Share News

ఏయూ శతాబ్ది వేడుకలకు ఉప రాష్ట్రపతి, గవర్నర్‌, సీఎం

ABN , Publish Date - Apr 26 , 2026 | 01:34 AM

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు.

ఏయూ శతాబ్ది వేడుకలకు ఉప రాష్ట్రపతి, గవర్నర్‌, సీఎం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు. ఆదివారం గవర్నర్‌, సోమవారం ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి రానున్నారు.

27న ఉప రాష్ట్రపతి...

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం ఉదయం 7.40 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి పది గంటలకు విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ డేగా (నౌకాదళ ఎయిర్‌ స్టేషన్‌)కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీకాకుళం వెళ్లి శ్రీకూర్మనాథస్వామి, అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామిని దర్శించుకుంటారు. అనంతరం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు ఇంటికి వెళతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ఐఎన్‌ఎస్‌ డేగాకు వస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రి ఏడు గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని 7.15 గంటలకు తిరుపతి బయలుదేరి వెళతారు.

నేడు గవర్నర్‌ రాక

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆదివారం రాత్రి 20.35 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 9.40 గంటలకు విశాఖ చేరుకుని నోవాటెల్‌ హోటల్‌లో బస చేస్తారు. 27వ తేదీన నగరానికి రానున్న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఐఎన్‌ఎస్‌ డేగాలో స్వాగతం పలుకుతారు. సోమవారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. రాత్రికి నోవాటెల్‌ హోటల్‌లో బస చేసి 28వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు విజయవాడకు బయలుదేరి వెళతారు.

27న సీఎం రాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మూడు గంటలకు ఆర్కే బీచ్‌రోడ్డు (కోస్టర్‌ బ్యాటరీ సమీపాన హెలిప్యాడ్‌ ఏర్పాటుచేశారు)కు చేరుకుంటారు. 3.35 గంటలకు రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి వెళతారు. అక్కడ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికి, ఆయనతో కలిసి ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6.20 గంటలకు పోర్టు అతిథి గృహానికి వెళ్లి విశ్రాంతి తీసుకుని, రాత్రి 7.30 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. గూగుల్‌ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం 8.30 గంటలకు పోర్టు అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు. మంగళవారం ఉదయం 8.55 గంటలకు హెలికాప్టర్‌ (కోస్టల్‌ బ్యాటరీ వద్ద నుంచి)లో ఆనందపురం మండలం తర్లువాడ వెళతారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన, అనంతరం సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి 11.40 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లి బయలుదేరి వెళతారు.

Updated Date - Apr 26 , 2026 | 01:34 AM