ఆర్థిక కేంద్రంగా విశాఖ
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:00 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యానికి అనుగుణంగా విశాఖ జిల్లాను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
విజన్ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యానికి అనుగుణంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక
జిల్లా స్థూల ఉత్పత్తి లక్ష్యం రూ.20.63 లక్షల కోట్లు
తలసరి ఆదాయ లక్ష్యం రూ.1.41 కోట్లు
అభివృద్ధికి ఎనిమిది చోదక శక్తులు గుర్తింపు
తల్లికి వందనం పథకం ద్వారా 2.23 లక్షల మందికి రూ.335.33 కోట్లు జమ
స్త్రీశక్తి పథకం ద్వారా ఏడాదిలో 8.29 కోట్ల మంది ఉచిత ప్రయాణ సదుపాయం
సామాజిక పింఛన్లు రూ.1,687 కోట్ల పంపిణీ
28 ఐటీ కంపెనీల ద్వారా రూ.76,427 కోట్ల పెట్టుబడులు
రూ.62,785 కోట్లతో డేటా సెంటర్లు, పరిశ్రమలు
రూ.3,385.18 కోట్లతో జీవీఎంసీలో పలు అభివృద్ధి పనులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యానికి అనుగుణంగా విశాఖ జిల్లాను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో ఉన్న సహజ వనరులు, సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం, అంతర్జాతీయస్థాయి పోర్టులు, పారిశ్రామిక వసతులు, ఐటీ, పర్యాటక, వైద్యం, విద్య, సేవల రంగాల్లో ఉన్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని 2047 నాటికి జిల్లాను రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, సేవారంగ కేంద్రాల్లో ఒకటిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి అనగాని మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.61 లక్షల కోట్లుగా ఉన్న జిల్లా స్థూల ఉత్పత్తిని 2047-48 నాటికి రూ.20.63 లక్షల కోట్లకు, ప్రస్తుతం రూ.6,58,964గా ఉన్న తలసరి ఆదాయాన్ని 2047-48 కల్లా రూ.1.41 కోట్లకు పెంపొందించాలనేది విజన్ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 భాగంగా విశాఖ వృద్ధికి ప్రధానంగా పోర్టులు, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ; ఐటీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ సేవలు; తయారీ పరిశ్రమలు, ఆధునాతన పారిశ్రామిక పార్కులు; ఫార్మా, మెడ్‌టెక్, ఆరోగ్య సేవలు; పర్యాటకం, ఆతిథ్యం; లాజిస్టిక్స్, గిడ్డంగులు, మల్టీ మోడల్ రవాణా; వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశు సంవర్ధక; పునరుత్పాదకత ఇంధనం, హరిత అభివృద్ధి వంటి ఎనిమిది చోదక శక్తులను గుర్తించామన్నారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ-4 కార్యక్రమం ద్వారా జిల్లాలో 1,05,187 బంగారు కుటుంబాలను గుర్తించగా, అందులో 66,207 కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారన్నారు. గడచిన ఏడాదికాలంలో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా వాటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. తల్లికి వందనం పథకం కింద జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27)లో 2.23 లక్షల మంది తల్లుల ఖాతాకు రూ.335.33 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న 88 మందికి షైనింగ్ స్టార్స్ కింద ఒక్కొక్కరికి రూ.20 వేలు అందజేశామన్నారు. దీపం-2 పథకం ద్వారా జిల్లాలో 18.15 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.152.97 కోట్లు సబ్సిడీగా జమ చేశామని, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో గడచిన ఏడాదికాలంలో 8.29 కోట్ల మంది ప్రయాణించారన్నారు. తద్వారా రూ.221 కోట్లు లబ్ధి పొందినట్టు చెప్పారు. ఇందులో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1,53,097 మందికి వివిధ సామాజిక పింఛన్ల కింద రూ.1,687 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 18 వేలమంది రైతులకు రూ.9.28 కోట్లు, వేట నిషేధకాలంలో 13,597 మంది మత్స్యకారులకు రూ.27.2 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఉపాధి హామీ పథకం (ప్రస్తుతం వీబీ జీ రామ్‌జీ) కింద 15 లక్షల పనిదినాలు కల్పించామని, నరేగా పథకంలో 52 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో భాగంగా జిల్లాలో 1,31,794 మందికి రూ.211 కోట్లు ఖర్చుచేశామన్నారు. పీఎంఏవైలో అర్బన్, గ్రామీణ గృహ నిర్మాణ పథకాల ద్వారా రూ.862 కోట్లతో 47,928 ఇళ్లు చేపట్టామన్నారు.
