Share News

వణికిస్తున్న వైరల్‌ జ్వరాలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:45 AM

వాతావరణ మార్పులతో జిల్లాలో వైరల్‌ జ్వరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా విభాగాలు జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి.

వణికిస్తున్న వైరల్‌ జ్వరాలు
అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో ఓపీ వద్ద బారులు తీరిన రోగులు

వాతావరణ మార్పులతో పెరుగుతున్న బాధితులు

గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ జ్వరాలతోపాటు మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు

ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు

పరిస్థితి తీవ్రంగా ఉంటే.. వార్డులో చేర్చి చికిత్స

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

వాతావరణ మార్పులతో జిల్లాలో వైరల్‌ జ్వరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా విభాగాలు జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తుండడంతో బాధితులు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ గణాంఖాల ప్రకారం జిల్లాలో 46 పీహెచ్‌సీలు, తొమ్మిది యూపీహెచ్‌సీలు, 424 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో గత ఏడాది జనవరి నుంచి జూన్‌ నెలాఖరు వరకు మొత్తం 1,36,765 రక్తనమూనాల పరీక్షించగా, 175 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 1,69,952 రక్త నమూనాలు పరీక్షించగా 117 మలేరియా కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ అనుమానిత కేసులు గత ఏడాది 43 నమోదుకాగా, ఈ ఏడాది 33 నమోదయ్యాయి. అయితే ఇవి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య, రక్త పరీక్షలు చేయించుకున్న కేసులుకాగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన మలేరియా, డెంగ్యూ కేసులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోవడంలేదు. జూన్‌ నెలలో అత్యధిక రోజులు వేడి వాతావరణం కొనసాగింది. కొన్నిసార్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయడం, తరువాత వాతావరణ అనిశ్చితితో ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో వర్షం కురవడం జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర వేడి వాతావరణం.. ఆ వెంటనే వర్షంతో చల్లని వాతావరణం ఏర్పడడంతో ప్రజలు వైరల్‌ జ్వరాలబారిన పడుతున్నారు. చలిజ్వరంతో పాటు మూడు నుంచి ఏడు రోజుల వరకు తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, విపరీతమైన అలసట, గొంతు నొప్పి, దగ్గు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఏజెన్సీని ఆనుకొని వున్న నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లోని శివారు గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు అధికంగా వున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందుతున్నది. దీంతో వైద్య సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్లి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఎక్కువ రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు..

గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటలు దాటితే వైద్యులు, సిబ్బంది అందుబాటులో వుండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సాయంత్రం తరువాత జ్వరం బారిన పడిన వారు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళుతున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు వైద్యులు రక్త పరీక్షలు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షల పేరుతో డబ్బులు గుంజుతున్నారు.

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో పెరిగిన ఓపీ

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రికి గత కొద్ది రోజుల నుంచి రోగుల తాకిడి పెరిగింది. వారం క్రితం వరకు రోజూ 500- 600 మంది ఓపీకి వచ్చేవారు. తరువాత క్రమంగా పెరుగుతూ.. 1,100 దాటింది. ఓపీకి వచ్చే వారిలో దాదాపు మూడో వంతు మంది జ్వరపీడితులు వుంటున్నారు. వీరిలో 40 నుంచి 50 మంది వరకు వార్డులో చేరుతున్నారు పెరుగుతున్న జ్వర బాధితులపై ఎన్టీఆర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికుమార్‌ను వివరణ కోరగా... పీహెచ్‌సీలకు వెళ్లిన రోగుల్లో పరిస్థితి తీవ్రంగా వున్న వారిని ఎన్టీఆర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారని చెప్పారు. తీవ్ర జర్వం ఉంటే వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎక్కువ మందిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడాన్ని గుర్తించి అవసరం మేరకు ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Jul 03 , 2026 | 12:45 AM