Share News

విశాఖ పునర్విభజన?

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:58 AM

ఇరవై లక్షల ఓటర్లకు చేరువలో ఉన్న విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాన్ని మూడుగా విభజించాలనే ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది.

విశాఖ పునర్విభజన?

మూడుగా లోక్‌సభ నియోజకవర్గం విభజన?

ప్రధాని ఆర్థిక సలహా మండలి కేంద్రానికి ప్రతిపాదన

ప్రస్తుతం జిల్లా ఓటర్లు 20.23 లక్షలు

పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు 19.34 లక్షలు

జిల్లా జనాభా 27 లక్షలు

విశాఖపట్నం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ఇరవై లక్షల ఓటర్లకు చేరువలో ఉన్న విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాన్ని మూడుగా విభజించాలనే ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఏటేటా పెరుగుతున్న జనాభాను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే విశాఖపట్నం స్థానాన్ని మూడుగా విభజించాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ నియోజక వర్గాలను 824కు పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ప్రధాని ఆర్థిక సలహా మండలి సమర్పించిన ప్రతిపాదనలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.

విశాఖ జిల్లాలో ఏడు (ఆరు పూర్తిగా, ఒకటి పాక్షికంగా) అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణనలో జిల్లా జనాభా 27 లక్షలు ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. అయితే విశాఖ లోక్‌సభ స్థానం ఓటర్లు రమారమి 19.34 లక్షలుగా ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎస్‌.కోట అసెంబ్లీ సెగ్మెంట్‌ విజయనగరం జిల్లాలో ఉంది. విశాఖ జిల్లాలో గల మిగిలిన ఆరు నియోజకవర్గాలకు ముఖ్యంగా భీమిలి, గాజువాక, తూర్పు, ఉత్తర నియోజక వర్గాలకు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. భీమిలి, గాజువాక నియోజక వర్గాల్లో ఓటర్ల సంఖ్య ఇప్పటికే మూడు లక్షలు దాటింది. తూర్పు, ఉత్తరం నియోజక వర్గాల్లో ఓటర్లు మూడు లక్షలకు చేరువగా ఉన్నారు. 2009 నుంచి గమనిస్తే రాష్టంలోని మిగిలిన జిల్లాల్లో కంటే విశాఖ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. 2009లో 14.02 లక్షలు ఉండగా, 2014లో 17.51 లక్షలకు, 2019లో 18.81 లక్షలకు, 2024కు 20.11 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 20.23 లక్షలకు చేరింది.

కొత్త లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా, ఓటర్ల సంఖ్యతోపాటు మరికొన్నింటిని ప్రామాణికంగా తీసుకున్నట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి పేర్కొంది. అధిక పట్ణణీకరణ, పెరుగుతున్న జనాభా, ఎస్సీ, ఎస్టీ జనాభా, భాషాపరమైన వ్యక్తుల సమూహం ఒకేచోట ఎక్కువగా ఉండడం, భాషాపరమైన వైవిధ్యం (ఒకేచోట వివిధ భాషలకు చెందిన సమూహం ఉండడం) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశాలన్నీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి వర్తిస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో పలు లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య 10 లక్షలకు అటుఇటుగా ఉంది. కానీ 2029 ఎన్నికల నాటికి విశాఖ లోక్‌సభ నియోజకవర్గం ఓటర్లు 20 లక్షలు దాటే అవకాశం ఉందని, అందువల్ల తప్పనిసరిగా విభజించాల్సిందేనని సూచిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పది, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నారు. లోక్‌సభ స్థానాన్ని మూడుగా చేయాలంటే ప్రస్తుతం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గల పెందుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌ను విశాఖలో కలపాలని సూచిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ప్రతిపాదించిన పేపరులో పూర్తి వివరాలు వెల్లడైతే ఈ విషయంలో స్పష్టత వస్తుందని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

విశాఖ లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం ఉన్న ఓటర్లు

అసెంబ్లీ స్థానం మొత్తం ఓటర్లు

భీమిలి 3,67,400

విశాఖ తూర్పు 2,82,184

విశాఖ దక్షిణ 2,17,765

విశాఖ ఉత్తరం 2,84,297

విశాఖ పశ్చిమ 2,13,854

గాజువాక 3,34,739

ఎస్‌.కోట 2,24,525

మొత్తం ఓటర్లు 19,34,764

Updated Date - Jun 13 , 2026 | 12:58 AM