Share News

రాజ్యసభకు విజయ్‌

ABN , Publish Date - Jun 07 , 2026 | 01:03 AM

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కు శనివారం తెలుగుదేశం అధిష్ఠానం రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

రాజ్యసభకు విజయ్‌

- అభ్యర్థిత్వం ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం

- బీసీ యువనేతకు దక్కిన గౌరవం

- శ్రమ, నిబద్ధతకు గుర్తింపు

- పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు

(అనకాపల్లి, నర్సీపట్నం-ఆంధ్రజ్యోతి)

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కు శనివారం తెలుగుదేశం అధిష్ఠానం రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడికి అవకాశం కల్పించడంపై పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులకు 1984 నవంబరు 24న జన్మించిన విజయ్‌ పుణే ఎంఐటీ, అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆధునిక రాజకీయాల నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన ఆయన టీడీపీ బలోపేతానికి కృషిచేశారు. విజయ్‌కు భార్య డాక్టర్‌ సువర్ణ, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

కష్టకాలంలో పార్టీ క్యాడర్‌కు భరోసా

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ తరపున విజయ్‌ బలంగా తన గళం వినిపించారు. సోషల్‌ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, ఐటీడీపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు విశేష కృషిచేశారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కార్యకర్తలకు అండగా నిలిచిన నేతల్లో విజయ్‌ ముందువరుసలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీపీ, సోషల్‌ మీడియా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ స్వరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన కేసులతో ఇబ్బందులు పడిన 228 మంది కార్యకర్తలకు న్యాయ సహాయం అందించి, బెయిల్‌ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. అర్ధరాత్రి సమయంలో సైతం కార్యకర్తల సమస్యల పరిష్కారానికి వెనుకాడకుండా అందుబాటులో ఉండే నాయకుడిగా విజయ్‌కు గుర్తింపు ఉంది. యవగళం పాదయాత్ర సందర్భంగా కార్యకర్తల కోసం విజయ్‌ పడిన కష్టాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఐటీడీపీ సారథిగా సేవలు

‘మన టీడీపీ’ యాప్‌ రూపకల్పన, డిజిటల్‌ వ్యవస్థల అభివృద్ధి ద్వారా కార్యకర్తలను నేరుగా నాయకత్వానికి అనుసంధానం చేయడంలో విజయ్‌ కీలకపాత్ర పోషించారు. ఆయన పనితీరుపై విశ్వాసంతో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు టెక్నాలజీ ఆధారిత సభ్యత్వ నమోదు కార్యక్రమ బాధ్యతలను అప్పగించారు. కొవిడ్‌ సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వైద్య సలహాలు, సహాయక కార్యక్రమాల ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణులకు విజయ్‌ అండగా నిలిచారు. పార్టీ కోసం కష్టపడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ యువనేతకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై అన్ని వర్గాల నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


ములగాడలో 40.8

కొనసాగిన ఎండ తీవ్రత

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే వాతావరణం వేడెక్కింది. పది గంటల నుంచి వడగాడ్పులు వీయడం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల వరకు నగరం అగ్నిగుండంలా మారింది. ఆరుబయట పనుల కోసం వచ్చినవారంతా సొమ్మసిల్లారు. శనివారం నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు. అయితే ఎండ తీవ్రతకు పలుచోట్ల విద్యార్థులు తక్కువగా హాజరయ్యారు. ములగాడలో 40.8. పెందుర్తి, విశాఖ రూరల్‌లో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల తరువాత మేఘాలు ఆవరించడంతో కొంతవరకు ఉపశమనం లభించింది. అయితే వర్షం కురవకపోవడంతో రాత్రికి మళ్లీ ఉక్కపోత పెరిగింది. కాగా, ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉండే బిచ్చగాళ్లు, నిరాశ్రయలు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


