నిబంధనలకు తూట్లు
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:52 AM
జిల్లాలో నిరభ్యంతర పత్రాలు లేకుండా పలు బాణసంచా కేంద్రాలు నడుస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, పంచాయతీ శాఖల నిర్లక్ష్యంతో ఆయా కేంద్రాల్లో బాణసంచా తయారు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారకులు రెవెన్యూ అధికారులని చెప్పక తప్పదు. ఎక్కడైనా బాణసంచా కేంద్రంలో ప్రమాదం సంభవిస్తే.. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ఒకటి, రెండు రోజులు హడావిడి చేసి, తరువాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. శనివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదంలో ఇరవై మందికిపైగా చనిపోయారు. దీంతో జిల్లాలోని కొన్ని బాణసంచా తయారీ కేంద్రాల్లో ఆదివారం అధికారులు ఎప్పటి మాదిరిగానే మొక్కుబడిగా తనిఖీలు చేపట్టారు.
ఇష్టారాజ్యంగా బాణసంచా తయారీ
జిల్లాలో అనుమతులు ఉన్న కేంద్రాలు 11
వీటిల్లో 8 కేంద్రాలకు ఎన్‌ఓసీలో జారీ చేయని అగ్నిమాపక శాఖ
అయినాసరే మందుగుండు సామగ్రి ఉత్పత్తి
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
గత ప్రమాదాల నుంచి నేర్వని గుణపాఠం
నర్సీపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిరభ్యంతర పత్రాలు లేకుండా పలు బాణసంచా కేంద్రాలు నడుస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, పంచాయతీ శాఖల నిర్లక్ష్యంతో ఆయా కేంద్రాల్లో బాణసంచా తయారు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారకులు రెవెన్యూ అధికారులని చెప్పక తప్పదు. ఎక్కడైనా బాణసంచా కేంద్రంలో ప్రమాదం సంభవిస్తే.. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ఒకటి, రెండు రోజులు హడావిడి చేసి, తరువాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. శనివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదంలో ఇరవై మందికిపైగా చనిపోయారు. దీంతో జిల్లాలోని కొన్ని బాణసంచా తయారీ కేంద్రాల్లో ఆదివారం అధికారులు ఎప్పటి మాదిరిగానే మొక్కుబడిగా తనిఖీలు చేపట్టారు.
జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి, సబ్బవరం అగ్నిమాపక కేంద్రాల పరిధిలో లైసెన్సు వున్న బాణసంచా తయారీ కేంద్రాలు 11 ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో ఎనిమిది కేంద్రాలు అగ్నిమాపక శాఖ అధికారులు జారీ చేసే ఎన్‌ఓసీలు లేకుండానే నడుస్తున్నాయి. సబ్బవరం మండలంలో ఒక కేంద్రం న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకొని నడుపుతున్నారు. కాగా బాణసంచా తయారీ కేంద్రాలను అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేసి, ఆయా కేంద్రాల్లో ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని, నిబంధనల ప్రకారం ఫైర్ ఎక్విప్‌మెంట్ లేదని నివేదికలు ఇచ్చినప్పటికీ.. ఆయా కేంద్రాల మూసివేతకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం పరిధిలో 3, ఎలమంచలి పరిధిలో 2, అనకాపల్లిపరిధిలో 4, సబ్బవరం పరిధిలో 2 బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా 15 కిలోల బాణసంచా తయారీ సామర్థ్యంతో మాత్రమే అనుమతులు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఇందుకు పదిరెట్ల పైబడి ముడిసరకుతో బాణసంచా తయారు చేస్తున్నారు.
బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే తొలుత సంబంధిత ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని పోలీసు, అగ్నిమాపక శాఖ, మండల రెవెన్యూ, సంబంధిత గ్రామ పంచాయతీ లేదా పురపాలక సంఘం అధికారులకు పంపుతారు. వీటిని తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాలని ఆర్డీవో ఆదేశాలు జారీ చేస్తారు. బాణసంచా తయారీ కేంద్రా ఏర్పాటు చేసే ప్రదేశం మెయిన్ రోడ్డుకు రెండు కిలోమీటర్లు పైబడిన దూరంలో ఉండాలి. బాణసంచా తయారీకి వినియోగించే ముడిపదార్థాలు నిల్వ చేయడానికి, కార్మికులు పని చేయడానికి, ఉత్పత్తి చేసిన బాణసంచాను భద్రపరచడానికి ప్రత్యేకంగా షెడ్లు వుండాలి. బాణసంచాను ఎండబెట్టడానికి డ్రై ఏరియా తప్పనిసరిగా ఉండాలి. సంబంధిత శాఖల అధికారులు నివేదికలు ఇచ్చిన తరువాత ఆర్డీవో అనుమతులు ఇస్తారు. అంతేకాక మూడు నెలలకు ఒకసారి అగ్నిమాపక అధికారి తనిఖీ చేసి ఎన్‌ఓసీ ఇస్తారు. ఒకవేళ నిబంధనలు ప్రకారం బాణసంచా తయారీ కేంద్రం నడవడం లేదని భావిస్తే.. దీనిపై ఆర్డీవోకి నివేదిస్తారు. బాణసంచా తయారీ చేసే ఒకేచోట నలుగురుకి మించి పనిచేయకూడదు. బాణసంచా తయారీలో అనుభవం, నైపుణ్యత ఉండాలి. కానీ అత్యధిక కేంద్రాల్లో సాధారణ కూలీలతోనే బాణసంచా తయారు చేయిస్తుంటారు. ఇంకా 20 నుంచి 30 మంది దగ్గర దగ్గరగా కూర్చొని పనులు చేస్తుంటారు. పొరపాటున ప్రమాదం జరిగితే.. కార్మికులంతా బలయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది.
జిల్లాలో 2019 తరువాత మూడుచోట్ల బాణసంచా తయారీ కేంద్రాల్లో భారీ ప్రమాదాలు సంభవించాయి. సబ్బవరంలో రెండు, కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఒకటి చొప్పున మూడు భారీ ప్రమాదాలు జరిగి 17 మంది మృత్యువాత పడ్డారు.
2019 మార్చి 25వ తేదీన సబ్బవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఐదుగురు చనిపోయారు. 2023 సెప్టెబంరు 9న సబ్బవరంలోనే మరో కేంద్రంలో జరిగిన పేలుడులో నలుగురు మృత్యువాతపడ్డారు. గత ఏడాది ఏప్రిల్ 13న కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఏకంగా 10 మంది మరణించారు.