విశాఖ ఉత్సవ్‌కు నేడు శ్రీకారం
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:04 AM
విశాఖ ఉత్సవ్‌కు పర్యాటక శాఖ మంగళవారం శ్రీకారం చుడుతోంది.
24 నుంచి ఒకటో తేదీ వరకూ కార్యక్రమాలు
విశాఖ, అనకాపల్లి, అరకులోయల్లో ఏకకాలంలో నిర్వహణ
నగరంలోని ఐదు బీచ్‌లలో రోజూ సంబరాలు
నేడు సమీక్ష
విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్‌కు పర్యాటక శాఖ మంగళవారం శ్రీకారం చుడుతోంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకూ విశాఖతో పాటు అనకాపల్లి, అరకులోయల్లో కూడా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏరోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి, ముఖ్య అతిథులు, ప్రజలు, స్థానిక కళాకారుల భాగస్వామ్యం...తదితర అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించి, ఖరారు చేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జ్యోతి వెలిగించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. శాస్త్రీయ నృత్యం, అరకు ధింసా నృత్యం, అనకాపల్లి జానపద కళలు ప్రదర్శిస్తారు.
విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్కే బీచ్‌తో పాటు సాగర్‌నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్‌ల్లో 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థానిక కళాకారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇస్తారు. ప్రధాన వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాలకు ప్రముఖ యాంకర్లను తీసుకువస్తున్నారు. సుమ, శ్రీముఖి, స్రవంతి, మంజూష వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ప్రతిరోజు సంగీత విభావరి కోసం సినీ గాయకులు, సంగీత దర్శకులను తీసుకువస్తున్నారు. గీతామాధురి, సునీత, థమన్, మణిశర్మల పేర్లు జాబితాలో ఉన్నాయి. శ్రేయాస్ మీడియాకు ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ప్రతిరోజు డ్రోన్ షో ఉండేలా ఏర్పాట్లుచేశారు. భారీగా ఖర్చయ్యే ఈ ఉత్సవాలకు నిధులు లేవని అధికారులు వెల్లడించడంతో, ఆ పేరుతో నగరంలోని ప్రముఖుల నుంచి చందాలు వసూలు చేయడం భావ్యంగా ఉండదని, చెడ్డ పేరు తేవద్దని కీలక నేతలు సూచన చేశారు. దాంతో అధికారులే ప్రభుత్వంతో సంప్రతింపులు జరపడంతో అడ్వాన్స్‌గా కొంత మొత్తం ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిసింది. వీఎంఆర్‌డీఏ ఫ్లవర్ షో ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చింది. అదేవిధంగా నగరంలో శాశ్వతంగా ఉండేలా పలు ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు పెట్టనున్నారు. రుషికొండ బీచ్‌లో అడ్వంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. పిల్లల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చెలరేగిన దొంగలు
గాజువాక ఎల్‌వీనగర్‌లో వరుస చోరీలు
తాళాలు పగలగొట్టి ఐదిళ్లలోకి ప్రవేశం
సుమారు 14.5 తులాల బంగారు, 100 తులాల వెండి ఆభరణాల అపహరణ
ఆధారాలు సేకరించిన క్లూస్ టీం
గాజువాక, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి, సొంతూళ్లకు వెళ్లడాన్ని అదనుగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. గాజువాక ఎల్‌వీ నగర్‌లోని ఐదిళ్లలో చొరబడి సుమారు 14.5 తులాల బంగారు, వంద తులాల వెండి ఆభరణాలను తస్కరించారు. వివరాలిలా ఉన్నాయి. ఎల్‌వీ నగర్ ప్రాంతానికి చెందిన రంబా శివ, శంకర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 14వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లకు వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన తలుపు తాళం విరగ్గొట్టి ఉంది. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో ఉంచిన తొమ్మిది తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఇళ్ల పక్కనే ఉన్న పోలయ్య, కృష్ణారావు, మరొకరి ఇంటి తాళాలు కూడా విరగ్గొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా, బీరువాలు తెరిచి, అందులోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించారు. ఆయా ఇళ్లలో సుమారు నాలుగున్నర తులాల బంగారు, 70 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు భావిస్తున్నారు. అయితే మూడు కుటుంబాల వారు తిరిగి వచ్చిన తరువాతే ఏ మేరకు చోరీ జరిగిందనేది స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్ధలాన్ని ఎస్‌ఐ హరికృష్ణ, క్లూస్ టీం పరిశీలించారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు.
మందుబాబుల మజా
పండుగ పేరుతో తెగ తాగారు
వారంలో రూ.61.5 కోట్ల మద్యం విక్రయం
సాధారణ రోజులతో పోల్చితే రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకూ అదనపు అమ్మకం
వ్యాపారులు ఖుషీ
విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది మద్యం విక్రయాలు భారీఎత్తున సాగాయి. ఈ నెల 11వ తేదీ (ఆదివారం) నుంచి సెలవులు ప్రారంభం కావడంతో ఆరోజు నుంచే మద్యం విక్రయాలు పెరుగుతూ వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు
విశాఖ జిల్లా పరిధిలో 159 షాపులు, 75 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవికాకుండా 16 స్టార్ హోటళ్లలో బార్‌లు ఉన్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐదు బార్లు ఉన్నాయి. వాల్తేరు క్లబ్, సెంచురీ క్లబ్ వంటి ఏడు క్లబ్బుల్లోను మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. ఇవికాకుండా రెండు ప్రీమియం మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటికీ మద్యం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన డిపో ద్వారా సరఫరా చేస్తారు. జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు, బార్‌లు, ప్రీమియం స్టోర్‌లన్నింటి ద్వారా సాధారణ రోజుల్లో రూ.ఐదు నుంచి ఆరు కోట్ల విలువైన మద్యం, బీర్లు విక్రయాలు జరుగుతుంటాయి. కానీ సంక్రాంతి నేపథ్యంలో ఈనెల 11 నుంచి మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఈనెల 11న రూ.6.5 కోట్లు విలువైన మద్యం, బీర్‌లు అమ్ముడవ్వగా, 12, 13 తేదీల్లో రూ. 6 కోట్లు చొప్పున, 14న రూ.8 కోట్లు, 15న రూ.10 కోట్లు, 16న రూ.9 కోట్లు, 17న రూ.7 కోట్లు, 18న ఆదివారం కావడంతో రూ.9 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఎనిమిది రోజుల్లో సాధారణ రోజుల్లో సగటును పరిగణనలోకి తీసుకుంటే రూ.40 కోట్లు నుంచి రూ.45 కోట్లు విలువైన విక్రయాలు జరగాలి. కానీ పండుగ కారణంగా ఎనిమిది రోజుల్లో రూ.61.5 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సంక్రాంతితో ఎనిమిది రోజుల్లో అదనంగా సుమారు రూ.16.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ అదనపు విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.