పల్లె పండగ.. అభివృద్ధి మెండుగ..
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:10 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో సౌకర్యాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగతో గిరిజన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
గిరిజన గ్రామాల్లో ప్రగతి పరిమళాలు
సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్లు, గోకులాలు,
పంచాయతీ భవనాల నిర్మాణాలు
సుందరంగా మారిన గిరి పల్లెలు
గిరిజనుల ఆనందం హేల
పాడేరురూరల్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో సౌకర్యాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగతో గిరిజన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రహదారి మరమ్మతులకు కూడా నోచుకోని గ్రామాలు కూటమి ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, పంచాయతీ నూతన భవన నిర్మాణాలను చురుగ్గా సాగుతున్నాయి.
పల్లె పండగతో మండలానికి కోట్లాది రూపాయల నిధులు విడుదల కావడంతో వివిధ గ్రామాల్లో 120 అభివృద్ధి పనులను చేపట్టారు. మార్చి నెలాఖరుకు పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి కాగా మిగిలిన 25 శాతం పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. పల్లె పండగ నిధులు రూ.2 కోట్ల 24 లక్షలతో కించూరు, మోదాపల్లి, బడిమెల గ్రామాలలో చేపట్టిన పంచాయతీ భవనాల పనులు లింటల్ స్థాయికి చేరుకున్నాయి. కాడెలి, వనుగుపల్లి, వంట్లమామిడి, బర్సింగి గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టారు. రూ. 12 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా రూ.40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు ఇప్పటికే 80 శాతం పూర్తి కాగా మిగిలిన 20 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. వాటితో పాటు మూడు మినీ గోకులం పనులు, డ్రైనేజీలు తదితర పనులు చేపట్టడంతో గిరిజన గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మార్చి నెలాఖరుకు పనులు పూర్తి చేస్తాం
ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో వై.వెంకటరావు
పల్లె పండగలో మండలంలో 120 అభివృద్ధి పనులను చేపట్టామని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవో వై.వెంకటరావు తెలిపారు. ఇప్పటికే శతశాతం బీటీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు పూర్తి కాగా 80 శాతం వరకు సీసీ రోడ్డు, మినీ గోకులం, పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చేనెలాఖరు నాటికి పల్లె పండగ పనులు పూర్తి చేస్తామన్నారు.