Share News

జేసీగా విద్యాధరి బాధ్యతల స్వీకారం

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:57 AM

రెవెన్యూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తానని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన గొబ్బిళ్ల విద్యాధరి అన్నారు.

జేసీగా విద్యాధరి బాధ్యతల స్వీకారం

రెవెన్యూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడి

విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

రెవెన్యూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తానని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన గొబ్బిళ్ల విద్యాధరి అన్నారు. ఆమెకు కలెక్టరేట్‌ పాలనాధికారి బీవీ రాణి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో విద్యాధరి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు విశాఖ జిల్లా అభివృద్ధిలో భాగస్వామినవుతానని పేర్కొన్నారు. అనంతరం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరై అర్జీలు స్వీకరించారు. జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.


ముగ్గురు రెవెన్యూ అధికారులపై అభియోగాలు నమోదు

విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

సీతమ్మధారలోని అర్బన్‌ తహశీల్దారు కార్యాలయంపై ఐదేళ్ల క్రితం ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులకు సంబంధించి ముగ్గురు అధికారులపై అభియోగాలు నమోదు చేయాలని భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ముగ్గురూ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అప్పటి తహశీల్దారు కె.జ్ఞానవేణి (ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్‌), డిప్యూటీ తహశీల్దారు ఎస్‌ఎం జిలానీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రవికృష్ణలపై అభియోగాలు నమోదుచేస్తారు. తహశీల్దారు కార్యాలయంపై ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు 2021 జూలై 20 నుంచి 22వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో లభించిన వివరాల మేరకు 2022 సెప్టెంబరు 11న ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందజేసింది. అభియోగాలు నమోదు చేసే ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:57 AM