2028 జూన్ నాటికి విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:09 AM
విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 2028 జూన్ నాటికి పూర్తవుతాయని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తెలిపారు.
పెందుర్తి, సింహాచలం, దువ్వాడ స్టేషన్ల అభివృద్ధికి ప్రాధాన్యం
పరిశీలనలో కొత్త రైళ్లు, కొత్త స్టాపుల ప్రతిపాదనలు
విశాఖ స్టేషన్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యం
దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్
విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 2028 జూన్ నాటికి పూర్తవుతాయని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తెలిపారు. ఆయన జోనల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలు వెల్లడించారు. రైల్వేస్టేషన్ పునర్మిర్మాణానికి గతంలో విడుదలైన రూ.453 కోట్లకు అదనంగా ఇటీవల యార్డు రీడెవలప్‌మెంట్‌కు రూ.299 కోట్లు మంజూరయ్యాయన్నారు. స్టేషన్ భవన నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. యార్డు రీ డెవలప్‌మెంట్ నిధులతో స్టేషన్‌లో కొత్తగా ఆరు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తామని, ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫారాలను విస్తరిస్తామన్నారు. విశాఖపట్నం స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి సింహాచలం, పెందుర్తి, దువ్వాడ స్టేషన్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త జోన్ కావడంతో ప్రజలకు అనేక ఆశలు, అంచనాలు ఉన్నాయన్నారు. కొత్త రైళ్ల కోసం ప్రతిపాదనలు తయారుచేసి బోర్డుకు పంపించామని, పరిశీలనలో ఉన్నాయన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అనేక ప్రాంతాల్లో కొత్త స్టాపులు కావాలని అడుగుతున్నారని, వాటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
జోన్ పరిధిలో సుమారు 300 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు నిర్మించనున్నామని, ఇవన్నీ సవాళ్లతో కూడిన పనులను చెప్పారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వ్యాపార అవసరాల కోసం కొత్తగా చేపట్టాల్సిన పనులపై రెండు సార్లు హైలెవెల్ సమావేశాలు నిర్వహించామన్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల కోసం విశాఖపట్నం డివిజన్‌లో ఐదు సెంటర్లు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ జోన్ ప్రధాన కేంద్రంలో ఉన్నందున అక్కడ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనికి పౌరులు, ప్రయాణికులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వై.బాలాజీకిరణ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అంకుశ్ గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ బీఎస్‌కే రాజ్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.సాంబశివరావు, ఐజీ అండ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఏకే సిన్హా, చీఫ్ పాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ షిఫాలీ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ ఓవీ సురేశ్ కుమార్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వయిజర్ డాక్టర్ పూడి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.