడి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలి. హైదరాబాద్‌లో పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌ హైవే తరహాలో అభివృద్ధి చేస్తే ప్రయాణం 30 నుంచి 45 నిమిషాల్లో పూర్తవుతుంది.

- విమానాశ్రయానికి వెళ్లే రహదారులను ఆరు నుంచి ఎనిమిది వరుసలకు పెంచాలి. ఆ మార్గంలో సరైన సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సిడార్‌ బృందం సూచించింది.

రైటప్‌: దొరతోట జంక్షన్‌ రహదారి ప్లాన్‌ పరిశీలిస్తున్న మంత్రి నారాయణ. పక్కన వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌


సకాలంలో మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణం

అధికారులకు పురపాలక శాఖమంత్రి నారాయణ ఆదేశాలు

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం విమానాశ్రయం ప్రారంభించే లోపు దానిని అనుసంధానం చేస్తూ చేపట్టిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం పూర్తి కావాలని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ ఆదేశించారు. ఆయన శనివారం సాయంత్రం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌లతో కలిసి వీఎంఆర్‌డీఏ చేపట్టిన మాస్టర్‌ప్లాన్‌ రహదారులను పరిశీలించారు. నేరెళ్లవలస నుంచి కొత్తవలస, బోయపాలెం నుంచి కాపులుప్పాడ, భీమిలి నుంచి దొరతోట జంక్షన్‌కు వేస్తున్న రహదారులను పరిశీలించారు. వాటి నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న వేగంతో పనులు కొనసాగిస్తే ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. మే నెల చివరి నాటికి పూర్తిచేస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ సమాధానమిచ్చారు. నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడా రాజీ పడవద్దని, సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ఈ పర్యటనలో వీఎంఆర్‌డీఏ చీఫ్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌, ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు. ఆ తరువాత అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి పనులను కూడా మంత్రి నారాయణ పరిశీలించారు.

Updated Date - Mar 15 , 2026 | 12:51 AM