Share News

ప్రపంచశ్రేణి నగరంగా విశాఖ

ABN , Publish Date - May 31 , 2026 | 12:51 AM

విశాఖను ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ కోరారు.

ప్రపంచశ్రేణి నగరంగా విశాఖ

కేంద్ర, రాష్ట్ర అధికారుల సమష్టి కృషి, సమన్వయం, సరైన ప్రణాళిక ద్వారానే సాధ్యం

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్‌

మెరుగైన తాగునీటి వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని ఆదేశం

టిడ్కో ఇళ్ల సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు

విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):

విశాఖను ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ కోరారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్‌ హోదాలో ఆయన మాట్లాడుతూ సమష్టి కృషి, సరైన ప్రణాళిక ద్వారానే నగరానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. మౌలిక సదుపాయాలు, మెరుగైన తాగునీటి వ్యవస్థ, సమర్థవంతమైన మురుగునీటి నిర్వహణ, పర్యావరణ రక్షణ, అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టిసారించాలన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.50 వేల కోట్ల అర్బన్‌ ఛాలెంజడ్‌ ఫండ్‌లో విశాఖపట్నానికి రూ.1,500 కోట్లు విలువైన మూడు ప్రాజెక్టులు మంజూరుకావడం సంతోషంగా ఉందని పేర్కొంటూ జీవీఎంసీ అధికారులకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికార యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. జలధార-జలహారతి ద్వారా తాగునీటి సంరక్షణ జరగాలని, ఎన్టీఆర్‌ సామాజిక పింఛన్లు అర్హులకు అందాలని, ఉల్లాస్‌ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు శతశాతం అక్షరాస్యత సాధించాలని అన్నారు. నూతన లేబర్‌ కోడ్‌లపై వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు ఏర్పాటుచేసే అవగాహన శిబిరాల్లో తాను, కలెక్టర్‌ పాల్గొంటామన్నారు. పేదలకు గృహాలు మంజూరుచేయాలని, రైతులు పండించే పంటలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని, విద్యాశాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని శ్రీభరత్‌ ఆదేశించారు. నగరంలో అమ్ముతున్న చికెన్‌, మటన్‌ నాణ్యతపై అధికారులు దృష్టిసారించాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి గ్రేడింగ్‌ ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పథకాల అమలుకు కార్యాచరణ రూపొందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని, సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ మల్కాపురంలోని అచ్చెన్నాయుడులోవలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడ్కో, రాజీవ్‌ గృహకల్ప కింద నిర్మించిన కాలనీల్లో లబ్ధిదారులు లేక ఇళ్లు ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని జీవీఎంసీ యూసీడీ, గృహ నిర్మాణ సంస్థ అధికారులకు ఆదేశించారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల కోసం డీడీలు కట్టి బ్యాంకు రుణాలు చెల్లిస్తున్న లబ్ధిదారులకు ఇంతవరకూ ఇళ్లు కేటాయించకపోడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సమీక్షలో దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 12:51 AM