Share News

ఏఐ, డిజిటల్‌ హబ్‌గా విశాఖ

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:10 AM

జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కంప్యూటింగ్‌, డిజిటల్‌ కనెక్టివిటీ కేంద్రంగా విశాఖపట్నం వేగంగా ఎదుగుతోందని ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో సీఎం సాయికాంత్‌ వర్మ పేర్కొన్నారు.

ఏఐ, డిజిటల్‌ హబ్‌గా విశాఖ

ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో సీఎం సాయికాంత్‌ వర్మ

గూగుల్‌, ఆర్సెల్లార్‌ మిట్టల్‌, కాగ్నిజెంట్‌ వంటి గ్లోబల్‌ సంస్థలను ఆకర్షిస్తున్న డేటా సెంటర్‌ పాలసీ 4.0, క్లీన్‌ ఎనర్జీ పాలసీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కంప్యూటింగ్‌, డిజిటల్‌ కనెక్టివిటీ కేంద్రంగా విశాఖపట్నం వేగంగా ఎదుగుతోందని ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో సీఎం సాయికాంత్‌ వర్మ పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విశాఖపట్నం వార్షిక సమావేశంలో భాగంగా ‘డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, సమగ్ర వృద్ధి-ప్రాంతీయ రూపాంతరానికి కీలకం’ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ.. గిగావాట్‌ స్థాయి ఏఐ డేటా సెంటర్లు, ఏఐ హబ్‌, తూర్పు తీరంలో సముద్రం అడుగున కేబుల్‌ ల్యాండింగ్‌ వంటివన్నీ విశాఖను ఏఐ కంప్యూటింగ్‌, డిజిటల్‌ కనెక్టివిటీ కేంద్రంగా చేయడంలో కీలకంగా నిలుస్తాయన్నారు. డేటా సెంటర్‌ పాలసీ 4.0, క్లీన్‌ ఎనర్జీ పాలసీ వంటి పురోగతి విధానాలు గూగుల్‌, ఆర్సెల్లార్‌ మిట్టల్‌, కాగ్నిజెంట్‌ సంస్థలను ఆకర్షిస్తున్నాయన్నారు. నీతి ఆయోగ్‌ విశాఖను దేశంలోని నాలుగు కీలక వృద్ధి కేంద్రాల్లో ఒకటిగా గుర్తించిందన్నారు. ఏపీ స్థూల ఉత్పత్తిలో సుమారు 30 శాతం వాటా అందిస్తున్న ఈ ప్రాంతం... 2047 నాటికి రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్న 2.4 ట్రిలియన్‌ డాలర్ల మార్కును సాధించే ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు కీలకం కానుందన్నారు. రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సదరన్‌ రీజియన్‌ ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.మనోహర్‌ రాజా మాట్లాడుతూ.. పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులు, రైల్వేలు, లాజిస్టిక్‌ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. దీనివల్ల వ్యయాలు తగ్గి ఎగుమతుల సామర్థ్యం పెరుగుతుందన్నారు. సమావేశంలో సీఐఐ ఏపీ చైర్మన్‌ జి.మురళీకృష్ణ, సీఐఐ విశాఖపట్నం చైర్మన్‌ జి.కృష్ణమోహన్‌, మాజీ చైర్మన్‌ డీవీఎస్‌ నారాయణ రాజుతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.


సెమీ కండక్టర్‌ పరిశ్రమకు 30 ఎకరాలు

ఎకరా రూ.1కి కేటాయింపు

ప్రభుత్వ ఉత్తర్వులు

మౌలిక వసతుల కల్పన బాధ్యత ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖదే

రెండు దశల్లో రూ.2,387.81 కోట్ల పెట్టుబడి

1,000 మందికి ఉద్యోగాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం తర్లువాడలో సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్టింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటుకు మెస్సర్స్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు ప్రభుత్వం ఎకరా రూ.1 చొప్పున 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తర్లువాడలో గూగుల్‌కు ఇచ్చిన 308 ఎకరాలకు ఆనుకునే ఈ 30 ఎకరాలు ఉంది. తొలుత 22 ఎకరాలు ఇవ్వాలని ప్రతిపాదించినా కంపెనీ అభ్యర్థన మేరకు 30 ఎకరాలు కేటాయించారు. సెమీ కండక్టర్‌ అసెంబ్లీ, టెస్టింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ. 2,387.81 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి తొలిదశలో రూ.542.19 కోట్లతో 200 మందికి, రెండో దశలో రూ.1,845.61 కోట్లు పెట్టుబడితో 800 మందికి...మొత్తం 1,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నది. ఇండియా సెమీ కండక్టర్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి వస్తున్న తొలి కంపెనీ కావడంతో అన్ని రకాల ప్రోత్సహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రోడ్లు, విద్యుత్‌, నీటి సదుపాయాలను రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ కల్పిస్తోంది. కాగా తర్లువాడలో సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపు, ఇతర రాయితీలు ఇచ్చేందుకు ఈ నెల 24వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.


నేటి నుంచి తెలుగు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌

వేదికగా పీఎం పాలెం స్టేడియం...ప్రవేశం ఉచితం

డాబాగార్డెన్స్‌/మహారాణిపేట, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

తెలుగు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ పోటీలను మధురవాడలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్టు సినీ నటుటు శ్రీకాంత్‌, తరుణ్‌ తెలిపారు. నటులు సుధీర్‌బాబు, అశ్విన్‌, ప్రిన్స్‌, అయ్యప్పశర్మ, ఖయ్యూమ్‌, ప్రభాకర్‌, నిఖిల్‌, నందకిషోర్‌, పవన్‌సాయి, సాంబ, దర్శకుడు ఓంకార్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం వారు డాల్ఫిన్‌ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సినిమా, టీవీ నటులతో రెండేసి టీమ్‌లు, పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో ఒక్కో టీమ్‌ చొప్పున మొత్తం ఏడు టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల చదువు, సీఎం సహాయనిధి, దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తారని తెలియజేశారు. సెలబ్రిటీ లీగ్‌ నిర్వాహకుడు రాంబాబు మాట్లాడుతూ శనివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుందన్నారు. ఉచితంగా మ్యాచ్‌లు తిలకించవచ్చునన్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎంపీ శ్రీభరత్‌, జీవీఎంసీ, పోలీస్‌ కమిషనర్‌ల సహకారంతో మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం సినీ తారలు ప్లకార్డులు ఆవిష్కరిస్తూ..స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ ఉత్తమ పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందేందుకు జీవీఎంసీకి విశాఖ ప్రజలు సహకరించాలని కోరారు.


నేడు పింఛన్లు పంపిణీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

సామాజిక పింఛన్లు శనివారం పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 1,58,557 మంది (జీవీఎంసీ పరిధిలో 1,32,244 మందికి రూ.58.58 కోట్లు, నాలుగు గ్రామీణ మండలాల్లో 26,313 మందికి రూ.11.11 కోట్లు) కోసం మొత్తం రూ.69.7 కోట్లు విడుదలయ్యాయి. పింఛన్ల సొమ్మును సచివాలయ సిబ్బంది అందజేస్తారు.

Updated Date - Feb 28 , 2026 | 01:10 AM