Share News

పట్నంలో పల్లె రాజకీయం

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:07 AM

పంచాయతీ ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలైంది.

పట్నంలో పల్లె రాజకీయం

  • పంచాయతీ ఓటర్లకు వల

  • నగరానికి సర్పంచ్‌ అభ్యర్థులు, నాయకులు

  • తాయిలాలు, ఓటుకు వెయ్యి నుంచి రెండు వేలు పంపిణీ

  • పోలింగ్‌ రోజు వాహనం, భోజన సదుపాయం కల్పిస్తామని హామీ

విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) :

పంచాయతీ ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలైంది. సర్పంచులుగా బరిలో ఉన్నవారంతా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకోవడంపై దృష్టిసారించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అనేక గ్రామాలకు చెందినవారు విశాఖ నగరంలో నివాసం ఉంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు , ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారితో అభ్యర్థులు, వారి తరపున నాయకులు మంతనాలు జరుపుతున్నారు. సదరు ఓటర్లకు తాయిలాలు ఇవ్వడంతోపాటు నగదు పంపిణీ చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు చెందిన నాయకులు బిందెలు, నెలకు సరిపడా బియ్యం, ఆయిల్‌ టిన్నులు ఇవ్వడంతోపాటు ఓటు కోసం వెళ్లి,వచ్చేందుకు వాహనం ఏర్పాటుచేస్తున్నారు. ఇంకా పోలింగ్‌ రోజు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం స్నాక్స్‌ వంటివి కూడా వాహనంలో ఏర్పాటుచేసేలా నాయకుల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు నగరం నుంచి ఓటర్లను తీసుకువచ్చే బాధ్యతను ఇద్దరు, ముగ్గురు ముఖ్య నాయకులకు అప్పగిస్తున్నారు. కొన్ని గ్రామాలకు చెందిన నాయకులు ఓటుకు వేయి నుంచి రెండు వేల రూపాయల వరకు ఇస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో ఎక్కువ

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలతో పాటు కొందరు తాపీ పనులు, రోజువారీ కూలీ పనులు, అపార్టుమెంట్లలో వాచ్‌మన్లుగా, ఫార్మా కంపెనీల్లో, ఇతర పరిశ్రమలు, బట్టలు దుకాణాలు, జ్యువెలరీ షోరూమ్‌లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద పంచాయతీలకు చెందినవారైతే సుమారు 50 నుంచి 200 మంది వరకు ఓటర్లు నగరంలో ఉంటున్నారు. వారి వివరాలను సేకరించిన నాయకులు గడిచిన వారం రోజులుగా నగరానికి వచ్చి వారితో మంతనాలు జరుపుతున్నారు. వారి అవసరాలు తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేయడంతోపాటు గ్రామంలో తాము చేయబోయే కార్యక్రమాలు, ఇప్పటికే చేసిన పనులు గురించి తెలియజేస్తున్నారు. కొన్ని గ్రామాలకు చెందిన నాయకులు యువత, మధ్య వయస్కులకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. రెస్టారెంట్లు, బార్లుకు తీసుకువెళ్లి పార్టీ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా ఎన్‌డీఏ, గాజువాక, సింహాచలం, మద్దిలపాలెం, ఇసుకతోట, ఆరిలోవ, మధురవాడ, జగదాంబ, డాబాగార్డెన్స్‌, అక్కయ్యపాలెం, పెందుర్తి, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు.

ప్రత్యేక సమావేశాలు

గ్రామాల నుంచి వస్తున్న నేతలు తమ పంచాయతీ పరిధిలోని ఓటర్లను ఒకేచోట చేర్చి సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. స్థానికంగా ఉండే గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో, హోటల్‌లో ఈ సమావేశాలు, విందులు జరుగుతున్నాయి. కొందరు నేతలు అయితే స్థానికంగా వివిధ సంఘాలు, కుల సంఘాలకు చెందిన నేతలను కూడా తీసుకువెళ్లి నగరంలోనూ వీరి ద్వారా సహాయం చేసేందుకు కృషిచేస్తామని హామీ ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ఉంటున్న ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి.

Updated Date - Nov 25 , 2026 | 01:07 AM