Share News

24 నుంచి విశాఖ ఉత్సవ్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:34 AM

చాలాకాలం తరువాత విశాఖ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని, వాటిని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోల శ్రీబాలవీరాంజనేయస్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత కోరారు.

24 నుంచి విశాఖ ఉత్సవ్‌

ఫిబ్రవరి 1 వరకూ అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోనూ ఏకకాలంలో నిర్వహణ

విశాఖపట్నం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):

చాలాకాలం తరువాత విశాఖ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని, వాటిని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోల శ్రీబాలవీరాంజనేయస్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత కోరారు. విశాఖపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం డీఆర్‌సీ ముగిసిన తరువాత మంత్రి బాల వీరాంజనేయ స్వామి విశాఖ ఉత్సవాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి అనిత ఆన్‌లైన్‌లో పాల్గొని పలు సూచనలు చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వారం రోజులు ఈ ఉత్సవాలు ఉంటాయన్నారు. 24, 25 తేదీల్లో అనకాపల్లి జిల్లాలో, 26 నుంచి 31వ తేదీ వరకు విశాఖ, అల్లూరి జిల్లాల్లో ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం...అరకులోయలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి బాలవీరాంజనేయస్వామి చెప్పారు. మూడు జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమన్వయంలో పనిచేసి, విజయవంతం చేయాలన్నారు. విశాఖపట్నంలో ఎనిమిది ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. భీమిలి, రుషికొండ, సాగర్‌నగర్‌, ఆర్‌కే బీచ్‌, ఇంకా మరికొన్ని ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఫుడ్‌ స్టాళ్లు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ శ్రీభరత్‌ సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.


ప్రవేశాలపై విద్యా శాఖ దృష్టి

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు పెంపునకు ఆరు నెలల ముందే ప్రణాళిక

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, ఐదో తరగతి విద్యార్థులే లక్ష్యం

తల్లిదండ్రులను కలవాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచన

విశాఖపట్నం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):

ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ఉన్నా, ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య పడిపోతూ వస్తోంది. స్థోమత ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ ముందుగానే అప్రమత్తమైంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో ఆరు నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే పాఠశాలల్లో పిల్లలు చేరేలా తమ పరిధిలో ఉన్న గ్రామాలు/వార్డుల్లో పర్యటించి తల్లిదండ్రులను కలుసుకుని వారితో మాట్లాడాలని ప్రాథమిక/యూపీ/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించింది. పాఠశాలల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలు, ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కలవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పథకాలు అమలు జరుగుతున్న తీరు, మౌలిక వసతుల గురించి వివరించాలి. విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందించడంతోపాటు పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూస్‌ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, టీచర్లంతా ప్రతిభావంతులని చెప్పి, పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చూడాలి.

విశాఖ జిల్లాలో 560 ప్రభుత్వ ప్రాథమిక/యూపీ/ఉన్నత పాఠశాలల్లో 72,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 కంటే తక్కువగా ఉంది. ప్రధానంగా శివారు ప్రాంతాలు, గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఏటేటా తగ్గుతున్నారు. వచ్చే ఏడాది కొన్ని ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ ముందుగానే అప్రమత్తమై విద్యార్థుల చేరిక పెరిగేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలు చేరికలు పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు.


అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు

ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులకు

ఉప రవాణా కమిషనర్‌ హెచ్చరిక

మాధవధార, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి సమయంలో ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం ఉప రవాణా కమిషనర్‌ (డీటీసీ) ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాధవధార ఉప రవాణా శాఖ కార్యాలయంలో కాంట్రాక్టు క్యారేజ్‌ బస్సుల యజమానులు, ఆపరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బస్సుల నిర్వాహకులకు డీటీసీముఖ్య సూచనలు చేశారు. బస్సులు రద్దు చేయడం వంటి చర్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. దూర ప్రాంత ప్రయాణాల్లో ఇద్దరు అనుభవజ్ఞులైన డ్రైవర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్‌ లైన్‌ నంబరు 92816 07001 బస్సుల్లో ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు.

Updated Date - Jan 10 , 2026 | 01:35 AM