Share News

విశాఖ అందమైన, అభివృద్ధి చెందుతున్న నగరం

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:05 AM

ఏపీలో తొలి లైట్‌ హౌస్‌ మ్యూజియం విశాఖపట్నంలో ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రకటించారు.

విశాఖ అందమైన, అభివృద్ధి చెందుతున్న నగరం

ఏపీలో తొలి లైట్‌హౌస్‌ మ్యూజియం నగరంలో ఏర్పాటుచేస్తాం

కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్‌

ముగిసిన లైట్‌హౌస్‌ ఫెస్టివల్‌

బీచ్‌రోడ్డు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):

ఏపీలో తొలి లైట్‌ హౌస్‌ మ్యూజియం విశాఖపట్నంలో ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రకటించారు. శనివారం సాయంత్రం బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో నిర్వహించిన లైట్‌హౌస్‌ ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లైట్‌ హౌస్‌ మ్యూజియం సముద్ర విద్య, వారసత్వ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి కేంద్రంగా పనిచేస్తుందన్నారు. లైట్‌ హౌస్‌లు తీరాల్లోనే కాకుండా ప్రజల హృదయాల్లోనూ వెలుగులు నింపాలన్నారు. విశాఖకు రావడం ఇది రెండోసారి అని, ఇక్కడి ప్రజలు ఎంతో మంచివారని, క్రమశిక్షణతో మెలుగుతారన్నారు. విశాఖ నగరం అందమైనదే కాదని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విశాఖ మరిన్ని విజయాలను అందుకుంటుదన్నారు. తొలుత తెలుగులో మాట్లాడిన ఆయన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. తెలుగు చాలా తీయని, అందమైన భాష అని అన్నారు. తెలుగు వినడం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్‌గోపితోపాటు, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌, జల మార్గాల మంత్రిత్వ కార్యదర్శి విజయకుమార్‌, అదనపు కార్యదర్శి ముఖేష్‌మంగళ్‌, విశాఖపట్నం పోర్టు ఇన్‌చార్జి చైర్మన్‌ ఎం.అంగముత్తు, డీసీఐ ఎం.డి.దివాకర్‌, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు , వంశీకృష్ణ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.


లైట్‌హౌస్‌లు పర్యాటక భవిష్యత్తుకు వెలుగులు

కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్‌ గోపి

బీచ్‌రోడ్డు (విశాఖపట్నం), జనవరి 10 (ఆంధ్రజ్యోతి):

విశాఖలో నిర్వహించిన మూడో లైట్‌హౌస్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్‌ గోపి పేర్కొన్నారు. శనివారం విశాఖ బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో నిర్వహించిన లైట్‌హౌస్‌ ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లైట్‌హౌస్‌లు కేవలం రాళ్లు, ఉక్కుతో నిర్మించిన కట్టడాలు మాత్రమే కావని, చరిత్రకు, అస్తిత్వానికి, జాతీయతకు గుర్తులని పేర్కొన్నారు. లైట్‌హౌస్‌లు సముద్రంలో ఓడలకే కాకుండా, పర్యాటక రంగ భవిష్యత్తుకు కూడా నిరంతరం వెలుగునిస్తూనే ఉంటాయన్నారు. తనకు కేరళలోని ఆలప్పుజ లైట్‌హౌస్‌ అంటే ఎంతో ఇష్టమన్నారు. తన సినిమా కెరీర్‌కు సహకరించిన ఏపీ, తమిళనాడు, కర్ణాటక ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌, జల మార్గాల మంత్రిత్వ కార్యదర్శి విజయకుమార్‌, అదనపు కార్యదర్శి ముఖేష్‌ మంగళ్‌, విశాఖపట్నం పోర్టు అథారిటీ ఇన్‌చార్జి చైర్మన్‌ ఎం. అంగముత్తు, డీసీఐ ఎం.డి. దివాకర్‌, నగర మేయర్‌ పీలా శ్రీనివాసులు, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

పాట పాడిన మంత్రి..

అనంతరం మంత్రి ‘మీకు ఒక సర్‌ప్రైజ్‌ ఇస్తా...ఒక యాక్టర్‌గా నేను లవ్‌లో పడిన పాటను ఆలపిస్తానంటూ అల్లు అర్జున్‌ నటించిన ‘అలా వైకుంఠపురం’ సినిమాలోని ‘సామజవరగమనా నిను చూసి ఆగగలనా...మనసుమీద వయసుకున్న అదుపు చెప్పతగునా’ పాట పాడి యువతను ఉర్రూతలూగించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఒక తమిళ పాటను కూడా ఆలపించి అలరించారు.

Updated Date - Jan 11 , 2026 | 01:05 AM