నంబర్‌వన్‌గా విశాఖ ఉక్కు
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:06 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అధికారులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి హెచ్.డి.కుమారస్వామి దిశా నిర్దేశం చేశారు.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి హెచ్.డి.కుమారస్వామి ఆకాంక్ష
అధికారులకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం
ముడి పదార్థాల సమీకరణలో అప్రమత్తంగా ఉండాలని సూచన
ప్లాంటును ట్రాక్‌పైకి తీసుకువచ్చినందుకు ఉద్యోగులు, కార్మికులకు అభినందన
విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అధికారులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి హెచ్.డి.కుమారస్వామి దిశా నిర్దేశం చేశారు. అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంటు భూమి పూజలో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన ఆయన సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి సోమవారం ఉదయం ఇక్కడి స్టీల్‌ప్లాంటును సందర్శించారు. ప్లాంటులో అత్యంత కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్-3, కోక్ ఓవెన్ బ్యాటరీలను పరిశీలించారు. దారిలో తారసపడిన ఉద్యోగులతో మాట్లాడారు. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. స్టీల్ అధికారుల సంఘం నాయకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంటు సీఎండీ మనీషారాజ్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ప్లాంటులో సమస్యలను ప్రస్తావించి, వాటిపై ఏ విధంగా ముందుకువెళ్లాలో సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తున్నారని, వారిని ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఉండాలన్నారు. అందరిని కలుపుకొని వెళ్లాలని, ముడి పదార్థాల సమీకరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ, కేంద్రం ఆర్థిక సాయం చేసినందుకు ప్లాంటును అత్యధిక ఉత్పత్తితో నడుపుతూ ప్లాంటును ట్రాక్‌పైకి తీసుకువచ్చినందుకు అభినందించారు. ఇదే కృషిని కొనసాగించాలని, తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. సమష్టిగా పనిచేసి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును నంబర్‌వన్ స్థానంలో నిలపాలన్నారు.