Share News

నిబంధనలకు తూట్లు... రోడ్లేస్తే కోట్లు!

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:35 PM

మన్యంలో రోడ్లు గిరిజన పల్లెలకు రవాణా సదుపాయాన్ని కల్పించడం కంటే వాటిని నిర్మించే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

నిబంధనలకు తూట్లు... రోడ్లేస్తే కోట్లు!
రెండేళ్లకే అధ్వానంగా మారిన ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలో వలజంగి రోడ్డు

రహదారుల నిర్మాణంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు

నాణ్యత, పర్యవేక్షణ గాలికొదిలేసి కాసుల వేట

విశ్రాంత పంచాయతీరాజ్‌ ఎస్‌ఈపై ఏసీబీ దాడులతో వెలుగులోకి అనేక విషయాలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో రోడ్లు గిరిజన పల్లెలకు రవాణా సదుపాయాన్ని కల్పించడం కంటే వాటిని నిర్మించే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

మైదాన ప్రాంతంతో పోలిస్తే గిరిజన ప్రాంతంలో రోడ్డు సదుపాయాలు లేని పల్లెలు అధికంగా ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆయా ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో ప్రతి ఏడాది రూ.150 కోట్లు నుంచి రూ.300 కోట్లు వరకు రోడ్లు నిర్మాణానికి వ్యయం చేస్తున్నారు. వాటిలో కేంద్ర ప్రభుత్వం ద్వారానే అధికంగా 80 శాతం నిధులు విడుదలవుతాయి. వాటిలో ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తారు. అయితే ఆయా రోడ్ల నిర్మాణ పనులను ఇంజనీర్లు పర్యవేక్షించకపోవడం, కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడం అత్యంత సహజమైనదిగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖలో భావిస్తారు. అలాగే ఒక్కో రోడ్డు కనిష్ఠంగా రూ.1.5 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.6 కోట్లు వరకు ఉంటుంది. దీంతో ఇదే అదునుగా ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సగం నిధులతోనే రోడ్లను తూతూమంత్రంగా నిర్మించి, అవకాశం ఉన్న మేరకు మిగిలిన నిధుల్ని పంచేసుకుంటారనేది ఇంజనీరింగ్‌ శాఖలో నానుడి. అలాగే ఆయా రోడ్లకు సంబంధించిన గ్రావెల్‌, మెటల్‌ వంటి సామగ్రిని సైతం రోడ్డు వద్దే సమకూర్చుకుని, వాటిని దూర ప్రాంతం నుంచి కొనుగోలు చేసి రవాణా చేస్తున్నట్టు నకిలీ బిల్లులు సృష్టించడం వల్లే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు అధిక మొత్తం సొమ్ము మిగులుతాయని పలువురు అంటున్నారు. రాష్ట్రంలోని కడప, కర్నూలు, గుంటూరు, నంద్యాల, తదితర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు మన్యంలోనే ఏళ్ల తరబడి మకాం వేయడం వెనుక కారణమిదేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాగే మారుమూల ప్రాంతాల్లో నిర్మించే రోడ్ల నాణ్యతలు, నిబంధనలు పాటించనప్పటికీ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు అంతా బాగుందని ధ్రువీకరించడం విశేషం. అయితే వాళ్లు అదే ప్రభుత్వ శాఖకు చెందిన ఇంజనీర్లు కావడంతో అంతా కుమ్మక్కై రోడ్లు నిర్మాణాల్లో నిబంధనలకు తూట్లు పొడిచి వాళ్లు రూ.కోట్లు గడిస్తున్నారే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే రోడ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలనే ప్రభుత్వ ఒత్తిడిని అవకాశంగా తీసుకుని మొక్కుబడిగా రోడ్డును నిర్మించి తమ పనైపోయిందనే ధోరణిని కొనసాగిస్తూ అందినకాడికి పంచుకోవడం పరిపాటిగా మారింది.

నాడు గిరిజన సంక్షేమ శాఖ... నేడు పంచాయతీరాజ్‌ శాఖ

కేవలం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఇన్‌చార్జి ఈఎస్‌సీ ఎస్‌.శ్రీనివాసరావు గత ఏడాది ఏసీబీకి చిక్కగా, నేడు పంచాయతీరాజ్‌ శాఖలోని సూపరింటెండెంట్‌గా పదవీవిరమణ చేసిన కె.శ్రీనివాసరావు ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించడం విశేషం. అలాగే ఏసీబీ నోటీసులో ఉన్న ఈ ఇద్దరు అధికారులు గిరిజన ప్రాంతంలోని రోడ్ల నిర్మాణాలతోనే కోట్లకు పడగలెత్తారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ చతురతతో వారిని ప్రసన్నం చేసుకుని తమదైన శైలిలో గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణాల్లో వీరిద్దరూ పోటాపోటీగా రూ.కోట్లు గడించారనే ఆరోపణలున్నాయి. అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన వీరిద్దరిదీ ఉమ్మడి విజయనగరం జిల్లా కావడం కొసమెరుపు.

Updated Date - Feb 05 , 2026 | 11:35 PM