ముస్తాబైన విశాఖ
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:33 AM
ముస్తాబైన విశాఖ
నేటి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఏపీ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా
విదేశీ ప్రతినిధులకు స్వాగత ఏర్పాట్లు
సర్వాంగ సుందరంగా సిద్ధమైన ప్రధాన వేదిక
వ్యాపార చర్చలు జరిపేందుకు వీలుగా ప్రత్యేక హాళ్లు
ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన కళాకృతులు
విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తామైంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్న సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, దేశ, విదేశాల ప్రతినిధులు భారీసంఖ్యలో హాజరుకానున్నారు. సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విదేశీ అతిథులకు ఏపీ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత ఏర్పాట్లుచేసింది. గిరిజన థింసా, గరగ నృత్యం, తప్పెటగుళ్లతో కళాకారులు అతిథులకు స్వాగతం పలకనున్నారు.
సభా ప్రాంగణంలో అమరావతి వైభవం, నూతన రాజధానిలో నిర్మాణాలు, కడియం నర్సరీ తదితర రాష్ట్రానికి చెందిన ప్రత్యేకతలను చాటిచెప్పే కళాకృతులను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో వనరులు, పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేసేలా వ్యవసాయం, ఉద్యాన పంటలు, అరకు కాఫీ, టూరిజం, లాజిస్టిక్స్, సోలార్ తదితర అంశాలను పరిచయం చేసేందుకు వీలుగా స్టాళ్లు ఏర్పాటుచేశారు. ప్రధాన ప్లీనరీ హాల్‌తోపాటు పారిశ్రామికవేత్తలు చర్చలు జరిపేందుకు వీలుగా వివిధ సమావేశ ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. దిగ్గజ కంపెనీల చైర్మన్లు, సీఈవోలు సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమై చర్చలు జరిపేందుకు ప్రత్యేక హాల్‌ను సిద్ధం చేశారు. బిజినెస్ టూ బిజినెస్, గవర్నమెంట్ టూ బిజినెస్ చర్చల కోసం సభా ప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయి. భాగస్వామ్యాలు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వేదికలు సిద్ధమయ్యాయి.
ప్రాంగణం..సర్వాంగ సుందరం
సీఐఐ భాగస్వామ్య సదస్సు జరిగే ప్రధాన ప్రాంగణాన్ని కడియం నర్సరీతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మొక్కలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విభిన్న ఆకృతులు, కళాత్మక చిత్రాలతో ప్రాంగణం ప్రత్యేకశోభను సంతరించుకుంది. వేదిక బయట రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, అమరావతి, తదితర ప్రాంతాలకు చెందిన వివరాలతో కూడిన పోస్టర్లు ప్రదర్శించారు. సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.