Share News

విశాఖకు పెద్దపీట

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:50 AM

రాష్ట్ర బడ్జెట్‌లో విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యం లభించింది.

విశాఖకు పెద్దపీట

బడ్జెట్‌లో ఎకనామిక్‌ రీజియన్‌కు రూ.28,000 కోట్లు కేటాయింపు

530కి పైగా మేజర్‌ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురానున్నట్టు ప్రకటన

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.15 కోట్లు

జూకు రూ.1.13 కోట్లు

పీపీపీలో ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం రైతుబజార్ల అభివృద్ధి

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల భృతి

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర బడ్జెట్‌లో విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యం లభించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే మూడు ఎకనామిక్‌ రీజియన్లలో విశాఖపట్నం ఒకటని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) పరిధిలో తొమ్మిది జిల్లాల (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్‌, తూర్పు గోదావరి)ను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి 530కి పైగా మేజర్‌ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురావడానికి రూ.28 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడించింది. నీతి ఆయోగ్‌తో కలిసి విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ను అభివృద్ధి చేస్తామని, అందులో ఐటీ, లాజిస్టిక్స్‌, ఎడ్యుకేషన్‌, టూరిజం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ఈ విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పటికే వీఎంఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.

బడ్జెట్‌లో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.15 కోట్లు కేటాయించారు. ఇటీవలె కేంద్రం విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు కేటాయించింది.

- విశాఖపట్నం జంతు ప్రదర్శన శాలను అభివృద్ధి చేయాలని జిల్లా నాయకులు చాలా పట్టుదలగా ఉండడంతో ప్రభుత్వం రూ.1.13 కోట్లు కేటాయించింది.

- విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ ట్రిబ్యునల్‌ భవన నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించింది.

- ఎంవీపీ కాలనీ, గోపాలపట్నంలోని రైతుబజార్లను పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత చేరువ చేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

- మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.పది వేల నుంచి రూ.20 వేలకు పెంచామని, ఇది అర్హులైన వారందరికీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

- ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు రూ.56.9 లక్షలు కేటాయించారు.

- విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌కు కోటి రూపాయలు కేటాయించారు.

- లేబర్‌ కోర్టు కమ్‌ ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌ కోర్టులకు రూ.1.15 కోట్లు కేటాయించారు.


పోలీస్‌ కమిషనరేట్‌కు రూ.1.5 కోట్లు

భవన నిర్మాణాలకు కేటాయింపు

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1.5 కోట్లు కేటాయించింది. నగర పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనం పూర్తిచేయడంతోపాటు మహారాణిపేట స్టేషన్‌కు కొత్తభవనం, ఆరిలోవ వద్ద ద్వారకా సబ్‌డివిజన్‌ ఏసీపీ కార్యాలయంతోపాటు పోలీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు భవన నిర్మాణం కోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు.

‘మిషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌’కు రూ.కోటి

దేశంలోని మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో గల మురికివాడల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మిషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ 100 స్మార్ట్‌సిటీస్‌’ కోసం జీవీఎంసీకి రాష్ట్ర ప్రభుత్వవాటాగా రూ.కోటి బడ్జెట్‌లో కేటాయించింది.


ఏయూకు రూ.389.34 కోట్లు

జీతాలు, పెన్షన్ల కోసం కేటాయింపు

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ల చెల్లింపు నిమిత్తం రూ.389.34 కోట్లు గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. వర్సిటీలో సుమారు రెండు వేల మంది వరకు ఉద్యోగులు, 3,500 మంది వరకు పెన్షనర్లు ఉన్నారు. గడిచిన ఏడాది రూ.389.34 కోట్లు, 2024-25 బడ్జెట్‌లో రూ.417.24 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

