Share News

ఏఐ సిటీగా విశాఖ

ABN , Publish Date - Apr 29 , 2026 | 01:07 AM

విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సిటీగా, విశ్వనగరిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

ఏఐ సిటీగా విశాఖ

  • విశ్వనగరిగా అభివృద్ధి చేస్తాం

  • గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

  • కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబునాయుడు

  • నగరానికి 60 రోజుల్లో గోదావరి నీరు

  • జూన్‌ 1 నుంచి కొత్త రైల్వే జోన్‌ కార్యకలాపాలు

  • జూలైలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం

  • ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తాం

  • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • 2028 నుంచి ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ఉత్పత్తి ఎగుమతులు

  • 2028 సెప్టెంబరు నాటికి డేటా సెంటర్‌ తొలిదశ నిర్మాణం పూర్తి

  • ఇక ఉత్తరాంధ్రకు తిరుగు మేధోవలసలే

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సిటీగా, విశ్వనగరిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామం వద్ద మంగళవారం గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గూగుల్‌ ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ విశాఖపట్నానికి నీటి కొరత లేదని, 60 రోజుల్లో గోదావరి నీరు తీసుకువస్తామన్నారు. అదేవిధంగా జూన్‌ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పనిచేస్తుందని, దీనికి అవసరమైన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కేంద్ర రైల్వే మంత్రి అంగీకరించారన్నారు. జూలై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తామని, దానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తారన్నారు. అనకాపల్లి జిల్లాలో ఇటీవల శంకుస్థాపన చేసిన ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంటు 2028 నుంచి ఉత్పత్తి ప్రారంభించి తొలి షిప్‌మెంట్‌ చేస్తుందన్నారు. అలాగే రెన్యూ పవర్‌ కూడా సోలార్‌ ఇన్‌గాట్స్‌ ఉత్పత్తి ప్రారంభిస్తుందన్నారు. ఈ గూగుల్‌ డేటా సెంటర్‌ను కూడా 2028 సెప్టెంబరు నాటికి తొలి దశ పూర్తిచేసి ప్రధాని నరేంద్రమోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు. వీటన్నింటితో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటివరకు ఉపాధి కోసం ఉత్తరాంధ్ర ప్రజలు వలస పోయేవారని, ఇకపై అవన్నీ ఆగిపోయి మేధోవలసలు రివర్స్‌లో ఇక్కడికి వస్తాయన్నారు. ఈ భారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలతో ఉపాధి అవకాశాలు అందరికీ లభిస్తాయన్నారు. తూర్పుతీరంలో కోల్‌కత్తా నుంచి చెన్నై వరకు ప్రస్తుతం రెండే రైల్వే లైన్లు ఉన్నాయని, వీటిని నాలుగు చేయడానికి కేంద్రం పచ్చజెండా ఊపిందని, దీనివల్ల ఏపీలో అనేక ప్రాంతాలకు నాలుగు రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుందని, అందులో విశాఖపట్నం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.


అప్పన్న సన్నిధిలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు

సింహాచలం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ కోడూరి రామచంద్రమోహన్‌, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జల్లేపల్లి వెంకటరావులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల గోత్రనామాలతో అంతరాలయంలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు అష్టోత్తర శతనామావళితో అర్చనలు చేశారు. శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న తరువాత ఆలయ బేడా మండప ప్రదక్షిణ చేశారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు తరువాత ఆలయ పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలిచ్చారు. ముఖ్యమంత్రిని విజయనగరం శాసనసభ్యురాలు, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యురాలు అదితి విజయలక్ష్మీ గజపతి దుశ్శాలువాతో సత్కరించి స్వామివారి దారు విగ్రహాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులకు దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, ఈఓ జె.వెంకటరావులు సత్కరించారు. అనంతరం ఆస్థాన మండపంలో స్వామివారి ప్రసాదాన్ని సీఎం, ఇతర మంత్రులు స్వీకరించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు), గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 01:07 AM