Share News

‘సర్‌’లో విశాఖ ఆదర్శంగా నిలవాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:02 AM

రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న జిల్లాల్లో విశాఖపట్నం ఒకటని, ఇక్కడ నిర్వహించే సర్‌ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని, ఆ దిశగా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని భారత ఎన్నిక సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

‘సర్‌’లో విశాఖ ఆదర్శంగా నిలవాలి

భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్‌కుమార్‌

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న జిల్లాల్లో విశాఖపట్నం ఒకటని, ఇక్కడ నిర్వహించే సర్‌ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని, ఆ దిశగా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని భారత ఎన్నిక సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

భారత ఎన్నిక సంఘం అండర్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌తో కలిసి గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అవినాష్‌కుమార్‌ మాట్లాడుతూ సర్‌ ప్రక్రియలో ఈఆర్వోలు కీలకపాత్ర పోషించాలని, ఏ నిర్ణయమైనా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిండంతోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ఒక్క ఓటూ పోవడానికి వీల్లేదని, అనర్హులు జాబితాలో ఉండకూడదని స్పష్టంచేశారు. ఈవోఆర్వోలు తమ పరిధిలో ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించాలని, తక్కువ ఫలితాలు వచ్చిన చోట క్షేత్రస్థాయిలో పర్యటించి కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. ఆధార్‌ తదితరాలు గుర్తింపుకార్డు మినహా ప్రామాణికం కాదన్నారు. పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌ ప్రక్రియను సహేతుకంగా నిర్వహించి ప్రతిపాదనల్లో పొందుపర్చాలన్నారు. డిజిటిలైజేషన్‌ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. తక్కువ శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేసిన వారిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరరనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు,

సజావుగా ప్రక్రియ

జిల్లాలో ఓటరు జాబితా సమగ్ర సవరణప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ పవన్‌కుమార్‌ శర్మ గురువారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ జిల్లాలో సర్‌ వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 99.52శాతం ఎన్యుమరేషన్‌ పత్రాల పంపిణీ జరిగిందని, డిజిటలైజేషన్‌ ప్రక్రియ 69.18 శాతం పూర్తయిందన్నారు. చనిపోయిన, వలసవెళ్లిన వారి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలే తప్ప చివరినిమిషం వరకు దాచిపెట్టవద్దన్నారు. ఈనెల 14వ తేదీ అర్ధరాత్రితో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ఫ్రీజ్‌ అయ్యేలోగా ప్రక్రియ ముగించాలని సీఈసీ సూచించారు.

Updated Date - Jul 10 , 2026 | 01:02 AM