Share News

కొలిక్కిరాని విజిలెన్స్‌ విచారణ!

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:33 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేసి, అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా మార్చారన్న ఆరోపణలపై నియమించిన విజిలెన్స్‌ కమిటీ ఎనిమిది నెలలుగా సాధించిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పటి వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి తన అధికారాన్ని, ప్రభుత్వ పలుకుబడిని అడ్డం పెట్టుకుని భారీగా నిధులు దుర్వినియోగం చేశారని, అస్మదీయులకు పదవులు కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

కొలిక్కిరాని  విజిలెన్స్‌ విచారణ!

వైసీపీ హయాంలో అడ్డగోలు వ్యవహారాలకు ఏయూ కేంద్రంగా మారిందన్న ఆరోపణలపై ఎంక్వయిరీ

ఎనిమిది నెలల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు

నేటికీ సాగదీత

గత పాలకుల తప్పులు తేలేనా?

ఈ నెలాఖరుకు నాటి వీసీ ఉద్యోగ విరమణ

నియామకాలలో అవకతవకలు,

నిధుల దుర్వినియోగంపై అప్పట్లో ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేసి, అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రంగా మార్చారన్న ఆరోపణలపై నియమించిన విజిలెన్స్‌ కమిటీ ఎనిమిది నెలలుగా సాధించిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పటి వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి తన అధికారాన్ని, ప్రభుత్వ పలుకుబడిని అడ్డం పెట్టుకుని భారీగా నిధులు దుర్వినియోగం చేశారని, అస్మదీయులకు పదవులు కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్డగోలు వ్యవహారాలపై విచారణ చేయించి కఠినచర్యలు తీసుకుంటామని ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నెలాఖరున మాజీ వీసీ ప్రసాదరెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ చేసేదేమిటంటూ ప్రభుత్వ తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారని భావించిన వర్సిటీలోని ఉద్యోగులు, ఈ వ్యవహారాలపై పోరాడిన టీడీపీ నాయకులు తాజా పరిణామాలపై విస్తుపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వరకు ఏయూలో జరిగిన అక్రమాలను పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయం మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో గత ఏడాది డిసెంబరులో విజిలెన్స్‌ విచారణ ప్రారంభమైంది. ఇప్పటికీ సాగుతూనే ఉంది.

అక్రమాలు ఎన్నో..

వైసీపీ హయాంలో రూసా నిధులను దుర్విని యోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే వర్సిటీ అభివృద్ధికి దాతలు అందించిన నిధులను పక్కదారి పట్టించారనే విమర్శలున్నాయి. రూ.కోట్ల నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, టీడీఆర్‌ హబ్‌ పేరుతో చేపట్టిన పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయని, అభ్యర్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారని ప్రచారం జరిగింది. అడ్డగోలుగా పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారని వర్సిటీ అధికారులే పేర్కొన్నారు. అంతేకాకుండా వర్సిటీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందంటూ ఏళ్లనాటి వృక్షాలను కూల్చివేశారు. ఆ స్థలాన్ని బయట వ్యక్తులకు కట్టబెట్టేందుకు పక్కా ప్రణాళిక రచిం చారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో చెట్లు తొలగించిన ప్రదేశాన్ని మైదానంగా మార్చారు. దీనికి ప్రైవేటు వ్యక్తులు నిధులిచ్చారని, ఇందులోనూ దుర్వినియోగం జరిగిందని తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భవన నిర్మాణ వ్యర్థాలను నార్త్‌ క్యాంపస్‌ పరిసరాల్లో భారీగా డంప్‌ చేసింది. ఇందుకోసం వర్సిటీ అధికారులకు భారీగా ముట్టజెప్పినట్టు ప్రచారం జరిగింది. అదేవిధంగా తొలగించిన వృక్షాలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నా పట్టించుకునే వారే లేకపోయారు. ఇంకా వాహనాల డీజిల్‌ వినియోగానికి సంబంధించిన బిల్లుల్లోనూ అవకతవకలు జరిగాయని, అస్మదీయులకు అడ్డగోలుగా కీలక పదవులు కట్టబెట్టారని, ఇందులో అడ్జెంక్ట్‌, హానరరీ ప్రొఫెసర్ల పోస్టులున్నాయని చెప్పేవారు. ఈ అడ్డగోలు వ్యవహారాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ వీసీ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తారని, ఆ తరువాత విజిలెన్స్‌ కమిటీ చేసేదేమీ ఉండదని వాపోతున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 01:33 AM