ఎమ్మెల్యే పల్లా చొరవతో విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:54 AM
ఉక్కునగరంలో ఆర్థిక ఇబ్బందులతో గత ఏడాది మూతపడిన విశాఖ విమల విద్యాలయాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది.
నాడు ఏడాదికి రూ.12వేలు ఫీజు...ఇప్పుడు పూర్తిగా ఉచితం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉక్కునగరంలో ఆర్థిక ఇబ్బందులతో గత ఏడాది మూతపడిన విశాఖ విమల విద్యాలయాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. ఎటువంటి ఫీజులు లేకుండా ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించింది. శుక్రవారం పాఠశాలను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు.
విశాఖ విమల విద్యాలయం 1984 నుంచి స్టీల్ ప్లాంటు ఆర్థిక సహాయంతో నడుస్తోంది. యాజమాన్యమే భవనాలు నిర్మించింది. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇచ్చేది. నిర్వహణ బాధ్యతలను క్ట్రిస్టియన్ సంస్థ డయాసిస్‌కు అప్పగించింది. అయితే స్టీల్ ప్లాంటు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో జీతాలు ఇవ్వలేమని, సొంతంగా నిధులు సమకూర్చుకోవాలని మూడేళ్ల క్రితం ‘డయాసిస్’కు చెప్పింది. అప్పుడే సాయం కొనసాగించాలని పల్లా శ్రీనివాసరావు కోరితే అయిష్టంగానే అంగీకరించింది. ఇలా రెండేళ్లు నడిచాక గత ఏడాది ఇక తమ వల్ల కాదని యాజమాన్యం చేతులెత్తేసింది. ఫీజులు వసూలు చేసి నడపాలని సూచించింది. అప్పటికే ఇతర నిర్వహణ నిధుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.12 వేలు చొప్పున వసూలు చేసేవారు. ఆ నిధులు జీతాలకు సరిపోవని నిర్ధారణకు వచ్చి గత ఏడాది మే నెలలో విద్యాలయం మూసేశారు. అందులో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఆందోళనలు చేసినా ఫలితం కనిపించలేదు. దాంతో వారంతా టీసీలు తీసుకొని వేరే పాఠశాలల్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పట్టుబట్టి, విద్యా శాఖా మంత్రి లోకేశ్‌కు చెప్పి ప్రభుత్వమే ఆ పాఠశాలను నడిపేలా ఆదేశాలు ఇప్పించారు. కలెక్టర్ కూడా స్టీల్ యాజమాన్యంతో మాట్లాడారు. అనేక సంప్రతింపులు జరిపిన మీదట గతంలో పనిచేసిన 24 మంది ఉపాధ్యాయులు, నలుగురు బోధనేతర సిబ్బందితో శుక్రవారం పాఠశాల ప్రారంభించారు. ఉపాధ్యాయులు పాత పిల్లలు సుమారుగా 550 మందిని తీసుకువచ్చి చేర్పించారు. గతంలో వారు ఏడాదికి రూ.12వేలు కట్టేవారు. ఇప్పుడు ఫీజులు లేకుండా ఉచిత విద్య అందిస్తామని చెప్పడంతో వారి తల్లిదండ్రులు సంతోషించారు. త్వరలో మద్యాహ్న భోజనం కూడా అందిస్తామని అధికారులు ప్రకటించారు.
వారంతా పేదలే అందుకే
పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే
విశాఖ విమల విద్యాలయంలో చదువుకుంటున్న వారంతా పేదల పిల్లలు, నిర్వాసిత కుటుంబాలు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలే. వారి ఆర్థిక స్థోమత తక్కువ. ఈ పాఠశాల మూసేయడం వల్ల కొంతమంది చదువుకు కూడా దూరమయ్యారు. వారందరినీ మళ్లీ స్కూలులో చేర్పిస్తున్నాం. ఈ ప్రాంత నాయకుడిగా మూతపడిన విద్యాలయాన్ని తెరిపించాను. దీనికి మంత్రి లోకేశ్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సహకరించారు.