ప్రపంచస్థాయి నగరంగా విశాఖ
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:44 AM
రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న ఐదవ అంతర్జాతీయ రవాణా సదస్సులో విశాఖ ప్రజా రవాణా అభివృద్ధి విజన్‌ను ఎంపీ ఎం.శ్రీభరత్ మంగళవారం ఆవిష్కరించారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రయాణ సమయం తగ్గించేందుకు ‘ప్రాజెక్టు సారథి’
ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖ ప్రజా రవాణా అభివృద్ధి విజన్ మాస్కోలో ఆవిష్కరణ
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న ఐదవ అంతర్జాతీయ రవాణా సదస్సులో విశాఖ ప్రజా రవాణా అభివృద్ధి విజన్‌ను ఎంపీ ఎం.శ్రీభరత్ మంగళవారం ఆవిష్కరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టితో విశాఖను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా నగరంలో ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడం, ప్రయాణ సమయం తగ్గించేందుకు వీలుగా ‘ప్రాజెక్టు సారథి’ని చేపడుతున్నట్టు చెప్పారు. అలాగే స్మార్ట్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, ఎలక్ర్టిక్ రవాణా, డిజిటల్ పరివర్తన, డిజిటల్ పౌర సేవలు, స్కాడాతో నీటి సరఫరా, జనన, మరణ పత్రాల డిజిటలైజేషన్, స్మార్ట్ వెండింగ్ జోన్‌లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం వంటి అంశాలను ప్రతినిధులకు వివరించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో మురికివాడల అభివృద్ధి, శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమలుచేస్తున్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సమావేశంలో మాస్కో డిప్యూటీ మేయర్ మక్సిమ్‌లిక్సుటోవ్ మాట్లాడుతూ పారిశ్రామిక సహకారం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై విశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని, దీనివల్ల దీర్ఘకాలంలో ఇరు నగరాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.