తొమ్మిదో తేదీన 6 గంటల వరకే అప్పన్న దర్శనం

సింహాచలం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనం ఈనెల తొమ్మిదో తేదీన సాయంత్రం ఆరు గంటల వరకే మాత్రమే కల్పించనున్నట్టు దేవస్థానం ఈఓ జల్లేపల్లి వెంకటరావు శనివారం ప్రకటించారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం...అడివివరం, తదితర ఏడు గ్రామాల ప్రజల ఆరాధ్య దేవత, సింహాద్రినాథుని సహోదరి పైడితల్లమ్మ వార్షిక పండుగ మంగళవారం జరగనున్నది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి దేవస్థానం సిబ్బందిలో పలువురు అమ్మవారి పండుగలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆరోజు స్వామివారి దర్శనాలు సాయంత్రం ఆరు గంటలకు నిలుపుదల చేసి, రాత్రి ఆరాధనలు పూర్తిచేసి కవాట బంధనం చేస్తారన్నారు. సాయంత్రం సహస్ర నామార్చన, రాత్రి ఆరాధన, సేవలను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.


ప్రైవేటు పాఠశాలల్లో 4,073 మందికి ఉచిత సీట్లు

విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా

పేద వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో అడ్మిషన్‌

ప్రవేశాలు కల్పించేందుకు సిల్వర్‌ఓక్స్‌ నిరాకరణ

షోకాజ్‌ జారీకి విద్యా శాఖ యోచన

త్వరలో మూడో విడత సీట్ల కేటాయింపు

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా జిల్లాలో 4,073 మంది పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పించారు. ఉచిత సీట్ల కేటాయింపు కోసం ఇప్పటివరకు రెండు విడతలు రాష్ట్రస్థాయిలో లాటరీ నిర్వహించారు. తొలి దశలో జిల్లాలో 4,868 మంది అర్హులైన పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో సీట్లు కేటాయించగా 3,486 మంది ప్రవేశాలు పొందారు. రెండో దశలో 1,100 మందికి సీట్లు కేటాయించగా, వారిలో 587 మంది పాఠశాలల్లో చేరారు. మిగిలిన విద్యార్థులు పలు కారణాలతో సీట్లు పొందలేకపోయారు. అయితే అన్ని అర్హతలు ఉన్న ఆరుగురు విద్యార్థులకు సిల్వర్‌ ఓక్స్‌ పాఠశాల యాజమాన్యం ప్రవేశాలు కల్పించలేదు. పలు కారణాలతో సీట్లు ఇవ్వడానికి నిరాకరించింది. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు, సంబంధిత పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి ప్రవేశాలు కల్పించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ అధికారులు స్వయంగా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలు ఇవ్వాలని కోరారు. అయినా పాఠశాల యాజమాన్యం నిరాకరించడమే కాకుండా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి తీసుకురావడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సిల్వర్‌ ఓక్స్‌ స్కూలు యాజమాన్యానికి రెండు, మూడు రోజుల్లో షోకాజ్‌ ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే తొలివిడత ప్రవేశాల సమయంలో సీట్లు ఇవ్వని ఎంవీపీ కాలనీలోని లిటిల్‌ ఏంజిల్స్‌ యాజమాన్యానికి విద్యా శాఖ షోకాజ్‌ ఇచ్చింది. దీంతో ఏడు సీట్లకుగాను నాలుగు సీట్లు ఇచ్చి మిగిలిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదాయం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉందని మెలిక పెట్టింది. దీనిపై మరోసారి సంబంధిత పాఠశాల యాజమాన్యాన్ని పిలిచి హెచ్చరించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, నగరంలో పేరు పొందిన విశాఖ వ్యాలీ స్కూలు, టింపనీ, భాష్యం, శ్రీచైతన్య, నారాయణ, శ్రీప్రకాష్‌, సత్యసాయి స్కూళ్ల యాజమాన్యాలు ఒకటో తరగతిలో సీట్లు ఇచ్చినట్టు విద్యా శాఖ అధికారులు తెలిపారు. త్వరలో మూడో విడత లాటరీ తీయనున్నట్టు చెప్పారు.

Updated Date - Jun 07 , 2026 | 01:03 AM