విశాఖలో ఇప్పటివరకూ 28 ఐటీ కంపెనీలకు భూములు కేటాయించగా వాటి ద్వారా రూ.76,424 కోట్ల పెట్టుబడులు, సుమారు 1.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఇంకా పర్యాటకం, ఇతర అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. రూ.62,785 కోట్లతో నిర్మించనున్న గూగుల్ డేటా సెంటర్, గుర్రంపాలెంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా 95 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు. జిల్లాలో 55 భారీ పరిశ్రమలు, 38,281 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు పనిచేస్తుండగా, రూ.2116.7 కోట్లతో నాలుగు భారీ పరిశ్రమలు, రూ.271.33 కోట్లతో 32 యూనిట్ల ఏర్పాటుదశలో ఉన్నాయన్నారు. జీవీఎంసీ పరిధిలో రూ.3,385.18 కోట్లతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి వివరించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో భాగంగా ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, ఇంకా వైజాగ్ బే సిటీ, క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి, రోడ్, రైలు ప్రాజెక్టులు, వ్యర్థాల నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ఇంకా ఎడ్యుకేషన్, స్కిల్ హబ్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అందరికీ ఇళ్లు, స్లమ్ రీడెవలప్‌మెంట్, తదితర ప్రాజెక్టుల పనులు మొదలుకావలసి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక భూసమస్యలు పరిష్కరించామని వివరించారు. జిల్లాలో 23,949 అర్జీలు నమోదుకాగా 85 శాతం పరిష్కరించామని, వచ్చే ఏడాది డిసెంబరుకల్లా రీసర్వే పూర్తిచేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి ఇతోధికంగా సహాయం, సలహాలు అందిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా అధికారులు, న్యాయాధికారులు, పోలీసులు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కాగా మంత్రి తొలుత జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, సీపీ డాక్టర్ శంఖబ్రాత్‌బాగ్చితో కలిసి పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం 568 మందికి సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆరు ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శించగా వైద్య ఆరోగ్యశాఖకు ప్రథమ, విద్యా శాఖకు ద్వితీయ, పౌర సరఫరాలు, రెవెన్యూశాఖ శకటాలకు తృతీయ బహుమతి, జీవీఎంసీ శకటానికి ప్రోత్సాహక బహుమతి లభించాయి. బాలబాలికల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
30,366 మందికి రూ.397.33 కోట్ల ఆస్తుల పంపిణీ
వివిధ ప్రభుత్వ పథకాల కింద 30,366 మందికి రూ.397.33 కోట్ల విలువైన ఆస్తులు, ఆర్థిక సహాయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేశారు. డీఆర్‌డీఏ, జీవీఎంసీ యూసీడీ, ట్రైకార్ తదితర విభాగాల ద్వారా బ్యాంకు లింకేజీ, స్ట్రీనిధి, ఇతర పథకాల లబ్ధిదారులకు సహాయం అందించారు. ఈ సందర్భంగా మైదానంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి, ఇతర అధికారులు సందర్శించారు.
కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, జాయింట్ కలెక్టక్ జి.విద్యాధరి, జీవీఎంసీ కమిషనన్ కేతర్‌గార్గ్, డీసీపీలు చందోలు మణికంఠ, లతామాధురి, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. కూటికుప్పల సూర్యారావు, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో దిలీప్‌చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.