మహానాడు దిగ్విజయం
ABN , Publish Date - May 29 , 2026 | 12:31 AM
తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు రెండు రోజుల వేడుకలు విజయవంతంగా జరిగాయి. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 73 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాలకు వేలాదిమంది పార్టీ శ్రేణులు హాజరై సందడి చేశారు. పసుపు జెండాలు, తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఆయా క్లస్టర్ ప్రాంగణాలు సందడిగా మారాయి.
73 క్లస్టర్లలో పండుగలా నిర్వహణ
ఉత్సాహంగా హాజరైన నాయకులు, కార్యకర్తలు
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుని విగ్రహాలకు పూలమాలలు
ఘనంగా నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు
కేకులు కట్‌చేసి మిఠాయిలు పంపిణీ
రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో రోగు రొట్టెలు, పండ్లు..
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు రెండు రోజుల వేడుకలు విజయవంతంగా జరిగాయి. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 73 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాలకు వేలాదిమంది పార్టీ శ్రేణులు హాజరై సందడి చేశారు. పసుపు జెండాలు, తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఆయా క్లస్టర్ ప్రాంగణాలు సందడిగా మారాయి. వర్చువల్ మహానాడు వేడుకలకు తొలిరోజు 24,507 మంది, రెండో రోజు 42,481 మంది... మొత్తం 66,988 మంది హాజరయ్యారు. రెండో రోజు ఉదయం మహానాడు ప్రారంభం కాగానే తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ‘ఎన్టీఆర్ అమర్‌రహే’ ‘తెలుగుదేశం వర్దిల్లాలి’, ‘చంద్రబాబు జిందాబాద్’ అంటూ కార్యకర్తలు నినదించారు. తెలుగు జాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ చేసిన కృషిని శ్లా ఘించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకువచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు, గర్భిణులు, బాలింతలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. మరోవైపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడును, నేతల ప్రసంగాలను ఎల్‌ఈడీ స్ర్కీన్లపై ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు, తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా ఎన్‌టీ రామారావు చేసిన సేవలను, అమలుచేసిన సంక్షేమ పథకాల గురించి పలువురు నేతలు మాట్లాడారు. ఎన్టీఆర్ తదనంతరం తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబునాయుడు అంటూ కొనియాడారు. యువనేత, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయా క్లస్టర్లలో నేతలు సూచించిన అంశాలపై తీర్మానాలు చేసి మహానాడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. మహిళలు, యువత, పెద్ద ఎత్తున పాల్గొనడంతో మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో సాగాయి.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, అనకాపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, నియోజకవర్గం పరిశీలకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, సీనియర్ నాయకులు మళ్ల సురేంద్ర, దాడి రత్నాకర్, ఎం.నీలబాబు, బి.శ్రీనివాసరావు, తదితరులు అనకాపల్లిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేశ్, పరిశీలకుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాకవరపాలెం, రావికమతం మండలాల్లోని క్లస్టర్లలో జరిగిన మహానాడు సభలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతబాబు హాజరయ్యారు. చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, పరిశీలకురాలు గాయత్రి హాజరయ్యారు. బుచ్చెయ్యపేట మండల నాయకులు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేట నియోకవర్గ పరిశీలకురాలు ఈతలపాక సుజాత, ఇన్‌చార్జి కొప్పిశెట్టి వెంకటేశ్‌లు మహానాడు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఎలమంచిలిలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పి.రాజశేఖర్, రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మునగపాక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు హాజరయ్యారు. మాడుగుల నియోజకవర్గంలోని కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ యువ నేత బండారు అప్పలనాయుడు హాజరయ్యారు. పెందుర్తి నియోజకవర్గంలో ఇన్‌చార్జి గండి బాబ్జీ, స్థానిక సీనియర్ టీడీపీ నాయకులు హాజరయ్యారు.