అభివృద్ధిని పరుగులెత్తించే బడ్జెట్‌

ప్రొఫెసర్‌ ఆర్‌.సుదర్శనరావు, ఎకనామిక్స్‌ విభాగం మాజీ అధిపతి, ఏయూ

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది. కీలక రంగాలకు కేటాయింపులు జరిపిన తీరు చూస్తుంటే 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించే దిశగా బడ్జెట్‌ ఉందని చెప్పవచ్చు. గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, 54 వేల కోట్ల రూపాయల మూలధన వ్యయంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రతిపాదనలు చేయడం హర్షనీయం. సమతుల్య అభివృద్ధికి ఎకనామిక్‌ జోన్లు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించడం ఈ బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యమైన అంశంగా చెప్పవచ్చు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించి సత్వర అభివృద్ధి లక్ష్య సాధనకు ఈ బడ్జెట్‌ తోడ్పడుతుంది. జల వనరుల శాఖకు అత్యధికంగా రూ.18 వేల కోట్ల కేటాయించడం అభినందనీయం. పోలవరంతోపాటు కీలక ప్రాజెక్టులు పూర్తికి అవకాశం కలుగుతుంది. ఆర్థిక క్రమశిక్షణకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు పరిమితం కాకుండా స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనే నినాదంతో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలు శరవేగంగా గ్రౌండ్‌ అయ్యేట్టు చూసి అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు అవసరమైన చొరవను తీసుకునే అవకాశం ఉంది.

స్వర్ణాంధ్రాను సాకారం చేసే బడ్జెట్‌

గంటా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి రూపొందించిన ఈ బడ్జెట్‌ స్వర్రాంధ్ర కలను సాకారం చేస్తుంది. ఇది ప్రజా బడ్జెట్‌. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌కు రూ.28 వేల కోట్లు కేటాయించడంతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల్లో అభివృద్ధి వేగం పుంజుకుటుంది. ప్రతి జిల్లాకు ఒక సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ కేటాయించారు. అన్ని రంగాలకు ప్రాధాన్యం లభించింది.

జిల్లాల అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు

పెతకంశెట్టి గణబాబు, పశ్చిమ ఎమ్మెల్యే

ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్‌. విశాఖను ఏఐ డేటా సెంటర్‌ హబ్‌గా, లాజిస్టిక్స్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలు ఉన్నాయి. ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల 33 శాతం ఆదాయం పెరిగింది. అంటే ఆదాయం పెంచే బడ్జెట్‌ కూడా అని నిరూపితమైంది. ఇవన్నీ గుత్త కేటాయింపులే, ఆ తరువాత జిల్లా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి. అందులో విశాఖకు తగిన ప్రాధాన్యం ఉంటుంది.

అభివృద్ధి పరవళ్లు

పి.విష్ణుకుమార్‌రాజు, ఉత్తర ఎమ్మెల్యే

ప్రజలకు ఏది అవసరమో ఆలోచించి, అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం రూపొందించిన బడ్జెట్‌ ఇది. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌తో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు అభివృద్ధి పరవళ్లు తొక్కుతుంది. కూటమి నాయకుల పరస్పర సహకారంతో రాష్ట్రం ఈ నిధులతో మరింత అభివృద్ధి చెందుతుంది.

అన్ని రంగాలకు ప్రాధానం

పంచకర్ల రమేశ్‌బాబు, పెందుర్తి ఎమ్మెల్యే

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలు తీర్చేదిగా ఉంది. అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అనుభఽవం కలిగిన ముఖ్యమంత్రి కావడంతో విశాఖ రీజియన్‌ ప్రాధాన్యం గుర్తించి ఎక్కువ నిధులు కేటాయించారు. ఇది ఖర్చులు, ఆదాయం చూపించేదిగా కాకుండా భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్‌గా నిలిచింది.

అంతా అంకెల గారడీయే

కేకే రాజు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉత్తరాంధ్రకు మొండి చెయ్యి చూపించారు. సూపర్‌సిక్స్‌లో హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగభృతి ప్రస్తావన లేదు. బడ్జెట్‌లో అంకెలగారడీ తప్పితే వాస్తవ కేటాయింపులు లేకుండా ప్రజలను మోసం చేశారు.

Updated Date - Feb 15 , 2026 | 12:50 AM