గ్రామ కంఠం ఆక్రమణ
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:15 AM
నాతవరం మండలం లింగంపేట పంచాయతీలో 12 సెంట్ల గ్రామ కంఠం స్థలాన్ని ఆరుగురు వ్యక్తులు దర్జాగా ఆక్రమించారు. అంతేకాక తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన పంచాయతీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్టు చేశారు.
తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్
పంచాయతీ భవనం నిర్మించే క్రమంలో బయటపడిన వ్యవహారం
పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి
ఆరుగురిపై కేసు, అరెస్టు
నర్సీపట్నం/ నాతవరం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నాతవరం మండలం లింగంపేట పంచాయతీలో 12 సెంట్ల గ్రామ కంఠం స్థలాన్ని ఆరుగురు వ్యక్తులు దర్జాగా ఆక్రమించారు. అంతేకాక తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన పంచాయతీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రేవతమ్మ వెల్లడించారు.
.నాతవరం మండలం లింగంపేట గ్రామంలో సర్వే నంబరు 46లో గ్రామ కంఠం భూమి వుంది. ఇందులో 12 సెంట్లను ఇదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా వేరొక ప్రాంతంలో ఉన్న సర్వే నంబరు, విద్యుత్ మీటరు నంబరుతో కోటవురట్ల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా గ్రామకంఠం సర్వే నంబరు 46లో పంచాయతీ భవనం నిర్మాణం కోసం చర్యలు చేపట్టారు. ఈ సమయంలో సదరు ఆక్రమణదారులు, ఈ భూమి తమదంటూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు చూపించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి సర్వే చేయించారు. జాయింట్ ఇన్‌స్పెక్టర్ రిపోర్టు, రెవెన్యూ సర్వే రిపోర్టుల ప్రకారం ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి బాపూజీ, గ్రామకంఠం ఆక్రమణదారులపై నాతవరం ఎస్‌ఐ తారకేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. తరువాత తహసీల్దార్ చందనరేఖ, ఎంపీడీవో ఎం.శ్రీనివాస్ సంయుక్తంగా గ్రామంలో విచారణ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న లోకవరపు నూకరాజు, లోకవరపు మంగ, లోకవరపు కొండబాబు, లోకవరపు నారాయణమూర్తి, పైల సీతారామ నాగజమీలు, లోవరపు వరహాలుబాబుపై పోలీసులు సోమవారం సాయంత్రం కేసు నమోదు చేశారు. మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మరికొందరిపైనా కేసు నమోదు చేస్తామని నాతవరం ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపారు.