Share News

రేపటి నుంచే విశాఖ ఉత్సవ్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:37 AM

అట్టహాసంగా తొమ్మిది రోజులు నిర్వహించ తలపెట్టిన విశాఖ ఉత్సవ్‌పై అధికార యంత్రాంగం అదే నిర్లిప్తతను కొనసాగిస్తోంది.

రేపటి నుంచే విశాఖ ఉత్సవ్‌

ఇంకా ప్రారంభం కాని ప్రచారం

ఏ కార్యక్రమానికి ఎవరు వస్తారో ఇప్పటివరకూ ఖరారు కాని వైనం

అధికారులను అడిగితే ఆన్‌లైన్‌లో చూడాల్సిందిగా సమాధానం

విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):

అట్టహాసంగా తొమ్మిది రోజులు నిర్వహించ తలపెట్టిన విశాఖ ఉత్సవ్‌పై అధికార యంత్రాంగం అదే నిర్లిప్తతను కొనసాగిస్తోంది. ఉత్సవ్‌కు సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా వెబ్‌సైట్‌ చూసుకోవాలని సలహా ఇస్తోంది. సోషల్‌ మీడియాలో రీల్స్‌ తప్పితే ఇతరత్రా ప్రచారం ఏమీ లేదు. వచ్చే నెలలో జరిగే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌ కార్యక్రమాలకు తూర్పు నౌకాదళం అధికారులు ఇప్పటినుంచే ఎక్కడికక్కడ హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. వారు ఫిబ్రవరి 19న నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పెరేడ్‌కు మూడు లక్షల మంది విశాఖ ప్రజలు వస్తారని అంచనా. అందుకు తగిన విధంగా ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. విశాఖ ఉత్సవ్‌కు పది లక్షల మంది వస్తారని పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి వెల్లడించారు. వారి కోసం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదీ ఆఫ్‌లైన్‌ ప్రచారం ఇప్పటివరకూ చేపట్టలేదు. కనీసం మీడియాకు కూడా వివరాలు చెప్పలేదు. సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు తప్పితే ఇతరత్రా సమాచారం ఏమీ లేదు. ఉత్సవాల ప్రారంభానికి ఇంకా 24 గంటలే సమయం (ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం) ఉంది. ఈ ఈవెంట్‌ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్‌ మీడియాకు అప్పగించారు. పర్యాటక శాఖ అధికారుల పాత్ర నామమాత్రంగా మారింది. గురువారం వరకూ ఏ కార్యక్రమానికి ఎవరు వస్తారనేది ఖరారు కాలేదు. ఈవెంట్‌ నిర్వాహకులను గట్టిగా అడిగే అవకాశం లేదు. అంతా విజయవాడ అధికారులే చూసుకుంటున్నారని, తమకు ఏమీ తెలియదనే చెబుతున్నారు.సాయంత్రం కాగానే బీచ్‌లో విద్యుద్దీప కాంతులతో ఫుడ్‌ స్టాళ్లు, సినీ గాయకులతో పాటలు పాడిస్తే ఉత్సవాలు విజయవంతమైపోతాయని నిర్వాహకులు గట్టిగా విశ్వసిస్తున్నట్టున్నారు. స్థానిక కళాకారులతో కార్యక్రమాలు అని ప్రకటించినా, వారు ఎవరు?...ఏ కళలు ప్రదర్శిస్తారో పెదవి విప్పడం లేదు. ఈ విషయంలో జిల్లా అధికారులు కూడా ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం.

Updated Date - Jan 23 , 2026 | 12:37 AM